– సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా?
– కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ నేతలకు దండిగా మద్దతు
– రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న అపవిత్ర మైత్రి వల్లే అరెస్టులు జరగడం లేదు
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం మరియు పోలీసుల తీరును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, అధికార యంత్రాంగంపై నిప్పులు చెరిగారు.
బీసీ వర్గానికి చెందిన ఒక బాలికను బండి భగీరథ మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా? అని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైనా ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
బాధిత తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొడుకు ఆచూకీ లేకపోయినా, ఫోన్ స్విచ్ఛాఫ్ ఉన్నా తండ్రిగా సంజయ్ కంగారు పడకుండా సభల్లో పాల్గొనడం చూస్తుంటే.. ఆయనే స్వయంగా నిందితుడిని తప్పించారనే అనుమానం కలుగుతోందని అన్నారు. లోపభూయిష్టమైన విచారణ: పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు (5-7) పెట్టకుండా కేవలం 11వ సెక్షన్ పెట్టడం నిందితుడిని కాపాడే ప్రయత్నమేనని ఆరోపించారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బాధితులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తే తప్ప , కేసు నమోదు చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, బీజేపీ నేతలకు దండిగా మద్దతు లభిస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న అపవిత్ర మైత్రి వల్లే అరెస్టులు జరగడం లేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బండి భగీరథను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.