– చక్కటి పనితీరు కనబర్చే ఉద్యోగులకు ఇకపై ప్రభుత్వం నుంచి అభినందన లేఖలు
– తాగునీటి శాంపిళ్ల పరీక్షలకు మొబైల్ ల్యాబులను అందుబాటులోకి తేవాలి
– ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలి
– రెవెన్యూ శాఖకు ఫ్రెష్ లుక్ తీసుకురావాల్సిన అససరం ఉంది
– టెక్నాలజీతో ప్రభుత్వం అందించే సేవలపై అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ
– ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి : ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.. ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేయడంతోపాటు… బాగా పని చేస్తున్న వారిని గుర్తించి.. వారిని ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్ర స్థాయిలో చక్కగా పని చేస్తూ… ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రొత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం చేసిన సీఎం సూచనపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
బాగా పని చేసే ఉద్యోగులకు ఈ తరహా అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటు వారికి అభినందన లేఖలు పంపాలని సీఎం ఆదేశించారు. ఓ వైపు పని తీరు మదింపు చేస్తూనే.. మరోవైపు ప్రతి నెల బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖ పంపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా… వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాగా పని చేస్తున్న వారిని ప్రొత్సహిస్తూనే… పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేసేలా చర్యలు తీసుకునే అంశంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వైద్యాలయాలు బాగుండాలి… దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగవ్వాలి…
వివిధ శాఖలపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పీహెచ్సీల నుంచి మొదలుకుని అన్ని స్థాయిల్లోని ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైనా పారిశుద్ధ్యాన్ని సరిగా నిర్వహించకుంటే.. సదురు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను బాధ్యులుగా చేయాలి. పారిశుద్ధ్యం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పద్దతి మార్చకోని ఆస్పత్రుల జాబితాను సిద్దం చేయండి. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందా…? లేదా..? అనే అంశంపై ఆయా ఆస్పత్రులకు చెందిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లను బాధ్యులుగా చేయాలి.
ఇక ప్రతి ఆస్పత్రిలో డాక్టర్ల కొరత రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వైద్యుల కొరత ఉంటే.. డాక్టర్లను నియమించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లోని కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలి. గతంతో పోల్చుకుంటే దేవాలయాల్లో సిబ్బంది పనితీరు కొంత మెరుగైనా.. మరింత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులకు సౌకర్యాలు అందించడంతోపాటు… ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖను దారిలోకి తేవాలి…
“ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతోపాటు జీరో కరెప్షన్ ఉండేలా చూడాలి. ఏసీబీని యాక్టివేట్ చేసే పరిస్థితి రాకూడదు. సరిగా పని చేయని తహసీల్దార్లను పక్కన పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. బాగా పని చేసే డిప్యూటీ తహసిల్దార్లను గుర్తిస్తున్నాం. రెవెన్యూ శాఖకు ఫ్రెష్ లుక్ తీసుకురావాల్సిన అవసరం కన్పిస్తోంది. రెవెన్యూ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలి. గతంతో పోల్చుకుంటే మార్పు కన్పించాలి. రీ-సర్వేతో అన్ని భూ సంబంధిత సమస్యలు పోవాలి. మళ్లీ వివాదాలు రాకుండా చూడాలి. రెవెన్యూ సేవలను.. మరీ ముఖ్యంగా భూ సంబంధిత సర్వీసులను ఆటోమోషన్లో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటాం.
ఎవరైనా సర్వేయర్లు సరిగా వ్యవహరించకుంటే.. కఠినమైన చర్యలు తీసుకుంటాం. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకూడదు. తాగునీరు కలుషితం కాకూడదు. ఎప్పటికప్పుడు తాగునీటి నమూనాలను సేకరించాలి. వాటిని ల్యాబులకు పంపి పరీక్షించాలి. ల్యాబులు అందుబాటులో లేకుంటే మొబైల్ ల్యాబులు పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. రోడ్ ప్రమాదాలను ఆడిట్ చేయించాలి. ఆడిట్ నివేదికల ఆధారంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి”అని ముఖ్యమంత్రి చెప్పారు.
టెక్నాలజీతో అందించే సేవలపై ప్రజలకు అవగాహన
“ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగించి సేవలు అందిస్తోంది. అలాగే పరిపాలనలోనూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోంది. ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీని కోసం మీ సేవ, డ్వాక్రా సంఘాలు, ప్రణాళిక విభాగం వంటి వాటితో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో టెక్నాలజీ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. ఇక ఇటీవల ఢిల్లీలో ఏఐ-ఇంపాక్ట్ సదస్సుకు హాజరయ్యాం.
అక్కడ ప్రదర్శించిన టెక్నాలజీలను అధ్యయనం చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏడు ఎంఓయూలను ఏ విధంగా అమల్లో పెట్టాలనే అంశంపై కార్యాచరణ సిద్దం చేయాలి. ఈ మేరకు మున్సిపల్, వైద్యం, వాణిజ్య పన్నుల, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలి.”అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, ఆర అండ్ బి, దేవదాయ, వైద్యారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణ, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు.