– ప్రొఫెసర్ రఘు కొర్రపాటి
– ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
అమరావతి: ఫిన్‌టెక్ రంగంలోని ఆవిష్కరణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తున్నాయని, డిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీలు భవిష్యత్ వ్యాపారాలకు కీలకమవుతాయని అమెరికాలోని వాల్డెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘు కొర్రపాటి తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రూసా 2.0 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఫిన్‌టెక్ ఇన్నోవేషన్స్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్” అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించారు. డా. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ మరియు కామర్స్ & మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం సంయుక్తంగా ఈ సదస్సును డా. హెచ్.హెచ్. డిచిమాన్, డా. జాన్ డేవిడ్ ఆడిటోరియంలో నిర్వహించింది.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ, విద్యా రంగం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మారాలని, విద్యార్థులు ఆధునిక ఫిన్‌టెక్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ మాట్లాడుతూ, ఫిన్‌టెక్ రంగంలో స్టార్టప్స్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, యువత సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు.
కీనోట్ స్పీకర్లలో అల్కా మెహతా (పేయిడ్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపకురాలు & సీఈఓ) డిజిటల్ పేమెంట్ వ్యవస్థల అభివృద్ధిపై మాట్లాడగా, రోబిన్స్ జాయ్ (నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ & రీజినల్ హెడ్) పెట్టుబడి ధోరణులపై వివరించారు. డా. ఎం. ఉమ మహేశ్వరరావు (ఇన్ఫోసిస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్) ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో టెక్నాలజీ వినియోగంపై మాట్లాడారు. ఇతర ప్రముఖుల్లో కే. ప్రేమ్ కుమార్ (ఎర్నెస్ట్ & యంగ్ సీనియర్ చీఫ్ ఫైనాన్షియల్ అనలిస్ట్), వెంకట రమణ గోసావి (ఇన్ఫోసిస్ ఫినాకిల్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), ఎం.వి.వి.ఎన్. పాత్రుడు (వైట్ షీల్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్), డా. వెంకట్ ఇంక్కుర్తి (ఫైనాన్షియల్ కన్సల్టెంట్), జయశ్రీ వెంకటేష్ (బ్యాంక్ ఆఫ్ టోక్యో సీనియర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్), ప్రొఫెసర్ రత్నాకర్ డి.బి. (ఐఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్), శివ ప్రసాద్ (హెచ్‌సీఎల్‌టెక్ విజయవాడ సెంటర్ హెడ్) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ ఆర్. శివరామ ప్రసాద్ (కాన్ఫరెన్స్ డైరెక్టర్, డీన్ – కామర్స్ & మేనేజ్మెంట్ స్టడీస్) మరియు ప్రొఫెసర్ ఎల్. ఉదయ్ కుమార్ (ప్రిన్సిపల్ ఇన్చార్జ్, ఆర్ట్స్, కామర్స్ & లా కాలేజ్) సమన్వయం చేశారు. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు.