- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
- నేటి నుండి మూడు రోజుల పాటు అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పర్యటన
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపై క్షేత్రస్థాయి సమీక్ష
ఢిల్లీ/ భీమవరం : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేటి నుండి మూడు రోజుల పాటు అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ కీలక పర్యటన సాగనుంది.
మంగళవారం సాయంత్రం అస్సాంలోని గౌహతికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చేరుకున్నారు. బిజెపి నాయకత్వంలో నూతనంగా కొలువుదీరిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మతోపాటు ఇతర కీలక నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనను మరింత వేగవంతం చేయడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.
మేఘాలయలో DoNER మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల సమీక్ష:
అస్సాం పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మేఘాలయ రాష్ట్రంలో రెండు రోజుల పాటు అధికారికంగా పర్యటిస్తారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి (DoNER) మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ ప్రజాసంక్షేమ, మౌలిక వసతుల పథకాల అమలుతీరును ఆయన నేరుగా పర్యవేక్షిస్తారు. ఇందులో భాగంగా మేఘాలయలోని సుదూర ప్రాంతమైన సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ (South West Khasi Hills) జిల్లాలో కేంద్ర మంత్రి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘అంత్యోదయ’ (సమాజంలో చివరి వరుసలో ఉన్న నిరుపేదకు సైతం సంక్షేమ ఫలాలు అందడం) స్ఫూర్తితో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు ఈశాన్య రాష్ట్రాలలోని ప్రతి పౌరుడికి క్షేత్రస్థాయిలో అందుతున్నాయా లేదా అని సమీక్షించడంతో పాటు, అక్కడ ప్రగతి చక్రం మరింత వేగవంతం అయ్యేలా అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.