– నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా లోకేషే బాధ్యుడు
– నేను ఏ తప్పూ చేయలేదని దుర్గమ్మ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని చెప్పా
– నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమని సవాల్ చేశా
– మాజీ మంత్రి జోగి రమేష్ ప్రకటన
ఇబ్రహీంపట్నం: భవిష్యత్తులో తనకు, తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి మంత్రి నారా లోకేషే పూర్తి బాధ్యుడని, ఆదివారం తన ఇంటిపై జరిగిన దాడి కూడా లోకేష్ ఆదేశాలతోనే ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీసుల అండతో వారి సమక్షంలోనే టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులతో దాడి చేసి తనని, తన కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర చేశారని జోగి రమేష్ వెల్లడించారు. తన దైవం తిరుమలేశుడు అని, తన నాయకుడు వైయస్ జగన్ అని చెప్పారు. మరి ఆ జగన్‌పై నిందలేస్తే ఎలా ఊర్కుంటామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తున్నారని, తమను ఎలా, ఎంత వేధించినా ఎక్కడా వెనక్కు తగ్గబోమని జోగి రమేష్ చెప్పారు.
పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యంపై, వెనుకబడిన వర్గాల మీద జరిగిన దాడిగానే చూడాలి.
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) కనుసన్నల్లో విజయవాడ నుంచి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ని రంగంలోకి దించి నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి నిప్పంటించారు. నన్ను, నా కుటుంబ సభ్యులను బతికుండగానే సజీవ దహనం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు.
నేను ఏ తప్పూ చేయలేదని దుర్గమ్మ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని చెప్పాను. నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమని సవాల్ చేశాను. సీబీఐ ఎంక్వయిరీ అడిగాను. అవన్నీ చేయకుండా చేతిలో అధికారం ఉంది కదా అని అక్రమంగా నన్ను, నా కుమారుడిని, నా తమ్ముడిని జైలుకు పంపి ఇబ్బంది పెట్టారు.
మా నాయకుడి గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా టీడీపీ నాయకులు బహిరంగంగా అసెంబ్లీలో కూడా పచ్చి బూతులు మాట్లాడితే సహించాలి, కానీ తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నాయకుల తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వారిని విమర్శిస్తే దాడులు చేస్తారా? లోకేష్‌కి చిప్ దొబ్బంది అని ప్రశ్నించడం తప్పా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?. పక్కా ప్రణాళికతోనే ఇనుప రాడ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు.
డీసీపీ ఉన్నం రామకృష్ణ, సీఐ, ఇతర పోలీస్ సిబ్బంది సమక్షంలో వారి అండతోనే తెలుగుదేశం గూండాలు మా ఇంటిపై ఈ దాడులకు తెగబడ్డారు.
మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు, పార్టీ పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.