– ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే?
– ఇప్పుడు అవినీతి ఆధారాలు ఎందుకు సమర్పించలేదు?
– ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్
– హైకోర్టు తీర్పుపై సీఎం స్పందించాలి
– కాళేశ్వరం కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల, కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపితమైంది.
రాష్ట్ర హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదు.
ఇంతవరకు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి, ఫార్ములా వన్ రేస్ పేరుతో జరిగిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూఆక్రమణలు, భూకేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. అవినీతి సొమ్మును కక్కిస్తానని పదే పదే సీఎం ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకోలేదు.
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై.. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడానికి కారణం.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీయే. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలు ‘డూప్ ఫైటింగ్’ చేస్తూ.. ‘నేను గిచ్చినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కోసం.. మార్పు కావాలని ఓటేశారు. కానీ రేవంత్ సర్కార్.. హామీలను మాటలకే పరిమితం చేస్తూ.. అవినీతికి పాల్పడిన వ్యక్తులను వదిలేస్తున్నారు.
గత రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నకాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. తెలంగాణ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది కాబట్టి.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలకు వెనుకాడుతోంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యం, ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణ ప్రజలకు చేస్తున్న రాజకీయ ద్రోహం.
కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో బయట, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే.. అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలి. ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు?
అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? లేక మీ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలు, దొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.