– ట్రాన్స్ఫార్మర్లలో నాణ్యత లేకుంటే జరిమానా
– నాణ్యతపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిపుణులతో పరిశీలన చేయిస్తాం
– ఏబి వెంకటేశ్వరరావు మంచి కారణంతోనే పిల్ వేశారనుకోవచ్చు కదా?
– షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై ఏబీవీ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య
– తెలంగాణలో కంటే ఏపీలో 55 వేలకు ఎక్కువ కొన్నారు
– నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు పిల్
– ఇప్పటిదాకా మౌనంగా ఉండి పిల్ వేశారు
– తన పిల్‌పై ఏబీ ముందస్తు ప్రచారం చేసుకున్నారన్న ఏజీ దమ్మాలపాటి
– షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ బంతి ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిపుణుల కోర్టులో
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో జగన్ హయాంలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ప్రభుత్వానికి సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు-నాణ్యత వ్యవహారం కోర్టుకెక్కింది. తెలంగాణలో కంటే ఏపీలో 55 వేల ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వైనంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వేసిన పిల్ ఇప్పుడు చర్చనీయాంశమయింది.
ఏబీ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. నాణ్యతా ప్రమాణాలు లేకపోతే, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు జరిమానా తప్పదని హెచ్చరించింది. ప్రధానంగా ఆ సంస్ధ సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మార్లు నాణ్యతా ప్రమాణాలు మేరకు ఉన్నాయో లేవో అన్న విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిపుణులతో పరిశీలన చేయిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో.. జగన్ జమానాలో విద్యుత్ రంగాన్ని శాసించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ఇప్పుడు చిక్కుల్లో పడినట్లయింది.
ఫలితంగా ఇక ఈ నాణ్యత బంతి ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిపుణుల కోర్టులో పడినట్లే. పైగా టెండర్లలో ఫైవ్ స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మార్లు మాత్రమే సరఫరా చేయాలన్న నిబంధనలున్నప్పటికీ.. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ త్రీస్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మార్లు సరఫరా చేశారన్న ఏబీ ఆరోపణపైనా విచారణ జరిగితే, ఆ సంస్థకు చిక్కులు తప్పవని విద్యుత్ రంగ నిపుణలు స్పష్టం చేస్తున్నారు.
టెండరు నిబంధనలు ఉల్లంఘించి, సంస్థ త్రీస్టార్ ట్రాన్స్ఫార్మార్లు సరఫరా చేసినా దానిని ఎందుకు ఆమోదించారు? ఆమోదించిన అధికారులెవరు? నాణ్యతను పరిశీలించకుండానే వాటిని ఎలా తీసుకున్నారు? వాటి నాణ్యత పరీక్షించాల్సిన వారెవరు? అసలు ఇది ఏ స్థాయిలో ఈ నిర్ణయం జరిగిందన్న దానిపై కోర్టు సంధించే ప్రశ్నలకు ఏజీ, అధికారులు జవాబు చెప్పాల్సి ఉంటుంది.
అదే సందర్భంలో తెలంగాణలో 85 వేల రూపాయకే సరఫరా చేసే ట్రాన్స్ఫార్మార్ను.. షిర్డిసాయి సంస్థ ఏపీలో లక్షా 39 వేల 999 రూపాయలకు సరఫరా చేసినప్పుడు, వ్యతిరేకించకుండా అంగీకరించిన అధికారులెవరు? ఆ నిర్ణయం ఏ స్థాయిలో జరిగిందంటూ హైకోర్టు ధర్మాసనం సంధించే ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ ఏమి జవాబిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ నాటి కొనుగోలు జరిగిన కాలంలో ఉన్న ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఎండిలను కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తే పరిస్థితి ఏమిటన్న మరో అంశం ఆసక్తికరంగా మారింది. కాగా తాజా వాదనలో పిటిషనర్ ఏబీకి వ్యతిరేకంగా వాదించిన ఏజీ, ధర్మాసనం సంధించే ఈ సాంకేతిక ప్రశ్నలకు ఏమి జవాబు ఇస్తారో చూడాలి.
కాగా జగన్ హయాంలో అవసరం లేకపోయినా లెక్కకుమించి ట్రాన్స్ఫార్మార్లు కొనుగోలు చేసి, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు జగన్ అనుచిత ఆర్ధిక లబ్థి చేకూర్చారంటూ నాడు టీడీపీ ఆరోపించింది. తెలంగాణ కంటే 55 వేల రూపాయలు అదనంగా కొన్నారు. అసలు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామా సంస్థ. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌తో పాటు, కడప జిల్లా టీడీపీ నేతలు ప్రెస్మీట్లలో ఆరోపించిన విషయం తెలిసిందే.
షిరిడి సాయి ఎలక్ట్రికల్? సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాణాల ప్రకారం లేకుంటే జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై స్పందించిన ధర్మాసనం, కౌంటర్లు వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు- పరికరాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అనే విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిపుణులతో పరిశీలన చేయిస్తామని హైకోర్టు పేర్కొంది. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ట్రాన్స్ఫార్మర్ల టెండర్ కేటాయింపు పరికరాల సరఫరాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఈ వ్యవహారంపై సిబిఐ తో విచారణ జరిపించాలని కోరుతూ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు స్పందించింది.
పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ కోరడంతో, విచారణను వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సిఎండి, ఏపీఎస్పిడిసిఎల్ సీఎండి, షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తరువులు ఇచ్చింది.
ఇతర సంస్థలు టెండర్లో అర్హత సాధించకుండా షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అనుగుణంగా నిబంధనలు పెట్టారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. తెలంగాణలో ఇదే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ను 85 వేల రూపాయలకే సరపరా చేస్తున్నారని .. ఏపీలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్1, 39,999 కి సరఫరా చేస్తుందన్నారు. ఇది తెలంగాణ కంటే 55,000 అధికమని వివరించారు.
టెండర్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు సరపరా చేయాలని ఉంటే.. షిర్డి సాయి త్రీ స్టార్ రేటింగ్ పరికరాలు మాత్రమే సరఫరా చేస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదలను వినిపించారు. 2022 నుంచి షిర్డి సాయి సంస్థ ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేస్తుందన్నారు. పిటిషనర్ ఇన్నేళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు పిల్ వేశారని, జాప్యానికి కారణం చెప్పలేదన్నారు.
తన పిల్ హైకోర్టులో విచారణకు రాబోతోందంటూ ముందుగానే ప్రచారం చేశారని హైకోర్టుకు వివరించారు. టెండర్ నిబంధనలకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయడం లేదని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో, పూర్తి వివరాలు సమర్పించేందుకు గడివి ఇవ్వాలని కోరారు.
ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ ఐపిఎస్ అధికారిగా 2024 లో పదవీ విరమణ చేశారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిల్ దాఖలు చేసి ఉంటారని తెలిపింది. మంచి కారణం కోసమే పిల్ వేశారని ఎందుకు అనుకోకూడదని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.