-దళితత్వమో, బ్రాహ్మణ్యమో పుట్టుకతో వచ్చేది కాదు
- ఆలోచనా సరళి, ఆపై ప్రవర్తన వంటి వాటితో అవి వస్తాయి అని నిరూపించిన వ్యక్తి ఇళైయరాజా
- ఇళైయరాజా దైనందిన జీవనం బ్రాహ్మణత్వంతోనూ, హైందవ సాంప్రదాయికంగా ఉంటుంది
- ఇళైయరాజా రెజర్వేషన్ వ్యక్తి కాదు.. రెవరెన్షియల్ వ్యక్తి.
- ఇళైయరాజా 35 మార్కుల వ్యక్తి కాదు 100 మార్కులకూ మించిన వ్యక్తి!
భారతదేశంలోని అత్యున్నతమైన చలన చిత్ర సంగీత దర్శకుల్లో ప్రముఖుడు ఇళైయరాజా (ఇళయరాజా అనడం సరికాదు). సినిమా పాట స్థితిని, గతిని మెరుగుపరిచిన కొద్దిమంది సంగీత దర్శకుల్లో ఒకరు ఇళైయరాజా.
ఇవాళ ఇళైయరాజా పుట్టిన రోజు.
“ట్రెండ్ సెట్టర్ అంటే ఇతనే” అని కె.వీ. మహాదేవన్ ఇళైయరాజాను అనడం ఇళైయరాజాను మనకు సరిగ్గా తెలియజేస్తుంది.
1943లో ‘రాసయ్య’ గా పణ్ణయపురమ్ అనే తమిళ్ష్నాడులోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి 1976లో అణ్ణక్కిళి సినిమాతో ఇళైయరాజాగా సినిమా సంగీత దర్శకుడయ్యారు. అంతకు ముందు రాజా పేరుతో జీ.కె. వెంకటేష్ దగ్గర సహాయకుడుగా పనిచేశారు.
కొన్ని జీ.కె. వెంకటేష్ పాటలు ఇళైయరాజా చేసినవే. కొన్ని జీ.కె.వెంకటేష్ బాణీలు ఇళైయరాజా వాద్య సంగీతంతో గొప్ప పాటలయ్యాయి. ఉదాహరణకు సొసెతంద సౌభాగ్య కన్నడ సినిమాలో “రవివర్మన కుంచద కలే బలే సాకారవో…” పాట. 1972 ప్రాంతంలో ఆయన సంగీతం ఒక రిక(ర్)డ్ గా విడుదలయింది.
చిక్కని కర్ణాటక సంగీతాన్నీ, చిక్కని పాశ్చాత్య సంగీతాన్నీ, చిక్కని జానపద సంగీతాన్నీ ఎంతో ప్రతిభావంతంగా, ఎంతో సృజనాత్మకంగా ప్రయోగించారు ఇళైయరాజా.
మూన్ఱాం పిరై అన్న తమిళ్ సినిమాలో ఇళైయరాజా చేసిన “పొన్మేని ఉరుగుదే…” పాట విని ఆర్.డీ బర్మన్ ఆశ్చర్యపోయారు. ఎస్. రాజేశ్వరరావు ఒక సందర్భంలో “ఎన్నో ప్రయోగాలు చేస్తున్న మేధావి” అని ఇళైయరాజాను అన్నారు.
పాశ్చాత్య సంగీతంలో విశేషాంశాలైన harmony , contrapuntals, syncopations, bass line chordsను ఇళైయరాజా చాల ప్రతిభావంతంగానూ, ప్రభావవంతంగానూ, ప్రగాఢంగానూ ప్రయోగించారు. కర్ణాటక సంగీతాన్ని విశేషమైన ప్రజ్ఞతో ప్రయోగించారు. రాగ, తాళ నడకల్లో ప్రత్యేకమైన ప్రభావవంతమైన నేర్పును ప్రదర్శంచారు. ఎరుక ఆధారంగా ఎన్నో పాటల అద్భుతాల్ని నిర్మించారు. గొప్ప సంగీత దర్శకుడు నొషాద్ (నౌషాద్) ఇళైయరాజా దగ్గరనుంచి తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని బహిరంగంగా చెప్పారు.
