* కూటమి రాకతో చేనేతకు మగ్గానికి మంచిరోజులు
* కలిసొచ్చిన కమిషనర్ గా రేఖ రాణి నియామకం
* నూతన సంస్కరణలతో గాడిన పడుతున్న ఆప్కో
* సాంకేతికతతో పారదర్శకత, అవినీతికి అడ్డుకట్ట
* ఆన్ లైన్ అమ్మకాలకు శ్రీకారం
* అవినీతి ఉద్యోగుల నుంచి రికవరీ
* నేటితరం మెచ్చేలా రెడీమేడ్ చేనేత వస్త్రాల తయారీ
* చేనేతకు, ఆప్కోకు అవార్డుల వెల్లువ
* ఊబిలో నుంచి గట్టున పడుతున్న ఏపీ చేనేత రంగం
* హర్షం వ్యక్తంచేస్తున్న చేనేత సంఘాలు, నేతన్నలు
అమరావతి: కొందరు అధికారులు బాధ్యతలను విస్మరించి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి… జేబులు నింపుకుంటారు… మరికొందరు… అప్పగించిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా నెరవేర్చడమే కాకుండా, తమదైన ముద్రవేసి ఆయా సంస్థలను, వ్యవస్థలను మరింత బలోపేతం చూస్తారు.. ఈ కోవకే చెందుతారు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి.రేఖ రాణి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. అప్పటి అధికారులు, ఆనాటి ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో రాష్ట్ర చేనేత రంగంతో పాటు ఆప్కో కూడా పూర్తిగా జీవచ్ఛవంగా మారింది… ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రిగా ఎస్.సవిత ప్రమాణ స్వీకారం చేయడం, కమిషనర్ గా రేఖరాణి బాధ్యతలు స్వీకరించడం వంటి వరుస పరిణామాలతో వెంటిలేటర్ పై ఉన్న చేనేత పరిశ్రమ ఊపిరిపీల్చుకోవడం ప్రారంభించింది.
సీఎం చంద్రబాబునాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతన క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కులకు శ్రీకారం చుట్టారు. మంత్రి నారా లోకేశ్ కూడా నేతన్నల అభివృద్ధికి ప్రాధాన్య ఇవ్వడంతో, మగ్గానికి మంచిరోజులు ప్రారంభమయ్యాయి. చేనేత కార్మికులకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పెన్షన్లు, ఉచిత విద్యుత్, సబ్సిడీపై నూలు, త్రిఫ్ట్ ఫండ్ నిధులు, 90 శాతం సబ్సిడీపై ఆధునిక పరికరాలు అందజేత వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ముఖ్యంగా కమిషనర్ రేఖ రాణి తీసుకొచ్చిన సంస్కరణలు అటు చేనేతకు, ఇటు ఆప్కోకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఒకవైపు చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు దారితప్పిన యంత్రాంగాన్ని సరైన మార్గంలో పెడుతున్నారు. గత ప్రభుత్వం అవలంభించిన విధానాలతో ఆప్కోలో అవినీతి పరాకాష్టకు చేరుకుంది.
ఈ పరిస్థితుల్లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ పాకిన అవినీతిని బద్ధలు కొట్టడమే కాకుండా ఆప్కోలో సాంకేతికతకు పెద్దపీట వేయసాగారు. ఆన్ లైన్ అమ్మకాలు, ఆప్కోలో డిజిటల్ పే మెంట్లు, సిబ్బందికి ముఖాధారిత హాజరు వంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
ఆప్కోలో అవినీతి కంపు…
రాష్ట్రంలో చేనేత రంగం, నేతన్నల జీవితాలన్నీ ఆప్కో అనే పునాధులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతటి కీలకమైన ఆప్కో షో రూమ్ ల్లో అవినీతి అనకొండలు బుసబుసలు కొట్టసాగాయి. ఆప్కోలో 90 శాతానికిపైగా సిబ్బంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వంలో వారిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగింది.
రోజు వారి అమ్మకాలు తమ ఇష్టారీతిన వినియోగించడం ప్రారంభించారు. లేని సిబ్బందిని ఉన్నట్లు చెప్పి, లక్షలాది రూపాయలు జీతాల పేరిట డ్రా చేయసాగారు. పవర్ లూమ్ పై నేసిన వస్త్రాలను ఎటువంటి అనుమతుల్లేకుండా ఆప్కోలో అమ్మసాగారు. నేతన్నలు నేసిన వస్త్రాలంటూ వినియోగదారుల నమ్మకాన్ని, ఆప్కో బ్రాండ్ ను సొమ్ము చేసుకున్నారు.
