‘మిస్టర్ డిపెండబుల్’కు పదోన్నతి?
వెంగ్‌సర్కార్.. ఇది భారత క్రికెట్లో కొన్ని దశాబ్దాలు మార్మోగిన పేరు. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, కపిల్‌దేవ్ వంటి దిగ్గజాల వికెట్లు రాలిపోయి.. పెవిలియన్ బాట పడతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ డిపెండబుల్ వెంగ్‌సర్కార్, గోడలా నిలిచి సమస్యల నుంచి జట్టును గట్టెక్కించిన దృశ్యాలు చూశాం.
రాజకీయాల్లోనూ అలాంటి మిస్టర్ డిపెంబుల్.. ట్రబుల్ షూటర్స్ ఉంటారు. తమ పార్టీలను సమస్యల నుంచి గట్టెక్కించటం.. ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడం.. క్యాడర్‌కు భరోసా ఇవ్వడమే వీరి పని. అధినేతకు అత్యంత విధేయ-విశ్వాసపాత్రులు వీరు.
ఇప్పుడు తెలుగుదేశ ం పార్టీలోనూ అలాంటి మిస్టర్ డిపెండబుల్ ఒకరున్నారు. ఆయనే పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్. ముచ్చటగా మూడుసార్లు తప్పిన రాజ్యసభ అవకాశం మళ్లీ వచ్చింది. అధినేత చంద్రబాబు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో.. సర్వదా పార్టీకి విధేయత-విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన జనార్దన్, ఉమ్మడి రాష్ట్రం నుంచి పార్టీ కార్యాలయంలో పూర్తి సమయం కేటాయించి, నేతలు-కార్యకర్తలతో మమేకమయ్యే జనార్దన్ పేరు ఇప్పుడు మళ్లీ రాజ్యసభ సీటు రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.
ఫిబ్రవరి చివరివారంలో రాజ్యసభకు పంపే అభ్యర్థుల్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు ఈసారి అధికారంలోని ఎన్డీయే కూటమికి 4 స్థానాలు దక్కుతాయి.
అందులో ఒక సీటును కూటమిలోని జనసేన లేదా భారతీయ జనతా పార్టీకి ఇస్తారని, మిగతా 3 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. తెలుగుదేశంకు లభించే 3 స్థానాల్లో ఒకటి మాత్రం ఖాయంగా పార్టీ విజిల్ బ్లోయర్కు దక్కుతుందని చెప్పవచ్చు.
:విజిల్ బ్లోయర్ అంటే.. అంతర్గత వివాదాలను చాక చక్యంగా, సామరస్యంగా.. పార్టీకి నష్టం లేకుండా లాభం కలిగేటట్లు పరిష్కరించే వారిని విజిల్ బ్లోయర్ అంటారు. వారు లేకుంటే.. ప్రతి చిన్న సమస్య జటిలమై పోతుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని ఉన్నత ప్రమాణాలు పాటిస్తోంది. పార్టీకి నెర్వ్ సెంటర్‌గా, రాష్ట్రంలోని సామాన్య కార్యకర్త నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడి వరకు పార్టీ కార్యాలయాన్ని జవాబుదారీగా పనిచేయిస్తూ, పార్టీ అధ్యక్షుడి మనసు ఎరిగి నడుచుకొంటూ.. సమన్వయం చేసుకొనే నాయకుణ్ణి రాజ్యసభకు పంపడం గతం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
ఆ క్రమంలోనే గతంలో.. సోలిపేట రామచంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్రావు, వైశ్రాయ్ ప్రభాకర్‌రెడ్డి మొదలైన వారిని రాజ్యసభకు ఎంపిక చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందించిన సేవలకు ప్రతిఫలంగానే గతంలో డా. ఎం.వి. మైసూరారెడ్డి, సి. రామచంద్రయ్య, సిఎం రమేష్‌లకు రాజ్యసభ పదవులు దక్కాయని చెప్పాలి.
ఆ క్రమంలోనే పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అనేక యుద్ధములందు ఆరితేరిన వీరుడిగా, పార్టీకి కరుడు గట్టిన కార్యకర్తగా, నాయకుడిగా.. పార్టీ ఎదుర్కొన్న పలు సంక్షోభ పరిస్థితుల్లో అధినేతకు అండగా నిలిచి మొక్కవోని దీక్షతో పనిచేసి.. సొంత పార్టీలోనే కాక.. ఇతర రాజకీయ పార్టీల వారితో కూడా.. ఈయనలాంటి నాయకుడు మనవద్దకూడా ఉంటే ఎంత బాగుండేదో కదా? (వైసీపీకి అనుకూలంగా ఉండే ‘గ్రేట్ ఆంధ్రా’ పత్రికలో ‘జగన్‌కూ ఒక జనార్దన్ కావాలి’ శీర్షికలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే)… అని అన్పించుకొన్న ఆ విజిల్ బ్లోయర్ ఎవరు?
పార్టీలో అందరివాడిగా, పార్టీ సిద్ధాంతాలకు, విధానాలకు మాత్రమే కట్టుబడి.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి అభిప్రాయాల్ని, ఇబ్బందుల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ, ఆయన అందించే సూచనలు, సలహాల్ని క్రింది స్థాయికి తీసుకువెళుతూ ‘టూ వే కమ్యూనికేటర్’గా పార్టీయే ప్రపంచంగా తన జీవితాన్ని అంకితం చేసుకొన్న ఆ విజిల్ బ్లోయర్ మరెవరో కాదు సీనియర్ నేత టి.డి. జనార్ధన్.
2004 నుంచి 2014 వరకు 10ఏళ్లపాటు తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. పరిటాల రవి వంటి నాయకులు హత్యకు గురయ్యారు. నాటి అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడిపై పలు అక్రమ కేసులు పెట్టారు.
పార్టీని బలహీన పర్చాలని చూశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. 2008లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటయ్యింది. పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ పనైపోయిందని విమర్శకులు, విశ్లేషకులు వాకృచ్ఛారు. ఎన్టీఆర్ భవన్‌ను ఇకపై పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అద్దెకు ఇవ్వాల్సిందేనన్నారు.
ఆ సమయంలో అధినాయకుడికి అండగా నిలబడింది కొందరే! అందులో ఒకరు` టి.డి. జనార్ధన్. ఆ సమయంలో ఆయన కార్యాలయ కార్యదర్శి. 23 జిల్లాల పార్టీ నేతలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, పార్టీ అధ్యక్షుడికి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తూ.. మరో వ్యాపకం, వ్యాపారం లేకుండా పార్టీతో మమేకం అయ్యారు.
ఆ తర్వాత 2019లో పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా పలువురు నేతలు పార్టీని వీడడమో, పార్టీకి దూరంగా జరగడమో చేసినప్పుడు కూడా టి.డి. జనార్ధన్.. పార్టీ అధినాయకుడికి, యువనేత లోకేష్‌కు సన్నిహితంగా ఉంటూ.. పార్టీకి దూరమైన వివిధ వర్గాలను, ఆ వర్గాల నేతలను దగ్గర చేయడంలో విశేష కృషి సల్పారు.
నాడు అధికారంలో ఉన్న వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించింది. సోషల్ మీడియా కార్యకర్తలపై, తెలుగుదేశంకు అనుకూలమైన ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తున్న సమయంలో అధినేత ఆదేశాలకు అనుగుణంగా వారందరికి అండగా నిలబడింది జనార్ధనే! వారికి అవసరమైన న్యాయ సలహాలు, ఇతరత్రా అండదండలు అందించే ఏర్పాట్లు చేస్తూ ఐదేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారు.
“ఈయనున్నాడు.. మనకు దిగుల్లేదు” అనే రీతిలో పార్టీలోని సామాన్య కార్యకర్తలకు భరోసా నింపిన టి.డి. జనార్ధన్ స్వతహాగా ముక్కు సూటి మనిషి. నిబద్ధత, నిజాయితీ గల అరుదైన నాయకుడు. అపారమైన రాజకీయ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే కళ గలిగిన టీడీ జనార్ధన్ గొప్ప స్నేహశీలి.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, కుల, మత, ప్రాంత పట్టింపుల్లేకుండా ఎదుటివారి పట్ల వాత్స్యల్యం చూపిస్తారు. ఆత్మీయంగా మాట్లాడతారు. ఏదైనా సమస్య చెప్పుకొంటే.. దానిని పరిష్కరించే వరకు విశ్రమించరు. దీనివల్ల నాకు లాభం ఏమిటనే ఆలోచనే ఉండదు. తెలుగుదేశం పార్టీ అభిమాని అంటే చాలు.. పరవశించిపోతారు.
టి.డి. జనార్ధన్‌కు మరో ప్రత్యేకత ఉందని పార్టీ నేతలు అంటారు. ఏ పని అప్పగించినా, ఏ పదవిలో వున్నా.. వాటిని విజయవంతం చేయడం, ఆ పదవికి తన వ్యక్తిత్వంతో వన్నె తేవడమే ఆ ప్రత్యేకత. క ష్ణా జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షునిగా, ఆప్కాబ్ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో సహకార బ్యాంకుల సమాఖ్య అధ్యక్షునిగా గొప్ప పేరు తెచ్చుకొన్నారు. అనేక అవార్డులు పొందారు.
తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు కార్యక్రమాల నిర్వహణలో, సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానం పొందారు. అలాగే పార్టీ హెచ్ఆర్డీలో కీలక పాత్ర పోషించారు. పార్టీ శిక్షణా శిబిరాల నిర్వహణలో పాలుపంచుకొన్నారు. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు.
ఇక, 2022 నుంచి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేసి, చైర్మన్‌గా ఆ కమిటీ తరపున పలు కార్యక్రమాల్ని దేశవిదేశాల్లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ పేరు ప్రతిష్టల్ని అజరామరం చేస్తున్నారు. జయప్రద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఆప్కాబ్ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా అవకాశాలు కల్పించారు. దానిని సద్వినియోగం పూర్తిగా పార్టీ కోసం వినియోగించిన ఘనత టిడి జనార్ధన్దే.
తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ అనుబంధ విభాగాలైన యువత, మహిళా, రైతు, కార్మిక, సాంస్కృతిక, బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ తదితర విభాగాలను చైతన్యపరిచి నాటి ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయించటానికి పార్టీ అద్యక్షులవారి ఆదేశాల మేరకు తగిన ఎజెండాను రూపొందించి సమన్వయము చేసుకున్నారు.
ఈ కమిటీలలో నాయకులకు నాటి ప్రభుత్వం నుంచి ఎదురైన ఇబ్బందులను, ముఖ్యంగా వారిపై అక్రమ కేసులు బనాయించినప్పుడు సకాలంలో స్పందించడమే కాక పార్టీ అధినేతతో వారికీ ఫోన్లు చేయించడం, ధైర్యాన్ని నూరిపోయటం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది టీడి జనార్దన్ అని ఏ ఒక్కరిని అడిగినా చెపుతారు. అలాగే డిమాండ్లు పరిష్కరించమని కోరిన ఉద్యోగ సంఘాల నేతలపై, పెన్షనర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పుడు వారికీ తెలుగుదేశం పార్టీ అండగా నిలవటంలో టిడి జనార్దన్ పోషించిన పాత్ర అనన్య సామాన్యం.
ఇవన్నీ ఒక ఎత్తైతే, అమరావతి రైతుల ఉద్యమాన్ని దాదాపు నాలుగేళ్లపాటు సజీవంగా నిలపడములో అమరావతి ఐకాస నేతలతో పాటు టీడి జనార్దన్ క్రియాశీల పాత్ర పోషించారు. అమరావతి మహిళలపై నాటి ప్రభుత్వం సాగించిన దమనకాండను వీరోచితంగా ఎదుర్కొన్న నేతల్లో టీడి జనార్దన్ ఒకరు.
పార్టీ లో ఎవరికీ ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా స్పందించిన నేతల్లో అయన ముందు వరసలో ఉంటాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే పార్టీయే ఊపిరిగా పనిచేసిన వ్యక్తి టీడీ అంటే అతి శయోక్తి కాదు.
క్లుప్తంగా చెప్పాలంటే – టి.డి. జనార్ధన్ ఓ ఆల్‌రౌండర్ రాజకీయ నాయకుడు. పని చేయడమే కాదు.. చేయించడం ఎలానో తెలిసిన నేత. చంద్రబాబు గారికి సన్నిహితుడు. నారా లోకేష్‌కు ఇష్టుడు. పార్టీలో అందరివాడు. ఇన్ని అర్హతలు ఉన్న టి.డి. జనార్ధన్‌కు రాజ్యసభ పదవి దక్కితే.. పార్టీ శ్రేణులు సంతోషిస్తాయి. పార్టీ కోసం కష్టపడేవారిని పార్టీ విస్మరించలేదని, సముచితంగా గౌరవిస్తుందన్న ఓ మంచి సందేశం ఇచ్చినట్లవుతుంది..
అంతేకాదు గతంలో రాజ్యసభ సభ్యత్వం పొందిన వారు పార్టీ కార్యకలాపాలకు దూరమైన పరిస్థితి ఉంది. కానీ టిడి జనార్ధన్ మాత్రం.. తనకు పదవి వస్తే మరింత ఉత్సాహంగా,ఉదృతంగా పనిచేసి 2029లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవటంలో తన వంతు కృషి చేయగలరు. దీనిని ఎవరైనా కాదనగలరా?!