– హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత
– కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వ్యవహారంలో హైకోర్టు స్టే… కాంగ్రెస్ తప్పిదాలపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం గమనార్హం.
హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఈ స్టే రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం మరియు తప్పిదాలేనని స్పష్టమవుతోంది. హైకోర్టు సూచించిన అంశాలు, వెల్లడించిన కారణాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వైపే చూపుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విధివిధానాలు, విచారణలో నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అసలు అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.
కాబట్టి, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల వెనుక ఉన్న దోషులు ఎవరైనా సరే, వారికి చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.