– అందుకే నిందితుడిని కాపాడుతున్నారు
– పోక్సో కేసు నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి
– కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు అనడం హాస్యాస్పదం
– సిట్ విచారణ పేరిట నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి
– మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగితే మూడు నెలల వరకు ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదు?
– బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్
నిజామాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు మరియు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు అనడం హాస్యాస్పదం అని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరిట నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఒక మైనర్ బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపించారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని మండిపడ్డారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేది వేదం అని, అటువంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. నిందితుడు ఆమెపైనే తిరిగి ‘హనీ ట్రాప్’ పేరుతో కేసు పెట్టడం దారుణమని అన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని అర్థమవుతోందని అన్నారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లది ఫెవికాల్ బంధం” అని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారని, కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అందుకే ఒక కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపబడినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు.
పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద విషం చిమ్మే బండి సంజయ్, తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారని అడిగారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే సంజయ్, ఇప్పుడు తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ కేసులో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని గౌరవించాలని, బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.