నిన్న ఒక “న్యాయకోవిధుడు” వ్రాసిన వ్యాసాన్ని చదివాను. అందులో ఆయన వక్రబుద్ధి ప్రస్పుటంగా కనబడింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, భాగం II, సెక్షన్ 5 ప్రకారం “తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండుట: (1) నిర్ణీత దినము నుండి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్, పది సంవత్సరాలకు మించని కాలం పాటు, తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉండును. (2) ఉప-విభాగం (1)లో పేర్కొన్న కాలపరిమితి ముగిసిన పిమ్మట, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉండును మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన రాజధాని ఉండును”.
ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై ఉండాల్సిన అవసరం లేదు. ఇది పార్లమెంటు చేసిన చట్టం. ఆ చట్టంలో నిర్ధిష్టంగా పేర్కొన్న పది సంవత్సరాల కాలపరిమితి 2024 జూన్ 2 నాటికి ముగిసింది. చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతున్నది. చట్టానికి సవరణ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు ప్రస్తావించడం ద్వారా చట్టంలోని అస్పష్టతను తొలగించాల్సిన అనివార్య పరిస్థితిని చట్టాన్ని ఆమోదించిన పార్లమెంటు కల్పించింది. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, భాగం II, సెక్షన్ 6 ప్రకారం “ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకై నిపుణుల కమిటీ.—ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమలులోకి వచ్చిన తేదీ నుండి ఆరు నెలలకు మించని కాలపరిమితిలో, ఆంధ్రప్రదేశ్ వారసత్వ రాష్ట్రానికి సంబంధించిన నూతన రాజధాని విషయంలో గల వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయును”.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 భాగం II, సెక్షన్ 6 ప్రకారం “రాజధాని అంశం”పై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ రాజధానిని ఎక్కడ నెలకొల్పాలన్న దానిపై విస్పష్టమైన సిఫార్సు చేయకుండానే నివేదిక సమర్పించింది. “అమరావతి”ని రాజధానిగా శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం కాకుండా రైతులను రాజధాని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించి, దాదాపు 34000 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సచివాలయం హైదరాబాదు నుండి అమరావతికి తరలివచ్చింది. పాలన సాగుతున్నది. శాసనమండలి, శాసనసభల సమావేశాలు జరుగుతున్నాయి. హైకోర్టు, గవర్నర్ కార్యాలయం అమరావతిలోనే ఉన్నాయి. 2019 నాటికి ముందే, అంటే గడువు ముగియడానికి ఐదేళ్ళు ముందే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ అమరావతి కేంద్రంగానే పనిచేస్తున్నాయి.
అయినా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, భాగం II, సెక్షన్ 5 (2)కు సవరణ చేసి, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రస్తావించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. పర్యవసానంగా భారీ నష్టం జరిగింది. వ్యవస్థలపై విశ్వసనీయత గొడ్డలిపెట్టుకు గురయ్యింది. ప్రజా ఉద్యమం అమరావతి రాజధానిని పరిరక్షించుకున్నది. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నేడు నెరవేర్చింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పేర్కొన్న మేరకు అమరావతిని ఆధునిక ప్రజా రాజధానిగా యుద్ధప్రాతిపదికన నిర్మించడానికి అవసరమైన నిధులను సమకూర్చి, అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన మరియు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.
రాజధాని అమరావతి పరిధిలోను మరియు రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చట్టంలో పొందుపరచిన సంస్థలు, కడప ఉక్కు కర్మాగారం మరియు ఓడరేవు నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, ప్రత్యేక తరగతి హోదా, తదితర చట్టబద్ధమైన హామీల అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలి. వాటిని సాధించుకోవడానికి రాజకీయ అనుబంధాలకు అతీతంగా ప్రజలు గళమెత్తాలి.
– టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక