– ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఏ చర్యా లేదు
– ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే ఏ చర్యా లేదు
– రాష్ట్రం ఒక జంగిల్ రాజ్
– కూటమి ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం
– విచ్చలవిడితనం, హద్దులేని బరితెగింపులు నిత్యకృత్యం
– జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
– క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర
– వారి ద్వారానే రెండు ప్రభుత్వాల మధ్య తేడా చూపిస్తాం
– పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.
ఏలూరు నియోజకవర్గంతో ఈ తరహా సమావేశాలు మొదలు కాగా, రెండో సమావేశం భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో జరిగింది.
ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే మన హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి, ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో. తినుకో. పంచుకో. అదే డీపీటీ. అదే మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం.
ఎక్కడ చూసినా, ప్రతిచోటా విచ్చలవిడి దోపిడీ. అవినీతి. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోంది అంటే, అసలు పాలకులు ఉన్నారా అని మనకే అనిపించే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతుంది అంటే.. చంద్రబాబు మొదలు కింది వరకు ఇంత అని పంచుకుంటున్నారు.
ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నారు. కానీ, ఎక్కడా ఫ్రీగా లేదు. ధర గతంలో కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. అయిదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. చివరకు ఏ ఒక్క గనిని వదలడం లేదు. సిలికా, మైకా, లాటరైట్, క్వార్ట్. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.
భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్‌లో ఉండి ఏమన్నాడు. ‘ఊపేయ్.. కుదిపేయ్’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?.
కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయింది. విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది అంటే, చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. .
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే, ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే, ఏ చర్యా లేదు. ఆముదాలవలస అమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించ లేక ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యా యత్నం చేసింది. అయినా ఏ చర్య లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా, చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు. ఎంత దారుణం.
మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే.. అతణ్ని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. ఇంక ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది.
ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే, జైల్లో పెట్టాల్సింది పోయి, వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరంటే సాక్షాత్తూ చంద్రబాబునాయుడుగారు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. విచ్చలవిడితనం, దోపిడీ.
పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలు. రూ.700 కోట్ల చొప్పున రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ.
వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ
నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్ శిక్షణ, ఇంగ్లిష్ మీడియమ్, ట్యాబ్‌లు ఆగిపోయాయి.
మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలు. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు.
ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు. రూ.6 వేల కోట్లకు రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. ఇంకా మెడికల్ కాలేజీల అమ్మకం దారుణం.
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. రైతు భరోసా రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. యూనిట్ విద్యుత్ రూ.1.50 కే ఇచ్చాం. అలా విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి.
ఏమీ చేయని చంద్రబాబును ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు
మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తాను. అలా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటాను. ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం.
చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.
జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి, కోవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్ 2.0 లో కార్యకర్తలు టాప్ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం. భీమవరం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడుతో పాటు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.