శంకర్-జైకిషన్ తరువాత అనూహ్యమైన, అసాధారణమైన సంగీతం పరంగా ఎంతో గొప్పవైన పాటల్ని, ఘనమైన పాటల్ని ప్రజాదరణ పొందిన పాటలుగా చెయ్యగలిగింది ఇళైయరాజానే.
1,200పై చిలుకు సినిమాల సంగీత దర్శకుడు ఇళైయరాజా! 8000పైగా పాటలు చేశారు ఆయన.
దళపది(తి) తమిళ్ష్ సినిమాలో ఇళైయరాజా చేసిన “రాక్కమ్మా కయ్యతట్టు…” పాటను బీ.బీ.సీ. గొప్ప పాటగా శ్లాఘించింది. సృజనాత్మకత పరంగా అది చాల గొప్ప పాట. ప్రపంచంలోని పదిమంది గొప్ప సంగీత దర్శకుల్లో ఇళైయరాజా స్థానం సంపాదించుకున్నారు. ఇళైయరాజాకు సంగీతం పరంగా అంతర్జాతీయ ఆలోచన, సృజనాత్మకత, ఆచరణ ఉన్నాయి. ఆయన చేసిన “How to name it”, “Nothing but wind” ఆల్బమ్స్ అందుకు తార్కాణం.
తెలుగు స్వాతిముత్యం సినిమాలో “పట్టుచీర తెస్తననీ…” పాటనూ, అదే సినిమాలో “రామా కనవేమిరా..” అన్న హరికథనూ తెలుగు వ్యక్తి కాని ఇళైయరాజా చాల గొప్పగా తెలుగు తనంతో చేశారు.
ఇళైయరాజా తన ప్రయోగాలవల్ల కొన్ని సందర్భాల్లో వివాదాస్పదుడు అయ్యారు. బహుశా ఆయనలా విమర్శలకు గురైన సంగీత దర్శకుడు మన దేశంలో మరొకరు లేరేమో? “వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే…” పాట అసలు బాణి చేసే విధానమే కాదు” అని అన్న పరిశీలకులున్నారు.
ఇళైయరాజా గత 25యేళ్లుగా తెలుగు సినిమా పాటను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారు. ఇళైయరాజా పాటల ఆధారంగా కొందరు సంగీత దర్శకులు తెలుగులో చలామణిలోకి వచ్చారు.
ఇళైయరాజా a special fair and flavor in Indian film music.
ఇళైయరాజా తన సంగీత స్వప్నాలను నిజం చేసుకునేందుకు (సంగీద కనవుగళ్ అంటే సంగీత స్వప్నాలు అన్న పేరుతో ఆయన ఒక పుస్తకం రాశారు) అప్పటి మద్రాస్ చేరుకున్నారు.
ఎన్నో కష్టాలు… ఎన్నెన్నో అవమానాలు… ఇంకెన్నో తిరస్కారాలు…అన్నీ పడ్డాక రాసయ్య రాజా అయి ఆపై ఇళైయరాజా అయి సంగీత సాగరంలో ఉవ్వెత్తున లేచిన కెరటం అయ్యారు. అణ్ణక్కిళితో ఎగసిన ఇళైయరాజా శిఖరాలను అందుకున్నారు. తొలి నాలుగు సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తి చేశారు.
సినిమా తరువాత సినిమాతో సినిమా సంగీతానికి తన ప్రతిభతో కొత్త రుచుల చవిని చూపారు. ఒక్కసారిగా దేశం తమిళ్ష్ సినిమా వైపు తల తిప్పింది. ఇళైయరాజావల్ల తమిళ్ష్లో వస్తున్న సినిమా సంగీతాన్ని ఆశ్చర్యంతో వినడం మొదలు పెట్టింది.
ఇళైయరాజా తొలి సినిమా అణ్ణక్కిళి. తమిళ్ష్ సినిమా సంగీతంలోనే కాదు మొత్తం దక్షిణాది సినిమాలోనే ఒక అనూహ్యమైన ఒరవడికి నాంది అణ్ణక్కిళి సినిమా సంగీతం.
6/8 నడక లేదా తాళ నిర్మాణం (time signature)లో ఒక ఊపు ఊపేసిన పాట ఇది. 6/8 జానపద తాళం. 6/8ను ఇళైయరాజా వాడినంత గొప్పగా దేశంలో మరో సంగీత దర్శకుడు వాడినట్టు లేదు. 1950 నుంచీ 70ల వరకూ ఈ 6/8 మన దేశ సినిమాలో చాల తక్కువ. Western country musicను తన మేధతో ఇళైయరాజా ఈ పాటలోకి తీసుకువచ్చారు. పాశ్చాత్య సంగీతంలోని ఒక గిటార్ ఖండికను జానపద బాణిగా మలిచారు. ఈ విషయాన్ని ఇటీవల ఇళైయరాజా ఒక వేదికపై demo చేసి తెలియజేశారు.
ఈ పాట నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తే పోకడపరంగానూ, సమర్పణ పరంగానూ బాణి, బాణికి మిళితమైన వాద్య సంగీతం ఈ రెండిటిలోనూ ప్రత్యేకతలు తెలియవస్తాయి.
ఈ పాట రిక(ర్)డ్ (రికార్డ్) చేసినప్పుడు మొదటిసారి సరిగ్గా వచ్చింది అనుకుంటే టేప్ మీద నమోదు అవలేదు. మళ్లీ రిక(ర్)డింగ్ కు ఆయత్తమైనప్పుడు కరెంట్ పోయింది. ఈ సినిమాకు ముందు ఇళైయరాజాకు కొన్ని అవకాశాలు వచ్చి బాధాకరంగా జారిపోయాయి. ఆశాభంగాల పరంపరను తట్టుకుని, తట్టుకుని మానసిక క్షోభ నుంచి ఇళైయరాజా ఉత్పత్తి చేసిన సంగీత శోభ ఈ పాట.
భద్రకాళి సినిమాలో “కణ్ణన్ ఒరు కైక్కుళందై…” (తెలుగులో “కన్నులలో నీవయ్యా…”) పాట ఇళైయరాజాను ఒక నాణ్యమైన సంగీత దర్శకునిగా లోకానికి తెలియజేసింది. తరువాత పదినారు వయదినిలే (పదహారేళ్ల వయసు) సినిమాలో జానకి పాడిన “సెందూరప్పూవే, సెందూరప్పూవే…” పాట. పల్లెటూరి వాతావరణంలోని పాటకు వెస్టన్ కళను అద్ది అందించారు.
వాడవాడలా మారుమోగిపోయింది ఆ పాట.
వెస్టన్, జానపదం, కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలను మేళవించి చాల చాల గొప్ప పాటలను ప్రయోగాలుగా చేశారు. గొప్ప ప్రయోగ శీలి ఇళైయరాజా. వెస్టన్ సంగీతంలో ఉండే harmony, counter points (or contra puntal) chord progressions, syncopations, bass line chords వీటిని సినిమా పాటలలో ముఖ్యాంశాలుగా చేశారు ఇళైయరాజా. వీటిని అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగించారు. Fugue techniqueను కూడా ఇళైయరాజా ప్రయోగించారు.
1982లో వచ్చిన మూన్ఱామ్ పిరై (తెలుగులో వసంత కోకిల)
సినిమాలో “పొన్మేని ఉరుగుదే…” అన్న పాటను విని ఆర్.డీ. బర్మన్ ఆశ్చర్యపోయి “25యేళ్ల తరువాత రావాల్సిన పాటను ముందుగా ఇళైయరాజా చేశారు” అన్నారట.
Arrangements లో ఒక విప్లవం ఇళైయరాజా. ఆయన వచ్చాకే దక్షిణాదిలో arrangement అన్నది ప్రస్ఫుటం అవడం, దానిపై విరివిగా చర్చలు జరగడం మొదలయింది. అదే విధంగా రీ-రికార్డింగ్ లోనూ విప్లవాన్ని తీసుకొచ్చారు ఇళైయరాజా. రీ-రిక(ర్)డింగ్ ద్వారా ఇళైయరాజా కథ చెప్పగలరు అంటారు.
హరి ప్రసాద్ చౌరస్యా పిల్లనగ్రోవితో మలయాళ సినిమా కామాగ్ని లో ఇళైయరాజా చేసిన రీ-రిక(ర్)డింగ్ మహోన్నతమైనది. Tones పై సరైన అవగాహన ఉన్న సంగీత దర్శకుడు ఇళైయరాజా. సద్మా హిందీ సినిమాలో “ఏ జిందగీ…” పాటలోని Tones ఆశ్చర్యకరమైనవి.
Paul Mauriat (పోల్ మరిఅ) ఒక గొప్ప అంతర్జాతీయ సంగీత వేత్త. ఆయనతో మాట్లాడ్డానికి ఎంతో ప్రయత్నించిన ఇళైయరాజాకి ఐదు నిమిషాలు మాత్రమే అవకాశం దొరికింది. మాట్లాడ్డం మొదలయ్యాక వారి సంభాషణ గంటన్నర కొనసాగింది. అదీ ఇళైయరాజా.
ఆ సందర్భంలో ఇళైయరాజా కోళిక్కూవుదు అనే సినిమాలో చేసిన “ఏదో మోగం, ఏదో దాగం…” అన్న పాటను విన్న Paul Mariut ఇలా అన్నారట “this is not Indian this is international”. అవును ఇళైయరాజా అంతర్జాతీయ సంగీతాన్ని మన దక్షిణభారతానికి తెచ్చారు. Symphony, Sonata ల సంగీతాన్ని తమిళ్ష్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమా పాటల్లోకి తెచ్చారు ఇళైయరాజా.
ఇక కర్ణాటక సంగీతపు రాగాలను అద్భుతంగానూ, సందర్భ శుద్ధితోనూ సినిమా పాటలలో పొందుపరిచారు ఇళైయరాజా. ఈ విషయంగా ఎన్నెన్నో పాటలను చెప్పచ్చు. కోయిల్ పురా(1981) తమిళ్ష్ సినిమాలో ఏసుదాస్ పాడిన ” వేదమ్ నీ ఇనియ నాదం నీ…” పాట కర్ణాటక సంగీతం ఆధారంగా చేసిన ఒక అద్భుతమైన పాట. బాలనాగమ్మ అనే తమిళ సినిమాలో బిలహరి రాగంలో “కూన్దలిలే మేగం వన్దు…” పాట గొప్పగా ఉంటుంది. చలనాట, వకుళాభరణం, బౌళి వంటి రాగాల్ని ప్రతిభావంతంగా ప్రయోగించారు.
శాస్త్రీయ సంగీతంలోని అన్యం, అతీతం వంటి వాటిని ఇళైయరాజా సినిమా పాటలలో నేర్పుగా ఉపయోగించారు. తాళం, శ్రతిబేధం వంటి వాటిని విన్నాణంతో ప్రయోగించారు.
తెలుగు సాగరసంగమం సినిమాలో కర్ణాటక సంగీతం ఆధారంగా గొప్ప పాటలు చేశారు ఇళైయరాజా. నిజానికి సాగర సంగమం సినిమా back ground score ఒక సమాంతర దర్శకత్వంలా ఉంటుంది.
తెలుగులో ఇళైయరాజాకు తొలి సినిమా యుగంధర్ కన్నా కాస్త ముందు వచ్చిన పంచభూతాలు సినిమా. (భద్రకాళి తమిళ్ష్, తెలుగు ద్విభాషా చిత్రం. ముందుగా తమిళ్ష్లోనే ఆ సినిమా పాటల్ని చేశారు) యుగంధర్ సినిమాలో “దా, దా.. దాస్తే దాగేదా…” పాట ప్రత్యేకమైంది. అటు తరువాత అభిలాష సినిమాలో “ఉరకలై గోదావరి ఉరికె నాలోనికి…” పాట ప్రస్తుతించాల్సిన పాట. దర్శకులు వంశీ, కె. విశ్వనాథ్ లకు గొప్ప గొప్ప పాటలు చేశారు ఇళైయరాజా.
