– అమరావతి రైతుల్ని ఏం చేయదల్చారు?
– మందడం రైతు మరణానికీ వైయస్సార్సీపీకి ఏం సంబంధం?
– రైతు మరణ వాంగ్మూలంపైనా సీఆర్డీయే సిగ్గు లేని ప్రచారం
– అమరావతికి భూములిచ్చిన రైతుల్ని పునాదుల్లో కలిపేస్తారా?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: అమరావతిలో అన్ని టెండర్లూ మాస్ కాపీయింగ్లా నాలుగు శాతమే ఎందుకు వేస్తున్నారో చెప్పండి. అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఏకమై మాస్ కాపీయిగ్లా మాస్ దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో మందడం రైతు రాములు, మీ మంత్రి నారాయణ పెట్టిన సభలో మరణించారు. దీంతో ఆయనకు స్టంట్లు ఉన్నాయి కాబట్టి చనిపోయారని ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు.
నిజానికి చనిపోక ముందు మందడం రాములు మాట్లాడిన మాటల్ని మరణ వాంగ్మూలంలా తీసుకోవాలి కదా. తనకు వాగులో స్థలం ఇచ్చారని ఆయన చనిపోకముందు ఆరోపిస్తే.. కాదని వాదించిన సీఆర్డీఏ అధికారులు రేపు జైలుకెళ్లాల్సిందే. రికార్డుల్లో చెరువుగా ఉన్న ప్రాంతంలో రైతులకు పట్టాలు ఇచ్చారు!. మరి వాళ్లకు రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సీఆర్డీయే వాళ్లు కూడా రాజకీయ పార్టీల్లో చేరిపోవచ్చు కదా!. రాములు మరణవాంగ్మూలం ఇచ్చినా సిగ్గులేకుండా ప్రెస్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
మందడంలో రాములు ఇల్లు లాక్కున్నారు. పొలం లాక్కున్నారు. ఇందులో వైయస్సార్సీపీ పాత్ర ఎక్కడుంది?. అసలు ఆ మరణాన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారు? భోరున విలపిస్తున్న ఆ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారా? రాములు మరణంపై కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేలు అక్కడ ఎందుకు మాట్లాడటం లేదు?.
అమరావతి అభివద్దిలో ఫలాలు భూములిచ్చిన రైతులు అనుభవించేలా ఉండాలి తప్ప, అక్కడి పునాదుల్లో వాళ్లు పడి చచ్చేలా ఉండకూడదు. అలా వాళ్లకు ఆస్తులు ఇవ్వడం ఎందుకు అనేది చంద్రబాబు ఆలోచించుకోవాలి. కాబట్టి చంద్రబాబు ఇకనైనా తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు మంచి అనువైన చోట వారికి ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.
మెడికల్ కాలేజీలకు నో బిడ్స్… డైవర్షన్ పాలిటిక్స్:
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిస్తే స్పందన కరవైంది. వచ్చిన ఒక టెండర్ కూడా కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ పేరుతో వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఇంకా నయం కిమ్స్‌లో పని చేసే అటెండర్ తోనో, కాంపౌండర్ తోనే, మార్చురీలో పని చేసే వాళ్లతో వేయించామని చెప్పలేదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తాం. టెండర్లు వేసిన వారి వెనుక ఉన్నదెవరో తేలుస్తాం.
కాగా, ఇప్పుడు మెడికల కాలేజీల ప్రైవేటీకరణకు బిడ్లు రాకపోవడంతో, అక్కడా జగన్నే నిందిస్తున్నారు. ఆయన బెదిరించడం వల్లనే బిడ్డర్లు మందుకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. మరి నిన్నటిదాకా ఏమో.. జగన్ ఈ రాష్ట్రం నుండి వ్యాపారస్తుల్ని తోలేస్తే తాము రాగానే అంతా క్యూ కట్టేస్తున్నారని చెప్పుకున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల కోసం వారెందుకు రావడం లేదు?.
ఎందుకంటే.. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపంలో భాగం తమకెందుకని టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అందరూ భావిస్తున్నారు.
అసలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈ ప్రభుత్వం ఎవరితోనైనా చర్చించిందా?. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిందా?. గత ప్రభుత్వంలో జగన్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తామని చెప్పి, ఓట్లు అడిగి గెలిచి ఉంటే అప్పుడు ఎవర్నీ అడగాల్సిన అవసరం లేదు. కానీ అలా చెప్పలేదు కదా?.
మరి ఏకపక్షంగా ఎలా ముందుకెళ్తారు? తండ్రీ కొడుకులు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందా? ఆఖరికి మీ జెండా మోసిన వాళ్లు, పవన్ కళ్యాణ్ జెండా మోసిన వాళ్లు కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నర్ కి ఇచ్చిన అర్జీల్లో సంతకాలు పెట్టారు. అయినా జ్ఞానం రావట్లేదు. ఇప్పటికీ తప్పు తెలుసుకోకపోగా వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా.. జగన్ పుట్టినరోజు. ఫ్లెక్సీలు. జంతుబలులు. రక్త తర్పణాల అంటూ.. లేనిపోని రచ్చ చేస్తున్నారు. ఆ విధంగా మా పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు.