– పులులతో మమేకం అవుతాం
– అటవీ ప్రాంతాన్ని వదిలి బతకలేం
– సీఎం ప్రజావాణి “లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ( ఏ.టీ.ఆర్ ) చెంచులు
– ఆదుకుంటామని డాక్టర్ జీ. చిన్నారెడ్డి భరోసా
హైదరాబాద్: ‘అడవి తల్లి ఒడిలోనే నివాసం ఉంటాం. పులులతో మమేకం అవుతాం. తరతరాలుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతాన్ని మాత్రం వదిలి బయట ప్రాంతంలో జీవించలేం. మమ్మల్ని ఇక్కడే బ్రతుకనివ్వండి’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ( ఏ టి ఆర్ ) ప్రాంతం చెంచులు స్పష్టం చేశారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఏటీఆర్ ప్రాంత చెంచు జాతి గిరిజనులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిసి తమ సమస్యలను తెలిపారు.
తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని అడవుల్లోనే నివసిస్తున్న తాము టైగర్ రిజర్వ్ కోసం చెంచు పెంటలను ఖాళీ చేసి బయటి ప్రాంతానికి వెళ్లి జీవించలేమని స్పష్టం చేశారు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నా పులులతో కలిసి జీవించేందుకు కూడా తాము సిద్దమే కానీ చెంచు పెంటలను మాత్రం బలవంతంగా ఖాళీ చేయించవద్దని ఏ టి ఆర్ చెంచులు సార్లపల్లి పెంట చిగుర్ల మల్లికార్జున్, రాయిలేటి పెంట మండ్లి చిట్టెమ్మ, కొమ్మనపెంట చిగురుల నాగమ్మ, సార్లపల్లి పెంట కుడుముల తిరుపతయ్య కోరారు. అటవీ చట్టాలను శాఖ పరంతోపాటు చెంచుపెంటలకు కూడా వర్తింప చేయాలని వారు కోరారు.
ఈ విషయంపై డాక్టర్ జి చిన్నారెడ్డి స్పందిస్తూ చెంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చెంచుల అభీష్టం మేరకు ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్రతో చిన్నారెడ్డి ఫోన్ ద్వారా సంప్రదించగా చెంచు కుటుంబాలను అటవీ ప్రాంతం నుంచి బలవంతంగా ఖాళీ చేయించే ప్రసక్తే లేదని తెలిపారు. అటవీ అధికారులు, చెంచులతో సమావేశం కోసం చిన్నారెడ్డి షెడ్యూల్ ను ఖరారు చేయించారు. ఈరోజు భేటీలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి హర్ష, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం ప్రజావాణిలో 401 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 214వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 401 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 110, రెవెన్యూ శాఖకు సంబంధించి 72, ఇందిరమ్మ ఇండ్ల కోసం 125, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 92 దరఖాస్తులు అందాయి.
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.