– సునీల్ నాయక్ బీహార్ అరెస్ట్!
– నునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు!
రఘురామకృష్ణరాజు (RRR) కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. అప్పట్లో అధికార గర్వంతో జగన్ కళ్లలో ఆనందాన్ని చూడడానికి చట్టాన్ని చుట్టచుట్టిన ఐపీఎస్ అధికారుల చుట్టూ ఇప్పుడు న్యాయస్థానం, పోలీస్ విచారణ ఉచ్చు బిగుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పి.వి. సునీల్ కుమార్- సునీల్ నాయక్ అనే ఇద్దరు అధికారుల విషయంలో గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ క్రైమ్ క్లైమాక్స్ దిశగా సాగుతోందని స్పష్టం చేస్తున్నాయి.
అధికార దుర్వినియోగం నుండి.. అరెస్టుల వరకు
ఈ కేసులో ప్రధాన సూత్రధారి (A1)గా ఉన్న 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 22, 2026తో ముగియాల్సిన ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ పొడిగింపు సాదాసీదాగా కాకుండా, ఆయన పదవీ విరమణ పొందే జూన్ 30, 2026 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
అంటే, సుదీర్ఘ కాలం పోలీస్ బాస్‌గా వెలిగిన సునీల్ కుమార్, చివరకు యూనిఫామ్ లేకుండా, సస్పెన్షన్ నీడలోనే సర్వీసు నుండి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న బలమైన కారణంతోనే ఆయనను సర్వీసులోకి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు, ఈ క్రైమ్ స్టోరీలో క్షేత్రస్థాయిలో హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కథ మరో మలుపు తిరిగింది. బీహార్ కేడర్‌కు చెందిన ఈయన, ఏపీలో డిప్యూటేషన్ ముగిసిన తర్వాత తిరిగి తన మాతృ రాష్ట్రానికి వెళ్లిపోయారు. అక్కడ డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఏపీ పోలీసులు బీహార్‌కు వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉంచినప్పుడు, ఆయన అరికాళ్ళపై రబ్బర్ బెల్టులతో కొట్టడం, శారీరకంగా హింసించడంలో సునీల్ నాయక్ ప్రత్యక్షంగా పాల్గొన్నారనే దానికి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
బిగుస్తున్న ఉచ్చు – క్లైమాక్స్ దిశగా..
ఈ ఇద్దరు అధికారుల ప్రమేయం కేవలం వ్యక్తిగత ద్వేషంతో కాకుండా, అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సాగిందని విచారణలో తేలుతోంది. పీవీ సునీల్ కుమార్ కుట్రకు పునాది వేయగా, సునీల్ నాయక్ ఆ హింసాకాండను అమలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఉన్న మెడికల్ రిపోర్టులు, సీఐడీ కార్యాలయంలోని సాక్ష్యాలు వీరిద్దరి మెడకు చుట్టుకున్నాయి.
సునీల్ నాయక్ అరెస్టుతో ఈ కేసులో మరిన్ని రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ ‘చట్టం మా చేతుల్లో ఉంది’ అని భావించిన అధికారులకు, ఇప్పుడు అదే చట్టం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైందని, దోషులు కటకటాల వెనక్కి వెళ్లడమే ఈ క్రైమ్ స్టోరీకి అసలైన క్లైమాక్స్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.