జానపద సంగీతానికి వెస్టన్, కర్ణాటక ఛాయల్ని అద్ది గొప్ప పాటల్ని చేశారు. “మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా…” పాట ఇలాంటి వాటికి ఒక మచ్చుతునక.
కాలం ఎల్లల్ని దాటి మారుతున్న పోకడలను అందుకుని పాటలను చేస్తూ వస్తున్నారు ఇళైయరాజా. 2015 లో వచ్చిన అమితాబ్ నటించిన షమితాబ్ సినిమాలో “పిడిలిసీబాతే…” పాట ఓ గొప్ప పాట.
ఎంతమందికి తెలుసు? Idea net work theme music ఇళైయరాజాదే. మణిరత్నం తొలిచిత్రం కన్నడ పల్లవి అనుపల్లవి సినిమాలోని “నగువా నయనా…” పాటలోని ఒక phrase అది.
ఇళైయరాజా ఒక కవి కూడా. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. “వెట్టవెళియిల్ కొట్టిక్కిడక్కిన్ఱన” (ఆరుబయట ఒలకబోసి ఉన్నాయి) అన్న కవితా సంకలనం రాసి ప్రకటించారు ఇళైయరాజా.
ఇటీవల ఇళైయరాజా అంతర్జాతీయంగా Valiant పేరుతో symphony సంగీతాన్ని చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. Symphony చెయ్యడం అంటే మాటలు కాదు. ఏవో మాటలు చెప్పెయ్యడం కాదు symphony. మాటలతో ‘ఇళైయరాజా గొప్ప’ అని చెప్పడం గొప్పకాదు. ఇళైయరాజా గొప్పతనాన్ని అవగతం చేసుకోవడం చాల గొప్ప.
ఇళైయరాజా కులం ప్రాతిపదికగానో, రిజర్వేషన్లతోనో జీవించడం లేదు. అట్టడుగు స్థితి నుండి ప్రతిభతో, ఎరుకతో, పరిశ్రమతో, కృషితో, జ్ఞానంతో, సృజనాత్మకతతో ఎదిగి చరిత్ర సృష్టించిన ఉన్నతమైన కళాకారుడు! మనిషి ఎదగడానికి కులం ప్రధానం కాదు, అడ్డూ కాదూ అని తాను సాధించిన విజయంతో చాటిన వ్యక్తి ఇళైయరాజా.
దళితత్వమో, బ్రాహ్మణ్యమో పుట్టుకతో వచ్చేది కాదు. ఆలోచనా సరళి, ఆపై ప్రవర్తన వంటి వాటితో అవి వస్తాయి అని నిరూపించిన వ్యక్తి ఇళైయరాజా. అర్థ శతాబ్ది క్రితమే బ్రాహ్మణ్యంలోకి వెళ్లి పెను విజయవంతమైన శక్తి ఇళైయరాజా. బ్రాహ్మణత్వం అంటే పుట్టుక కాదు జీవన విధానం, ప్రవర్తనా సరళి అన్న సత్యాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి. దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి.
ఇళైయరాజా దైనందిన జీవనం బ్రాహ్మణత్వంతోనూ, హైందవ సాంప్రదాయికంగా ఉంటుంది. ఇళైయరాజా రెజర్వేషన్ వ్యక్తి కాదు ఇళైయరాజా రెవరెన్షియల్ వ్యక్తి. ఇళైయరాజా 35 మార్కుల వ్యక్తి కాదు 100 మార్కులకూ మించిన వ్యక్తి!
ఇంకా ఎంతో, ఎన్నో చెప్పవచ్చు , చెప్పుకోవచ్చు ఇళైయరాజా గురించి. మాటలపై మాటలతో పలు మాటలుగా చెప్పుకుంటూ ఉండాల్సిన, కాలాలు మెచ్చుకుంటూనే ఉండే సంగీత సృష్టి కర్త ఇళైయరాజా.
- రోచిష్మాన్
9444012279