– పవన్ ఇచ్చిన బలం చూసుకునే మా ఇంటిపై కాపుల దాడి
– కాపుగా పుట్టినందుకు గర్విస్తున్నా
– మానన్న బాబును తిట్టలేదు
– ఇంటిపై దాడి జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు?
– రాజమండ్రి జైలు వద్ద మీడియాతో అంబటి కుమార్తె మౌనిక
రాజమండ్రి: పవన్ కల్యాణ్ ఇచ్చిన బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ ఇంటిపై కాపులు దాడి చేశారు. కాపు కులంలో పుట్టినందుకు తాను ఎంతో గర్విస్తున్నా. కాపు కులస్తులంతా పవన్ వైపు ఉన్నారు. కాపు మహిళలమైన తమను తిడుతూ తమ ఇంటిపై దాడి చేశారని అంబటి రాంబాబు కూతురు మౌనిక మండిపడ్డారు. చంద్రబాబు గురించి తన తండ్రి అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు.
తప్పుల్ని ప్రశ్నిస్తే చంద్రబాబు తల్లిని అన్నట్టుగా చెబుతూ ఇంటిపై దాడి చేశారని అన్నారు. తమ ఇంటిపై దాడి జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
జైల్లో ఉన్న అంబటిని ఆయన కూతురు మౌనిక పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చంద్రబాబు ఎన్నోసార్లు తిట్టారని మౌనిక అన్నారు. తిరుమల లడ్డూ గురించి వాస్తవాలు మాట్లాడినందుకే తమ ఇంటిపై దాడి చేశారు. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకే దాడికి దిగారని చెప్పారు.