క్రైస్తవులకు అది ఒక నల్ల రాయే అన్న భావన కలిగితే కలగవచ్చు గాక! ఇసుకలోనూ, మైనింగ్ లోనూ, మద్యం లోనూ, కాంట్రాక్టులోనూ డబ్బు చేసుకున్నట్టే ;”ఈ నల్ల రాయి” నుంచి కూడా వీలైనంత డబ్బు పిండేయవచ్చు అని అనుకుంటే అనుకోవచ్చు గాక! దాని కోసం వంద అడ్డదారులు…. వేయి అసత్యాలకు పాల్పడితే… పాల్పాడువచ్చు గాక!
కానీ, హిందూ పుటక పుట్టిన ప్రతి మనిషికి అదొక పరమ పావన కలియుగ వైకుంఠం. ఆ స్వామి వారి పది, పదిహేను సెకండ్ల సమయం మాత్రమే వీలైన దర్శనం కోసం…. వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి,,, పిల్లా పాపలతో అష్ట కష్ఠాలు పడుతూ తిరుమల చేరుకునే హిందువులకు… అది ఒక వైకుంఠమే. ఆయన శ్రీ మహా విష్ణువే.
స్వామి వారి దర్శనంతో – అది కొన్ని సెకండ్ల మాత్రమే అయినప్పటికీ – తమ జన్మ తరించిందన్నట్టుగా భక్తులు పులకించిపోతారు. గోవిందనామ స్మరణతో తమ జన్మ ధన్యమైన అనుభూతికి లోనవుతుంటారు.
అటువంటి ఆధ్యాత్మిక భావనల తోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఓ వింత అనుభవం ఎదురైంది.
ధ్వజస్థంభం వద్దకు వెళ్ళగానే…. మధురమైన నేతి వాసన ఒక్కసారిగా ముక్కు పుట్టాలను తాకింది. స్వచ్ఛమైన నేతి వాసనలతో ఆ ప్రాంతం అంతా గుబాళించింది. అక్కడ ఉన్న భక్తుల మొహాలలో ఒక రకమైన ఆశ్చర్యం.
అక్కడి నుంచి గర్భగుడి వరకు వెళ్ళియినప్పటికీ ; నేతి సువాసనలు భక్తులను వెంటాడుతూనే ఉన్నాయి.
గతం లో పది పన్నెందు సార్లు స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్ళినప్పటికీ ; ( జన్మకో శివరాత్రి అన్నట్టుగా )ఈ సారి స్వామి వారిని మొదటి వాకిలి ముందునుంచే దర్శించుకునే మహా భాగ్యం కలిగింది.
కళ్ళు… స్వామివారిని ఆపాదమస్తకం చూస్తున్నప్పటికీ ; చిత్తం మాత్రం ముక్కోళ్లకు తాకుతున్న నేతి సువాసనల పైనే ఉంది. గర్భ గుడిలో కూడా!
గతం లో ఇటువంటి అనుభవం కలిగిన గుర్తు లేదంటూ కొందరు భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.
స్వామి వారి పరమ పావనమైన లడ్డు ప్రసాదాన్ని, పామాయిలు తో తయారు చేసేవారని, నేతి వాసన రావడం కోసం… ఏవో కెమికల్స్ కలిపేవారని మీడియా లో చదివిన గుర్తు. అన్నట్టుగానే, తిరుమల శ్రీవారి ప్రాంగణం లో ఎప్పుడూ నేతి వాసనలు ముక్కుకు తాకిన గుర్తు లేదు. అయినా, “అది ” నేతి లడ్డూ యే అన్న పవిత్ర భావం తోనే భక్తులు స్వీకరించేవారు.
మరి, పామాయిలు,, కెమికల్స్ కు షార్టేజ్ వచ్చిందో… ఏమో తెలియదు కానీ ; స్వచ్ఛమైన నెత్తితోనే ప్రస్తుతం స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు అనిపించింది.
భక్తుల పట్ల, ఆ కలియుగ వైకుంఠ వాసుని పట్ల ఇంత పవిత్ర భావనతో విధులు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేయడమే భక్తుల కనీస ధర్మం అనిపించింది.
దీనితో పాటు, మరొకటి కూడా భక్తుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నది. స్వామి వారి ప్రాంగణం లో ఎవరూ రాజకీయ ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు చేయవద్దని అక్కడ ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టం లో పదేపదే…. నిరంతరం…. మూడు, నాలుగు భాషలలో ప్రకటిస్తున్నారు. దీనితో పాటు – ఎటువంటి రీల్స్ చేసినా శిక్షార్హులే అని కూడా హెచ్చరిస్తున్నారు.
ఇది వినగానే, ఓ గులాబీ పుష్పం గుర్తుకు వచ్చింది. గతం లో ఓ గులాబీ పుష్పం పది పదిహేను రోజులకోసారి శ్రీ వారి సన్నిధిలో నిలబడి…. చీర మోకాళ్ళదాకా పైకి ఎత్తి పట్టుకుని…. చంద్రబాబు మీదో, లోకేష్ మీదో, పవన్ కళ్యాణ్ మీదో తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయేది, ఓ వంకర నవ్వు నవ్వుకుంటూ. వంకర నవ్వులకు ఆమె పెట్టింది పేరు అంటారు.
వీటితో పాటు ; అధికార హోదాల్లో ఉన్నవారు శ్రీవారిని దర్శించుకోడానికి వస్తే ; వారికి ప్రచారం ఎందుకో అసలు అర్ధం కాదు. వీరికి తోడు ; సినిమాల్లో వేషాలు వేసుకుని బతికే వారు, ఆటల పోటీల్లో పాల్గొనేవారు…. తమ స్వంత ప్రయోజనాల కోసం తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటుంటారు. అందులో ప్రజా ప్రయోజనం ఏమైనా ఇమిదివున్నదా అనేది బుర్ర ఎంత గోకున్నా అర్ధం కావడం లేదు.
దేశాధినేతలో… రాష్ట్ర అధినేతలో దర్శనానికి వస్తే…. సరేలే అనుకోవచ్చు ; కానీ జబర్దస్త్ లో వేషాలు వేసిన వారు వచ్చినా మీడియా మీడియా అంటూ కెమెరాలతో ఎగబడిపోతున్నారు.
టీటీడీ వారికి ఓ విన్నపం. మీడియా వారిని స్వామి వారి ఆలయ ప్రాంగణం లోకి….. పిలిస్తే తప్ప రాకుండా కట్టడి చేయాలి. రోజూ ఎవరో వస్తుంటారు. శ్రీ వారి దర్శనం చేసుకుంటుంటారు. అదంతా ప్రజలకు తెలియాల్సిన పని లేదు. ఈ ప్రచార చేష్టలన్నీ స్వామి వారి పట్ల అపచారాలే.
ఇది కలి యుగం కదా! కలియుగ ధర్మం ప్రకారం….,మధ్య మధ్య లో స్వామివారి పట్ల అపచారాలకు… ఘోరాపచారాలకు పాల్పడే ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ ;
“ధర్మ సంస్థనాపార్ధాయ…. సంభవామి యుగే యుగే ”
అని అన్నారు కదా! అప్పుడప్పుడూ ధర్మగ్లాని జరుగుతుంటుంది మరి. దానిని భరించడమే… అది విరగడయ్యే శుభదినం కోసం ఎదురుచూస్తూ….
– భోగాది వేంకట రాయుడు