అమరావతి : చేనేత వస్త్రాల అమ్మకాల పెంపుదలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు చేనేత వస్త్రాల కొనుగోలుకు ముందుకొస్తున్నారు. రోజూ ఆ స్టాళ్లను సందర్శిస్తూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
ఈ నెల 20 తేదీన చేనేత స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన ప్రఖ్యాతగాంచిన చేనేత ఉత్పత్తులను ఆ స్టాళ్లలో అమ్మకానికి పెట్టారు. ఆనాటి నుంచి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్ లు ఆ స్టాళ్లను సందర్శిస్తున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత …నిత్యం స్టాళ్లను సందర్శిస్తూ.. తోటి మంత్రులు, ఎమ్మెల్యేలతో చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నారు.
బుధవారం కూడా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ప్రశాంతిరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు చేనేత స్టాళ్లను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత… చేనేత రెడీ మెడ్ దుస్తులు సహా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు, మానపల్లి పట్టు, సాధారణ చీరలను వారికి చూపించి కొనుగోలు చేయించారు.
అసెంబ్లీ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు సైతం స్టాళ్లలో చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం విశేషం. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు విశేష స్పందన రావడంపై ఆయా జిల్లాల నేతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, మంత్రి సవితకు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వ విప్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.