– సగర్వంగా నిలబడి — సర్కారు బడి జెండా ఎగిరింది!
– ఈ ప్రకటన కేవలం ఫోటోల సమాహారం కాదు.. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం
– ప్రభుత్వ బడులే.. ప్రగతికి గడపలు!
ఇది ఏ కార్పోరేట్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్ కాదు!
మొట్టమొదటిసారిగా మనం చూస్తున్న అక్షర శిఖరాలపై మన ‘ప్రభుత్వ’ జయ కేతనం!
ఒకప్పుడు “సర్కారు బడి” అంటే కేవలం పేదరికం నిండిన గోడల మధ్య అక్షరాలు నేర్చుకునే చోటు మాత్రమే అనే అపోహ ఉండేది. కానీ నేడు సీన్ మారింది. కార్పొరేట్ సంస్థల ధన ప్రవాహం ముందు, అంకితభావంతో కూడిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తన సత్తా చాటుతోంది. నేటి ఈనాడు పత్రికలో మనం చూస్తున్న ఈ ప్రకటన కేవలం ఫోటోల సమాహారం కాదు — అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
ఈ ప్రకటనలో కనిపిస్తున్న విద్యార్థుల మార్కులు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. 600కు 596, 595 మార్కులు సాధించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది విద్యార్థి పట్టుదల, ఉపాధ్యాయుల కృషి, మరియు ప్రభుత్వ ప్రోత్సాహం — ఈ మూడూ కలిసిన త్రివేణి సంగమం అయినప్పుడే సాధ్యం.
నిల’బడి’ గెలిచారు: “సగర్వంగా నిలబడి” అన్న నినాదానికి తగ్గట్టుగానే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ చిన్నారులు నేడు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
లీప్ (LEAP) తీసుకున్న విద్యా ప్రమాణాలు: శిక్షణలో నాణ్యత పెరగడం వల్లే టెన్త్ రిజల్ట్స్‌లో ప్రభుత్వ బడులు బెస్ట్ అనిపించుకుంటున్నాయి.
అయితే LEAP అనే కార్యక్రమం ఆకాశం నుంచి దిగి రాలేదు. దీని వెనుక ఉంది — ఒక స్పష్టమైన దార్శనికత. విద్యా రంగంలో సమూల మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్న మంత్రి నారా లోకేష్ — విద్యను కేవలం బడ్జెట్ అంకెగా కాకుండా, ప్రతి పిల్లవాడి హక్కుగా చూసిన దృష్టికోణం — ఈ ఫలితాల్లో కనిపిస్తోంది. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ, జవాబుదారీతనం — వీటన్నింటినీ ఒకే దారిలో నడిపించిన పరిపాలన దక్షత ఈ మార్కుల్లో ప్రతిఫలిస్తోంది.
“అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ.. స్నేహపూర్వక బోధన” — ఈ పదాలు వినడానికి ఎంత బాగున్నాయో, ఆచరణలో అంతకంటే గొప్ప ఫలితాలను ఇచ్చాయి. ఒక విద్యార్థికి బడి అనేది రెండో ఇల్లు కావాలి. ఈ ప్రకటనలోని విద్యార్థుల చిరునవ్వులే సాక్ష్యం — వారు కేవలం ఒత్తిడితో చదవడం లేదు, ఇష్టపడి చదువుతున్నారు.
వసతులతో పాటు నాణ్యమైన భోజనం కూడా అందడం వల్ల వారు ఏకాగ్రతతో చదవగలుగుతున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ హైస్కూల్స్ నుంచి వస్తున్న ఈ ఫలితాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ విద్యపై భరోసానిస్తున్నాయి.
లక్షలు పోసి కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తేనే ర్యాంకులు వస్తాయనే భ్రమను ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు పటాపంచలు చేశారు. అపారమైన మేధాశక్తి మన సర్కారు పిల్లల్లో ఉందని నిరూపించారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించే తల్లిదండ్రులకు, ఈ అక్షర యోధుల విజయగాథలే దిక్సూచి.
ప్రభుత్వ బడులే.. ప్రగతికి గడపలు!
-చాకిరేవు