- రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలతో సరికొత్త రికార్డు
- వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు
- ఒకేసారి 8 వేలు స్వయం సహాయక సంఘాల భవనాలకు భూమిపూజ
- కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8,000 సంఘాల భవన నిర్మాణాలకు వర్చువల్ విధానంలో జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను వివరించారు.
గతంలో మహిళా సంఘాలకు సొంత కార్యాలయాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడేవారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. పంచాయతీ కార్యాలయాల్లోనో, సభ్యుల ఇళ్లల్లోనో, చివరకు స్థలం లేక చెట్ల కింద కూర్చొని సమావేశాలు నిర్వహించుకునే దుస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ, మహిళలకు గౌరవప్రదమైన రీతిలో శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ 8 వేల కార్యాలయాల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు.. గత పదేళ్లుగా మహిళా సంఘాలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ నాయకులు హేళన చేశారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని చెప్తే విపక్షాలు నవ్వాయన్నారు.
“మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మా నిబద్ధతతో నిరూపించాం. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఏకంగా రూ.60,000 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళలకు అందించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాం. రాబోయే రెండున్నర ఏళ్లలో ఈ మొత్తం రూ.లక్ష కోట్లే కాదు.. రూ.1,25,000 కోట్లకు పైబడేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. మా సాధించిన ఈ విజయమే నాడు విమర్శించిన వారికి చెంపపెట్టు” అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
మహిళా సంఘాలకు మరింత ఆర్థిక ఊతం ఇచ్చేందుకు వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన తెలిపారు. గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కల చొరవతో రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు.
‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం’ అనే లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా.. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి నిర్దిష్టమైన టార్గెట్లు (లక్ష్యాలు) నిర్దేశించి, ఒక స్పష్టమైన టైమ్ క్యాలెండర్ను రూపొందించాలని సీఎం ఆదేశించారన్నారు. ఇది ప్రభుత్వం యొక్క సంకల్ప బలానికి, చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి విక్రమార్క కొనియాడారు.
మహిళా సంఘాల సభ్యులందరూ ఈ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా మరింత పైపైకి ఎదగాలని, దేశానికే దిక్సూచిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.