– 30% నుంచి 40% వరకు ఉన్న ప్రతికూలతను ఎలా తొలగించాలని మంత్రి ప్రశ్న
– వైద్యుల గైర్హాజరీని ఉపేక్షించేది లేదు
– సర్వీస్ నుoచి పూర్తిగా తొలిగించేoదుకు కూడా వెనుకాడేది లేదు
– ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు వైద్య సిబ్బంది పునరంకితం కావాలి
– ఆసుపత్రులు, వైద్యుల పనితీరును రియల్ టైములో నిరంతరం పర్యవేక్షిస్తామన్న కార్యదర్శి
– సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్ల పనితీరుపై 7 గంటల సుదీర్ఘ సమీక్ష
విజయవాడ: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో నిరంతరం పెరుగుతున్న ఓపీ, ఐపీ రోగుల సంఖ్య వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తోందని, అయితే పలు విషయాల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని, ఈ దిశగా వైద్యులు, వైద్య సిబ్బంది పునరంకింతం కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం సుమారు ఏడు గంటలపాటు 17 జీజీహెచ్ ల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
వైద్యుల గైర్హాజరీపై కఠిన వైఖరి
గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో వైద్యులు, ఇతర సిబ్బంది హజరులో 8%కుపైగా వృద్ధి నమోదైందని, అయితే కేవలం దీని ఆధారంగానే వైద్య సేవల నాణ్యతను మదింపు చేయలేమని మంత్రి పేర్కొన్నారు జీజీహెచ్ కు వచ్చే రోగుల అనుభవాలు, సేవలపట్ల వారు వ్యక్తంచేసే అభిప్రాయాలు ముఖ్యమైనవని పేర్కొన్నారు.
ఈ దిశగా పూర్తి సానుకూల ఫలితాలు సాధించేందుకు వైద్యులు, సహాయక సిబ్బంది సమష్టిగా కృషిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన కాలంలో అధిక సంఖ్యలో వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారన్నారు. కొంతమంది రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు విధులకు దూరంగా ఉన్నందున ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం కనబడుతోందని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రస్తుత నియమాల మేరకు సంవత్సరం కాలం కంటే పైగా అనుమతి లేకుండా విధులకు దూరంగా ఉండే వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు కూడా వెనుకాడమని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పలువురు వైద్యులు తమకు నచ్చనిచోట్లకు పోస్టింగులు వస్తే కుంటిసాకులతో దీర్ఘకాలంగా కొత్త ప్రదేశాల్లో బాధ్యతలు చేపట్టడంలేదని తెలిపారు.
కొంతమేరకు వ్యవస్థలోని అలసత్వంవల్ల కూడా ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో వైద్యులు పోస్టింగు ఇచ్చిన లేదా బదిలీ చేసిన స్థానాల్లో నిర్దిష్ట సమయంలో విధులు చేపట్టకపోతే వారిని వెంటనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కు సరెండర్ చేసి, సదరు వైద్యుల నుంచి వివరణలు తీసుకుని అవసరమైతే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సంవత్సరంపాటు అదే తీరు కొనసాగితే ఎందుకు సర్వీసుల నుంచి తొలగించకూడదో నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
చిరునవ్వుతో సేవలు అందించాలి
అనారోగ్యంతో వచ్చే వారికి స్వస్థత చేకూర్చడం వైద్యులకు లభించిన మహత్తర అవకాశమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. రోగులను చిరునవ్వుతో పలుకరించి, వారితో అప్యాయంగా మాట్లాడి, వ్యాధిని నయంచేసి, వారు చిరునవ్వుతో ఇంటికి వెళ్లేలా వైద్యులు వ్యవహరించాలని మంత్రి సూచించారు
ప్రభుత్వ వైద్యులు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహస్తున్నారని పేర్కొన్నారు. వైద్య సేవల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండడం వైద్యుల కృషికి అద్దంపడుతుందని మంత్రి ప్రశంసించారు.
ప్రజల్లో సానుకూలత
గత డిసెంబరులో సేకరించిన ప్రజాభిప్రాయం మేరకు జీజీహెచ్ లో లభించే వైద్యసేవలపట్ల వివిధ అంశాలపై 60% నుంచి 70% రోగులు సంతృప్తి వ్యక్తంచేశారని మంత్రి వెల్లడించారు. వైద్యుల అందుబాటు, ఉచిత మందుల సరఫరా, అవినీతి మరియు పరిశుభ్రత అంశాల్లో ప్రజల్లో సానుకూలత ఈ మేరకు వ్యక్తమైందని, అయితే 30% నుంచి 40% వరకు ఉన్న ప్రతికూలతను తొలగించడం సూపరింటెండెంట్ల బాధ్యత అని మంత్రి స్పష్టంచేశారు.
రొటీన్గా కాకుండా.. వినూత్న ఆలోచనలతో, ఇనుమడించిన దీక్షతోటి ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. 17 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మంజూరైన పడకల కంటే అదనంగా అధిక సంఖ్యలో వాటిని ఏర్పాటుచేసి, రోగులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కొన్ని చిన్నచిన్న లోపాలతో మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలవల్ల అననుకూల అభిప్రాయం ఏర్పడుతోందని, సమరమైన నిర్వహణతో సూపరింటెండెంట్లు దీనిని పరిష్కరించాలని మంత్రి సూచించారు.
