* మంగళగిరి, పిఠాపురంలో ప్రత్యేక ప్రాజెక్టులు
* రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్ల ఏర్పాటు
* జీఎస్టీ మినహాయింపు పరిశీలన
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి)లో భాగంగా మంగళగిరిలో రూ.22.35 కోట్లు, పిఠాపురంలో రూ.12 కోట్లతో చేనేతలకు లబ్ధి కలిగేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
చేనేత వస్త్రాల కొనుగోలుపై జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో రూ.120 కోట్ల ఆప్కో నిధులు పక్కదారి పట్టాయని, దీనివల్ల ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురైందని వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో చేనేత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేనేత సంక్షేమానికి త్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరపతి, ముడి పదార్థాల సరఫరా, ముద్రా వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
త్వరలో నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చీరాలలో నేతన్నల ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తుల పెంపుదలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) కింద రూ.4.17 కోట్లు మంజూరయ్యాయన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు.
రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను మంజూరు చేశామన్నారు. సహాయక క్లస్టర్లతో పాటు ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
జీఎస్టీ మినహాయింపు
గత ప్రభుత్వ తీరు వల్ల ఆప్కో నష్టాల్లో కూరుకుపోయిందని మంత్రి సవిత తెలిపారు. ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లను గత ప్రభుత్వం తీసుకొచ్చి, పక్కదారి పట్టించిందన్నారు. దీనివల్ల ఆప్కో షో రూమ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఆప్కోను గాడిలో పెడుతున్నామన్నారు. చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలపై ఆప్కో,చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయని మంత్రి వెల్లడించారు.
నేతన్నలకు యూనివర్సల్ హెల్త్ పాలసీ
నేతన్నల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా యూనివర్సల్ హెల్తీ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేతన్నలకు చేనేత వస్త్రాల తయారీలో స్కిల్ పెంచేలా శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. చేనేతలకు 2014-19 మధ్య కాలం స్వర్ణయుగమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మరోసారి చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. చేనేతల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు.