* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
* వడ్డెర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన మంత్రి లోకేశ్
* వడ్డెర్లను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం : మంత్రి సవిత
* ఎన్నికల హామీ నెరవేర్చినందుకు వడ్డెర్ల ధన్యవాదాలు
* మంత్రి సవితకు సత్కారం
* చంద్రబాబు, పవన్, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం
తాడేపల్లి/అమరావతి : తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయించనున్నామని, మినరల్ లీజులో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నామని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లందరికీ ఆర్థికంగా మేలు కలిగేలా నూతన వడ్డెర్ల సొసైటీలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వడ్డెర కార్పొరేషన్ మల్లె ఈశ్వరరావు ఆధ్వర్యంలో వడ్డెర సామాజిక వర్గీయులు శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమకు ఆర్థిక భరోసా కలిగించేలా మైనింగ్ లీజులు కేటాయింపులతో పాటు సినరేజీ మినహాయింపు ఇచ్చినందుకు ఆనందం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన ప్రతి హామీనీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించామన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. మత్స్యకారులకు నష్టం కలిగిస్తున్న వివాదాస్పద 217 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
చేనేతలకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామన్నారు. నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యలో నడిచే సెలూన్లకు ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచామన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచామన్నారు. బడ్జెట్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, రూ.51 వేల కోట్లుకు పైగా వారి అభ్యున్నతికి కేటాయించామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు గతంలో ఎప్పుడూ కేటాయించలేదని మంత్రి సవిత గుర్తు చేశారు.
నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు ఓకే
వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో వడ్డెర్ల కష్టాలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా చూశారన్నారు. ఆనాడే వారి సంక్షేమానికి, ఆర్థిక ఉన్నతికి పలు హామీలిచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం కేటాయింపు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇస్తూ మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.
వడ్డెర స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం శాశ్వత జీవో తీసుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమన్నారు. వడ్డెర్లను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.
చంద్రబాబు, పవన్, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం
అంతకుముందు మంత్రి సవితను కలిసి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, డైరెక్టర్లు, ఆ సామాజిక వర్గీయులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆర్థిక భరోసా కలిగించేలా మైనింగ్ లీజులు కేటాయింపులతో పాటు సినరేజీ మినహాయింపు ఇచ్చినందుకు ఆనందం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం మంత్రి సమక్షంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, డైరెక్టర్లు దుర్గారావు, దుర్గా మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన వడ్డెర సామాజిక ప్రతినిధులు కుంచాల సావిత్రి, మణికుమారి, శ్రీరామ్, ఉప్పు శ్రీను, వేముల బాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.