ఉత్తమ వైద్య విద్యను అందించాలి.
ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా ఉత్తమ వైద్యులను సమాజానికి అందించేందుకు పటిష్టమైన ప్రమాణాలతో వైద్య విద్య బోధన జరగాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రిన్సిపాళ్లకు స్పష్టంచేశారు. వివిధ కళాశాలల మధ్య పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్కులో పాల్గొని రాష్ట్రం, దేశ వ్యాప్తంగా ర్యాంకులు పొందేలా ప్రిన్సిపాళ్లు చర్చలు చేపట్టాలని మంత్రి సూచించారు. బోధనా సిబ్బంది పటిమను నిరంతరం మదింపు చేయాలని, దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసే వైద్య నిపుణులను రాష్ట్రంలోని కళాశాలలకు ఆహ్వానించాలని వైద్యులకు పాఠాలు చెప్పించాలని సూచించారు.
పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తాం
సాంకేతిక సాయంతో ప్రభుత్వాసుపత్రులు, వైద్యుల పనితీరును రియల్ టైములో నిత్యం పర్యవేక్షించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిన్యువస్ కేర్ సూత్రం కింద ప్రాథమిక, సెకండరీ మరియు టెర్షియరి ఆసుపత్రుల మధ్య ఏకీకృత విధానంలో రోగులకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరాల మేరకు సేవలు అందించాలని ఆదేశించారని, ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
డిసెంబరులో జీజీహెచ్ ల పనితీరు
గత డిసెంబరులో జీజీహెచ్లు లక్ష్యాలకు మించి ఫలితాలు సాధించాయని సౌరభ్ గౌర్ వెల్లడించారు. ఓపీ సేవల లక్ష్యం 6,54,875 కాగా 9,45,653 మందికి ఓపీ సేవలు అందించడం ద్వారా 44% వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. అదేవిధంగా శస్త్రచికిత్సల్లో 40%, రోగ నిర్ధారణ పరీక్షల్లో 150% పెరుగుదల సాధించామని సౌరభ్ గౌర్ వివరించారు.
తొలి 3 స్థానాల్లో విశాఖపట్నం, అనంతపురం, విజయవాడ
ఆసుపత్రులు గత నెల (డిసెంబరు) లో ఓపీ సేవలు అందించడంలో విశాఖపట్టణం, అనంతపురం, విజయవాడ ప్రభుత్వాసుపత్రులు లక్ష్యం కంటే వంద శాతానికిపైగా రోగులకు సేవలు అందించి అగ్రస్థానంలో నిలిచాయి. నెల్లూరు, మచిలీపట్నం, ఏలూరు ప్రభుత్వాసుపత్రులు అట్టడుగు నుంచి మూడు స్థానాల్లో నిలిచాయి. శస్త్ర చికిత్సలు చేయడంలో విజయవాడ, మచిలీపట్టణం, ఒంగోలు ప్రభుత్వాసుపత్రులు తొలి 3 స్థానాల్లో, అట్టడుగు నుంచి 3 స్థానాల్లో గుంటూరు, కడప, పాడేరు ఆసుపత్రి ఉన్నాయి.
పరిశోధనలు పెంచేoదుకు కృషి
ఈ సమావేశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో పరిశోధనలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేదికను అలంకరించి వారిలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఏడీఎంఈ వెంకటేశ్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష ఎజెండా
శుక్రవారం ఏడు గంటల వరకు జరిగిన సమీక్షలో పలు అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఆసుపత్రుల్లో ఆవరణల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి సూపరింటెండెంట్లు ఏజెన్సీలతో నిష్కర్షగా వ్యవహరించాలని సమీక్షలో నిర్ణయించారు.
గతంలో కొందరు సూపరింటెండెంట్లు ఏజెన్సీలకు 95% మార్కులు ఇచ్చి, అనంతరం వారి సేవలు సరిగా లేనట్లు ఫిర్యాదులు రావడంతో కోర్టుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, అవి పునరావృతం కాకుండా చూడాలన్న దానిపై సమీక్షలో చర్చ జరిగింది.
సెక్యూరిటీ సిబ్బంది నియమాలకు సంబంధించి ఆడిటింగ్ చేయించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. రోగులకు అందించే ఆహారం విషయంలో నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలని, ఆసుపత్రుల్లో అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అవసరం ఉందన్న అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైంది. ఉచితంగా సరఫరా చేసే మందుల కొనుగోళ్లకు సంబంధించి బడ్జెటు విషయంలో శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాల్సిన విషయంపై విస్తృతంగా చర్చ జరిగింది.
కోవిడ్ అనంతరం కూడా పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగినట్లు వచ్చిన కొన్ని నివేదికలపై ఆందోళన వ్యక్తంకాగా ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలని నిర్ణయించారు. బయోమెడికల్ ఎక్వెప్మెంటు కొనుగోలు, నిర్వహణకు సంబంధించి తగు చర్యలద్వారా వ్యయాన్ని తగ్గించాలన్న అభిప్రాయం కూడా సమీక్షలో వెల్లడింది