-స్పెషల్ కేసుగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
– చెక్కును మృతుని భార్యకు అందజేసిన సీఎం ప్రజావాణి ఇంచార్జి చిన్నారెడ్డి
దుబాయ్ లో అనారోగ్యంతో కోమాలో ఉన్న జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం అనే గల్ఫ్ కార్మికున్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా పది రోజుల తర్వాత మృతి చెందడంతో స్పెషల్ కేసుగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో మృతుడి భార్య ఆరెల్లి రాజవ్వకు చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆరెల్లి గంగారాజం (61) కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై, 2025 నవంబర్ 12న దుబాయిలోని ఆస్టర్ హాస్పిటల్లో కోమాలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 14న హైదరాబాద్‌కు తరలించి, నిమ్స్‌లో చేర్చారు. అనంతరం జగిత్యాల రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొంది, చివరకు జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డిసెంబర్ 24న మరణించారు.
జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో మరణం భారత్‌లో చోటుచేసుకోవడంతో, ‘మరణ స్థలం గల్ఫ్ దేశం అయి ఉండాలి’ అనే సాంకేతిక నిబంధన కారణంగా ఆర్థిక సహాయం పొందడంలో ఆటంకం ఏర్పడగా… స్పెషల్ కేసుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.
మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి రూ. 5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ మార్చి 31న ప్రజా భవన్లో నిర్వహించిన “సీఎం ప్రవాసీ ప్రజావాణి” కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట దరఖాస్తు సమర్పించగా, డా. జీ. చిన్నారెడ్డి దరఖాస్తుపై ఎండార్స్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని స్టేట్ నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో ఫోన్ లో చర్చించి, ప్రభుత్వానికి డి.ఓ. లేఖ రాశారు.
గల్ఫ్ కార్మిక కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరి సంజయ్ కుమార్, అధికార యంత్రాంగానికి పొలాస సర్పంచ్ మిల్కూరి శంకరయ్య, డిసిసి అధ్యక్షులు గాజెంగి నందయ్యలు కృతఙ్ఞతలు తెలిపారు.