* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
* బీసీ రక్షణ చట్టానికి త్వరలో తుది రూపు
* రాజమండ్రిలో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి రాష్ట్ర స్థాయి జయంతి
* దొమ్మేటికి ఘన నివాళులర్పించిన మంత్రి సవిత, ఇతర ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం : స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాల సాధనే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన సేవాలు శ్లాఘనీయమని, ఆయన జయంతి రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం ఆనందకమన్నారు.
రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని సోమవారం రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగి, ప్రజల సమస్యలను తనవిగా భావించి సేవలందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడిచి ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు.
త్వరలో బీసీల రక్షణ చట్టం అమలు
రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని మంత్రి తెలిపారు. బీసీ సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. బీసీ రక్షణ చట్టానికి తుది ముసాయిదా సిద్ధం చేశామని,త్వరలోనే ఈ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నిజర్వేషన్ల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని నియమించామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలే కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఉగాది జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. ఇలా అన్ని రంగాల్లో బీసీలు ముందంజ వేయాలన్నదే సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తోందన్నారు.
శెట్టిబలిజ జాతి గౌరవాన్ని కాపాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడిపూడి సత్తిబాబు, వీరంకి వెంకట గురుమూర్తి, ఎం.ఈశ్వరరావు, డైరెక్టర్లు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో శెట్టి బలిజ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.