– 19 నెలల్లో ఆర్యవైశ్యులపై విపరీతంగా దాడులు
– పొట్టి శ్రీరాములు విగ్రహం పేరుతో కూటమి నేతల దోపిడీ
– వ్యాపారులపై వేధింపులు ఆగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
– పిడుగురాళ్ల ఘటనలో సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి
– వైయస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్
– ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ దమనకాండ
– ప్రభుత్వం వ్యాపారులకు క్షమాపణ చెప్పాలి
– దాడికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలి
– మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు డిమాండ్
తిరుపతి: కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు భద్రత లేకుండా పోయిందని వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్వద్ద మీడియాతో మాట్లాడుతూ… 19 నెలల పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు, వేధింపులు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగంతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
పొదిలి లో అవినాష్ అనే ఆర్యవైశ్య యువకుడి షాపు ముందు లారీ నిలబడిందనే కారణంతో అక్కడ ఉన్న ఎస్ఐ లారీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం అదే షాపు యజమాని కుమారుడు అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు. ఎస్ఐ విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడి శరీరంపై రక్తగాయాలు అయ్యాయి.
ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ మరోసారి అవినాష్‌పై దాడి చేశారు. ఈ దాడిని ప్రశ్నిస్తూ “మా కుమారుడిని ఎందుకు ఇలా కొట్టారు?” అని అవినాష్ తండ్రి కోటేశ్వరరావు అడిగితే, తండ్రి–కొడుకులిద్దరినీ పోలీసులు చితకబాదారు. పొదిలిలో జరిగిన ఈ దారుణ ఘటన పోలీసు వ్యవస్థలో పెరిగిపోయిన దౌర్జన్యానికి నిదర్శం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. దాడికి పాల్పడిన ఎస్ఐపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
పైకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యులపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారు కానీ.. వాస్తవంగా కూటమి పాలనలో దాడులు, వేధింపులు గణనీయంగా పెరిగాయి.
అదే విధంగా పిడుగురాళ్లలో ఆర్యవైశ్య వ్యాపారిని వేధించి, అతని భార్యపై దురుసుగా ప్రవర్తించిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారులందరినీ కలుపుకొని ఉద్యమాలు చేపట్టడం ఖాయం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వ్యాపారుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలి.. లేని పక్షంలో వారి తరుపున వైయస్సార్ కాంగ్రెస్ కూడా పోరాటం చేస్తుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. 19 నెలల పాలనలో టీటీడీ పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. పాలకవర్గం సభ్యులు, అధికారులు సామాన్య భక్తుల సమస్యలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుల దర్శనాలు, భజనకే పరిమితమయ్యారు. సాధారణ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో టీటీడీ విఫలమైంది. దర్శన క్యూలైన్లలో సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇటీవల తోపులాట ఘటన చోటుచేసుకుని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో సామాన్య భక్తులకు సౌకర్యాలు లేవని, దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్ర క్షేత్రమైన తిరుమలలో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది, దీనికి పూర్తిగా టీటీడీ పాలకవర్గం వైఫల్యమే కారణమని వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టీటీడీ వ్యవస్థను సరిచేసి, భక్తులకు తగిన సౌకర్యాలు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసు దమనకాండ : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు దమనకాండ కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హైకోర్టు హెచ్చరికలు చేసినప్పటికీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. పొదిలిలో వ్యాపారం చేస్తున్న ఆర్యవైశ్య వ్యక్తిపై నడిరోడ్డుపై పోలీసులు చేసిన దాడి, అతడిని చిత్రహింసలకు గురి చేయడం, అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన తీరు రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని తెలిపారు.
కూటమి నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు దండలు వేయడం, ఆయన పేరు చెప్పుకుని గొప్పలు చెప్పడం కాకుండా, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలన్నారు. పొదిలిలో జరిగిన సంఘటనపై వెంటనే ఆర్యవైశ్యులకు, వ్యాపారులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై స్పష్టమైన కార్యాచరణ రూపకల్పన చేసి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని మల్లాది విష్ణు హెచ్చరించారు.
వ్యాపార వర్గాలు సాధారణంగా సౌమ్య స్వభావం కలవారని, అలాంటి వ్యాపారులపై జరిగిన ఈ దాడిని అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఉద్యమాలకు దిగుతామని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.