– దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటా
– అంతా కలిసికట్టుగా పోరాడుదాం. మనదే విజయం
– జగన్ 2.ఓలో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
– అమరావతిలో రూ.11 వేలకు చదరపు అడుగు నిర్మాణం చేస్తున్నారు
– కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
– రెండేళ్లలోనే ఈ ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్ల అప్పు
– ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి. దేన్నీ వదలడం లేదు
– పప్పు బెల్లానికి అడ్డగోలుగా ప్రభుత్వ భూములు
– మరి ఆదాయం ఎలా వస్తుంది? అంతా వారి జేబుల్లోకే
– ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లి: విపరీతంగా రికార్డుస్థాయిలో అప్పు చేస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, నాడు జగన్ అన్నీ చేసినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడన్న చర్చ ప్రతి ఇంట్లో జరగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు.
రెండేళ్లు తిరగకుండానే మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం, కార్యక్రమలు అమలు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన వైయస్ జగన్.. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో కూడా అందరినీ కలుపుకుపోతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నర కాలంగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. అలాగే ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే, ఆయన ఇంకా ఎదుగుతారని వైయస్ జగన్ చెప్పారు.
మనమంతా కలిసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఇది కేవలం నా పార్టీ కాదు.
అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి. మన పార్టీ చరిత్ర 15 ఏళ్ల ప్రయాణం చూస్తే, మనం కేవలం 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. మనకు పోరాటాలు కొత్తకాదు. మనకంటూ ప్రత్యేక ట్రేడ్ మార్క్ ఉంది.
చరిత్రలో లేని విధంగా పోరాటాలు చేశాం.
ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ జరగుతోంది. మన పాలనకు, ఈ ప్రభుత్వ పాలన తేడాను ప్రజలు చర్చిస్తున్నారు. మనది సుపరిపాలన అయితే, మొత్తం అవినీతిమయం ఈ ప్రభుత్వ పాలన. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ఎక్కడా ప్రజలకు మేలు లేదు. కేవలం పాలకుల దోపిడి తప్ప.
నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు, మనకు గొప్ప ఆర్థిక వ్యవస్థ రాలేదు. అంతా చిన్నాభిన్నం. ట్రెజరీలో రూ.100 కోట్లు కూడా లేవు.
అలాంటి పరిస్థితుల్లో మనం బాధ్యతలు తీసుకున్నాం. ఇంకా రెండేళ్లు కోవిడ్‌తో అంతా అతలాకుతలం. ఆదాయం తగ్గింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైయస్సార్సీపీ పాలన సాగింది.
కానీ, ఏనాడూ ఆ సాకు చూపలేదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు. హామీలన్నీ అమలు చేశాం. ముందుగా క్యాలెండర్ ప్రకటించి, పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాం. మన 5 ఏళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆధార్‌తో సహా అన్ని వివరాలు చెప్పగలం.
అదే ఈ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన అప్పు రూ.3.30 లక్షల కోట్లు దాటింది. మరి హామీల అమలు లేదు. సూపర్‌సిక్స్, సూపర్‌సిక్స్ గాలికెగిరిపోయాయి. కానీ విపరీతంగా అప్పు చేస్తున్నారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?.
దీన్నే ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. జగన్ చేయగలిగాడు. చంద్రబాబు ఎందుకు చేయడం లేదు అని. కారణం, జగన్ ప్రతి అడుగులో కూడా ప్రజలు, పేదల గురించి ఆలోచించాడు. ప్రతి అడుగులో కూడా అవినీతి జరగకుండా, ప్రతి ఇంటికి లబ్ధి నేరుగా పంపించాడు.
ఈరోజు దోచుకో. పంచుకో. తినుకో. ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం రావడం లేదు. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్›్జ, ల్యాటరైట్, గ్రానైట్, అన్ని వనరులు దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు. అమరావతిలో రూ.11 వేలకు చదరపు అడుగు నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంతా వారి జేబు నింపుకోవడం తప్ప అందుకే రాష్ట్ర ఖజానా దిగజారిపోతూ, రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
ఈ మధ్య కాలంలో చూశాం. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక ఎంపీ. ఆయనే మొదటి సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో అది లేదు.
ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది కాదు. ఇది కేవలం పుట్టా మహేష్‌తో మొదలు కాలేదు. గతంలో చాలా జరిగాయి. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే, ఎక్కడా డ్రగ్స్ నియంత్రించలేదు. అందుకే విపరీతంగా అరాచకాలు.
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. తనపై అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబూ ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతున్నా. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబూ ఏం చర్యలు తీసుకున్నావు?. నో యాక్షన్.
మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మీద ఏం చర్యలు తీసుకున్నావు?. నో యాక్షన్. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?. నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ. అక్కడా నో యాక్షన్.
ఎమ్మెల్యేలు, ఈ లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. పైగా బాధితురాలు మీద కూడా తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు.
అంతెందుకు? ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు?. నో యాక్షన్. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్‌లో పట్టుబడితే నో యాక్షన్.
చంద్రబాబు కొడుకు స్విమ్మింగ్‌పూల్ వద్ద తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్. నో యాక్షన్. ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు. అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి. లేదా ముద్దు అయినా పెట్టాలి. ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా అని నవ్వుకున్నారు. వీటన్నింటి మీద తగిన చర్య తీసుకోని చంద్రబాబు ఇంకా ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే చేశానని చెప్పుకొచ్చారు.
జగన్ 2.ఓ లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
ఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్సటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిడుతున్నారు. చూస్తుండగానే మరో ఏడాదిన్నర గడుస్తుంది. ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటాను. మీరూ ప్రజలతో మమేకం కండి. వారి సమస్యలపై పోరాడండి. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్ 2.ఓ లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తామని వైయస్ జగన్ వివరించారు.
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి. ఎమ్మెల్యే. ఒంగోలు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ చుండూరి రవిబాబుతో పాటు, జిల్లాలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.