* ఉగాదికి మరో విడత బకాయిల చెల్లింపు
* ఆప్కో లాంటి చిన్న సంస్థను కూడా విడిచిపెట్టని జగన్ ప్రభుత్వం
* ఆ సంస్థకు చెందిన రూ.120 కోట్లు జగన్ గద్ద ఎత్తికెళ్లిపోయిందేమో?
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, శాఖ మంత్రి మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే ఉగాది పండుగకు చేనేత సంఘాలకు మరో విడత ఆప్కో బకాయిలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆప్కో పేరుతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్ల జగన్ గద్ద ఎత్తుకుపోయిందని అన్నారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మండపేట శాసనసభ్యులు కోటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత స్పందిస్తూ, నేతన్నల అభ్యున్నతికి, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్రిఫ్ట్ ఫండ్ కింద ప్రస్తుత బడ్జెట్ లో రూ.5 కోట్లు కేటాయించామని, 50 ఏళ్లు నిండిన 93 వేల మంది చేనేత కార్మికులకు రూ.4 వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించామని, మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఏప్రిల్ 1 నుంచి అందజేస్తున్నామని వెల్లడించారు.
పావలా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని, స్మాల్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.డి.పి.) కింద 10 చిన్న క్లస్టర్లను మంజూరు చేశామన్నారు. 15 శాతం రాయితీపై నూలు సబ్సిడీ పథకం అమలు చేస్తున్నామని, 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందజేశామని తెలిపారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నేతన్నల స్కిల్ పెంచేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఉగాదికి మరో విడత బకాయిల చెల్లింపు
చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లిస్తూ వస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆప్కో సర్వనాశనమైందన్నారు. గడిచిన రెండు నెలల్లో రూ.7 కోట్ల మేర చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించామన్నారు. రాబోయే ఉగాది పండుగకు కూడా మరో విడత బకాయిలు చెల్లించబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆ రూ.120 కోట్లు జగన్ గద్ద ఎత్తుకుపోయిందేమో…?
2019-24 మధ్య చేనేతల పొదుపు నిధి పథకం, పావలా వడ్డీ, నూలు సబ్సిడీ పథకాలను అప్పటి ప్రభుత్వం నిలిపేసిందని మంత్రి సవిత తెలిపారు. ఆప్కో వంటి చిన్న సంస్థను కూడా జగన్ ప్రభుత్వం విడిచిపెట్టలేదన్నారు. ఆప్కో పేరుతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఆ డబ్బును జగన్ గద్ద ఎత్తికెళ్లిపోయింది ఏమోనని మంత్రి సవిత అన్నారు.