నిన్నటి వరకు కళకళలాడిన 2025వ సంవత్సరం ఈరోజుతో పాతబడిపోతుంది అంటున్నారు. అది మన పర్సెప్షన్ అనిపిస్తుంది. నిన్నటి మన ఆలోచన రేపటికి పాతబడిపోవచ్చు. కాలం పాతబడటం అనేది ఉండదు. భూమి మీద ప్రాణికోటి పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, కాలగర్భంలో కలిసిపోతుంది; కానీ కాలం నిరంతరం ఒకేలా ఉంటుంది.
కాలాన్ని కొలవడానికి మనం రూపొందించుకున్న అంకెలు, అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. అదే క్రమంలో 2026కు స్వాగతం పలుకుతూ 2025 వెళ్ళిపోతున్నది. ఘనమైన వీడ్కోలుకు జనం సిద్ధమవుతున్నారు. అలా సిద్ధపడుతున్న వారికి వెసులుబాటుగా ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను మారుస్తున్నాయి.
చిన్నప్పుడు న్యూ ఇయర్ వేడుకలు అంటే జనవరి ఫస్ట్ నాడు ఆపిల్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండేవారు. ఆపిల్స్ ప్రత్యేకత ఏమిటో తెలియదు కానీ అవే పంపించేవారు. ఇప్పటి మాదిరిగా అప్పటికి ఒక మోస్తరు పట్టణాలలో కూడా ఆపిల్స్ దొరికేవి కావు. అందుకని జనవరి ఫస్ట్ పిల్లలకు సరదాగానే ఉండేది. జీవనశైలి మారినట్లే భారతదేశంలో కూడా డిసెంబర్ 31 నాడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సంస్కృతి మొదలయింది.
కొంతకాలం క్రితం వరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ చుట్టూ తిరగటం సరదాగా ఉండేది. యువత కేరింతల మధ్య అదొక సందడి. చివరకు నియంత్రించలేనంత ట్రాఫిక్ పెరిగిపోయి నెక్లెస్ రోడ్డుకు ట్రాఫిక్ నిబంధనలు విధించవలసి వచ్చింది. ప్రస్తుతం వేడుకల తీరు మారిపోయి ఈవెంట్ కల్చర్ వచ్చేసింది. కొన్ని వేలకోట్ల వ్యాపారం అయిపోయింది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లే, మార్పులకు కూడా అలవాటు పడుతున్నాము. అందునా ఉత్సాహంతో చెలరేగిపోయే యువభారతం! విందులు వినోదాల మధ్యలో ఎవరికి వారు తమ కొత్త సంవత్సరపు శపథాలు చెబుతుంటారు. కాకపోతే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటారు. సరదాగా నాలుగు రోజులు ఆచరిస్తారు, వచ్చే సంవత్సరానికి అదే శపథాన్ని సిద్ధంగా ఉంచుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఉగాదిని ఘనంగా జరుపుకుంటాము.
ఉగాది నుండి రాబోయే ఉగాది వరకు మనకు ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి పంచాంగశ్రవణం కూడా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ సంవత్సరం నాడే శపథాలు చేస్తాం. నిన్న ఒక స్నేహితురాలు తాను కొత్త సంవత్సరం మొదలైన రోజు నుండి తన మనసుకు నచ్చిన రీతిగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది. చిన్నప్పటి నుండి మేమిద్దరం అలా అనుకుంటూనే ఉన్నామని గుర్తు చేశాను, అదొక సరదా.
అయితే 2025 సంతోషపెట్టిన దానికంటే ఎక్కువగా ప్రపంచాన్ని గందరగోళం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి తిరిగి ప్రవేశించగానే తనదైన జాతీయవాదంతో సుంకాల యుద్ధం మొదలుపెట్టి ప్రపంచాన్ని అయోమయంలోకి నెట్టేశారు. బంగ్లాదేశ్, ఈక్వడార్, ఆర్మేనియా, హైతీ, సోమాలియా, బల్గేరియా లాంటి దేశాలే కాక, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా అంతర్గత సంక్షోభంతో అట్టుడికిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉన్న దక్షిణ కొరియాలో అధ్యక్షుడిని, థాయిలాండ్ ప్రధానమంత్రిని పదవీచ్యుతులను చేశారు ప్రజలు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కొత్తగా మొదలైంది కాకపోయినా జోరుగా సాగుతూనే ఉన్నది.
మరీ ప్రత్యేకంగా 2025 ప్రత్యేకత ‘జనరేషన్ జి’ (Gen Z) ప్రొటెస్టులు. ఇవి నేపాల్, మడగాస్కర్ దేశాల ప్రభుత్వాలను కూల్చడమే కాక హింస, ఆస్తుల విధ్వంసం, మరియు నిప్పు పెట్టడంతో ప్రపంచాన్ని భయానికి గురిచేసింది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతే సమాజం ఎటువంటి పరిణామాలకు గురవుతుందో ఆలోచించేలా చేసింది. పుతిన్ నివాసం పైన డ్రోన్ల దాడితో 2025 ముగింపును మరింత అల్లకల్లోల సంవత్సరంగా ముగించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో మనదేశంలో పెహల్గాం రక్తమోడింది. దీటుగా బదులిచ్చిన భారత వీరజవాన్లలో అసువులుబాసిన వారిని జాతి ఎప్పటికీ మరచిపోదు.
ఆర్థికరంగంలో భారతదేశం అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో నాలుగవ ఆర్థికవ్యవస్థగా అవతరించి తన ప్రత్యేకతను చాటుకున్నది. ట్రంప్‌తో చైనా మాదిరిగా సుంకాల యుద్ధం చేయగలిగే శక్తివంతమైన ఆర్థికవ్యవస్థ కానప్పటికీ, చిన్న చిన్న వెసులుబాటులతో దేశ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ట్రంప్ విధించిన వీసా నిబంధనలు భారత యువతని నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా టెక్ రంగంపై ట్రంప్ నిబంధనలు గట్టిగానే ప్రభావం చూపించాయి. ఫలితంగా దేశీయ టెక్ సంస్థలు కొత్తవారికి ఉపాధి కల్పించడంలో విఫలమవడమే కాక, ఉన్నవారిని కూడా వదిలించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. గత పాతిక సంవత్సరాలలో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితే కాక ఇది అనూహ్యమైనది.
తెలుగు రాష్ట్రాల యువత డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయే సమయంలో ప్రత్యామ్నాయాల కోసం ప్రభుత్వాల వెతుకులాట మొదలైంది. ఇన్ఫ్రాను అభివృద్ధి చేసే ఆలోచనతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే; క్వాంటం వ్యాలీ, ఏఐలను ఉపయోగించి యువత భవిష్యత్తుకు దారులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపే దిశగా చంద్రబాబు – లోకేష్ ద్వయం వడివడిగానే అడుగులు వేస్తున్నారు.
గూగుల్ లాంటి సంస్థల నుండి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో వారి కృషి ఫలించడమే కాక, గ్రీన్ ఎనర్జీ గమ్యస్థానంగా కూడా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా 2024లో చేదు ఫలితాలను చవిచూసిన భారతీయ జనతా పార్టీ, 2025లో అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. గెలుపును విపక్షానికి అందనంత దూరం తీసుకెళ్ళిపోయింది. 2026లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ‘ఇండియా బ్లాక్’ గెలుపు సాధించలేకపోతే భవిష్యత్తులో వాటి ఉనికి ప్రశ్నార్థకమయ్యేంతగా భారతీయ జనతా పార్టీ దేశంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది.
ఏ కాలంలోనైనా, ఎవరికైనా సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ మంచి చెడులు రెండూ ఉంటాయి. అవి సమాజపరంగానైనా, రాజకీయంగానైనా, వ్యక్తిగతంగానైనా ఉండవచ్చు. గతం నుండి గుణపాఠం నేర్చుకుంటామా, పాఠం నేర్చుకుంటామా అనేది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. జారిపోయిన కాలం మరలా రాకపోవచ్చు కానీ, చేజారిన మన సంతోషాలను మాత్రం మన ప్రయత్నంతో తిరిగి సమకూర్చుకోవచ్చు.
ప్రపంచం నుండి ఎన్ని సవాళ్లు ఎదురైనా, నవయవ్వనంతో తొణికిసలాడే యువశక్తిని కలిగి ఉన్న భారతదేశం ఆ సవాళ్లను స్వీకరించగలదు; వాటిని తిప్పికొట్టి, అజరామరమైన విజయాల దిశగా ప్రయాణించగలదు అనే ఆత్మవిశ్వాసంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– ఇంద్రాణి