ఈ అమ్మకాలేవీ ఆప్కో సంస్థకుగాని, ప్రభుత్వానికిగాని తెలియకుండా జరిగినవే. దీనివల్ల ఆయా వస్త్రాల అమ్మకాల వల్ల వచ్చిన లాభాలన్నీ నేరుగా ఆప్కో ఉద్యోగులకు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన అధికారుల జేబుల్లోకి వెళ్లసాగాయి. ఆప్కో నష్టాల బాటలో ఉన్నా, దానిలో పనిచేసే ఉద్యోగులు మాత్రం కాళ్లతో కాసులు కూడ బెట్టుకోసాగారు.
సాంకేతికతతో అవినీతికి అడ్డుకట్ట…
చేనేత, జౌళి శాఖ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన రేఖ రాణి ఆప్కోను గాడిలో పెట్టేపనిలో నిమగ్నమయ్యారు. ముందుగా చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ, సంబంధిత మంత్రి సవిత ఆశీస్సులతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా మార్కెటింగ్ విస్తరణపై దృష్టి సారించారు. ఇంటింటికీ చేనేత వస్త్రాల పేరుతో… రాష్ట్రంతో జాతీయ స్థాయిలోనూ విస్తృతంగా ఎగ్జిబిషన్లు నిర్వహించసాగారు. అదే సమయంలో ఈ కామర్స్ సంస్థల ద్వారా ఆన్ లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా నేటి యువత, ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చేనేత రెడీమేడ్ వస్త్రలను అమ్మకాలకు పెట్టారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతా చేనేత వస్త్రాల అమ్మకాలు ఊపందుకున్నాయి. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఆప్కోలో ప్రక్షాళను నడుంబిగించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆప్కో షో రూమ్ లను తరుచూ సందర్శిస్తూ..స్టాక్ ను, రిజిస్టర్లను తనిఖీలు చేశారు. ఆప్కో మేనేజర్లగా ఉన్న కొందరు ఉద్యోగులు రూ.లక్షల్లో దోచుకున్నట్లు గుర్తించి, రికవరీకి చర్యలు ప్రారంభించారు.
ఏ రోజుకా రోజు అమ్మకాలను ఆరోజే ఆప్కో బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా చర్యలు తీసుకున్నారు. లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపించి జీతాలు దోచుకోకుండా ఉండేలా ఎఫ్.ఆర్.ఎస్.(ముఖాధారిత హాజరు)కు శ్రీకారం చుట్టారు. ఆప్కో షో రూమ్ ల్లో డిజిటల్ పేమెంట్లు ప్రారంభించారు. ఇలా సాంకేతిక సంస్కరణలతో ఆప్కో నష్టాల నుంచి ఒక్కో అడుగు ముందుకేస్తూ.. లాభాల బాటవైపు పయనిస్తోంది…
చేనేతకు అవార్డుల వెల్లువ…
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెన్నుదన్నుతో కమిషనర్ రేఖ రాణి పర్యవేక్షణలో రాష్ట్రంలో అవసాన దశ నుంచి చేనేత రంగం కోలుకుంటోంది. రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉత్పత్తులకు మరింత గుర్తింపు వచ్చేలా ఆమె తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలివ్వసాగాయి. వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడెక్ట్ (ఓడీ-ఓపీ) పేరుతో విస్తృత మార్కెటింగ్ చేస్తుండడంతో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు అమాంతం పెరగసాగాయి.
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కమిషనర్ రేఖ రాణి నిబద్ధత తోడవ్వడంతో ఏపీ చేనేత ఉత్పత్తులకు అవార్డులు రాసాగాయి. గతేడాది ఏపీకి పది ఓడీ – ఓపీ అవార్డులు రాగా, అందులో ఏడు అవార్డులు చేనేత, హస్త కళారూపాలకే రావడం విశేషం. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు ఆప్కో సొంతం చేసుకుంది. ఆప్కో షో రూమ్ ల్లో చేపట్టి డిజిటలైజేషన్ కు స్కోచ్ అవార్డు లభించడం విశేషం.
ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడంలో రేఖరాణి పాత్రే కీలకం. ఒకవైపు ఆప్కో నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడమే కాకుండా, అవినీతి ఉద్యోగుల భరతం పడుతూ, చేనేత ఉత్పత్తుల అమ్మకం పెంచడానికి కమిషనర్ రేఖ రాణి తీసుకుంటున్న చర్యలు నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ… వారి మన్ననలు పొందుతున్నాయనడంలో సందేహం లేదు.