September 15, 2026

జగన్ వర్సెస్ విజయసాయిరెడ్డి: ఢిల్లీ అండ, న్యాయ చిక్కుల మధ్య రాజకీయ చదరంగం!

  • రాజశేఖరరెడ్డి మరణించి బతికిపోయారు
  • లేకుంటే ప్రథమ స్థానంలో ముద్దాయిగా ఆయనే ఉండేవారు
  • జగతికి డబ్బులు ఎలా మళ్లించారు అనేది సాయిరెడ్డికి తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు
  • ఈ రెండు విషయాలలో సాయిరెడ్డి సాక్ష్యం కీలకం
  • ఎక్కడైనా కాగితాల పైన జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారు కానీ సాయిరెడ్డి ఉండరు
  • సాయిరెడ్డి అప్రూవర్‌గా మారతాను అనగానే జగన్ భయపడతాడు అనుకోవడం పొరపాటు
  • అప్రూవర్‌గా మారడం అంటే సాయిరెడ్డి నిజాయతీకి పరీక్ష లాంటిదే

(ఇంద్రాణి)

విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతానని బెదిరిస్తున్నారు. ఆయన బెదిరించగానే జగన్‌మోహన్‌రెడ్డి బెదిరిపోతాడా లేదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. బెదరొచ్చు, బెదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించే జగన్‌పై ఉన్న కేసుల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డిని ముద్దాయిగా చేశారు.

ఆ కేసుల్లో అధికార దుర్వినియోగం చేసింది రాజశేఖరరెడ్డి. సాంకేతికంగా జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడు అధికారంలో లేరు. ఇవన్నీ ఆలోచించే రాజశేఖరరెడ్డిని స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆ కేసుల్లో ఇరికించారు. ఆ విషయం షర్మిలకు కూడా తెలియదు. ఆ ధైర్యం లేకుంటే జగన్‌మోహన్‌రెడ్డి విజయసాయిరెడ్డిని నెత్తిన పెట్టుకునే ఉండేవారు. జగన్ న్యాయవాదుల సలహానుసారం తండ్రిని ముద్దాయిని చేసిన కారణమే అది.

సీబీఐ పేర్కొన్న ఛార్జ్‌షీట్‌లో కూడా రాజశేఖరరెడ్డి తన కుమారుడి వ్యాపార సంస్థల్లోకి విదేశీ, దేశీయ సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. తన కొడుకు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు, గనుల లీజులు, సెజ్ అనుమతులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల నిర్ణయాల్లో వైఎస్సార్ నిబంధనలు సడలించారు అని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

వ్యాపారవేత్తలు, కొన్ని ప్రముఖ కంపెనీలు జగన్ కంపెనీలలో భారీ ప్రీమియం చెల్లించి షేర్లు కొనడానికి ప్రతిఫలంగా వైఎస్సార్ ప్రభుత్వం ఆయా కంపెనీలకు ప్రభుత్వపరంగా అనుకూల నిర్ణయాలు తీసుకున్నదని సీబీఐ ఆరోపించింది. ఆయా పనుల కోసం వైఎస్సార్, బి.పి. ఆచార్య లాంటి అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చారని సీబీఐ పేర్కొన్నది.

రాజశేఖరరెడ్డి మీద ఇన్ని ఆరోపణలు చేసిన సీబీఐ, జగన్ మీద చేసిన ఆరోపణలు రెండే. అందులో ఒకటి—జగతి పబ్లికేషన్స్ షేర్ ధరను ఎక్కువ చేసి చూపించారు అని; రెండవది—సూట్‌కేస్ కంపెనీలు మరియు విదేశీ రూట్ల ద్వారా నల్లధనాన్ని జగన్ కంపెనీల వైపు నిధుల రూపంలోకి మళ్లించారు అని సీబీఐ, ఈడీలు తమ ఛార్జ్‌షీట్లలో పేర్కొన్నాయి.
అయితే ఈ ఆరోపణల్లో కూడా పెట్టుబడుల రూపంలో నల్లధనాన్ని సమకూర్చింది ప్రభుత్వంతో లబ్ధి పొందిన కంపెనీలే. జగన్‌మోహన్‌రెడ్డి పైన కుట్ర కోణం ఉన్నదని మాత్రమే ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసింది రాజశేఖరరెడ్డి అయితే, ప్రతిఫలం ఆశించి అక్రమ మార్గంలో లబ్ధి పొందింది ఆయా కంపెనీలు.

జగన్‌మోహన్‌రెడ్డి కంటే ఆయనకు నిధులు సమకూర్చిన వాన్‌పిక్, హెటెరో మరియు అరబిందో ఫార్మా భూముల కేటాయింపులో లబ్ధి పొందాయని, ఇందు ప్రాజెక్ట్స్ వారు లేఅవుట్ లాంటి వాటిలో నిబంధనల సడలింపులు పొంది ప్రతిఫలంగా జగతిలో షేర్లను అత్యధిక ప్రీమియంకు కొన్నారనేది సీబీఐ ఛార్జ్‌షీట్ పేర్కొన్న విషయం.

పెన్నా, దాల్మియా సిమెంట్స్, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, ఇండియా సిమెంట్స్, రాంకీ—వీరి మీద ఉన్నంత నిర్దిష్టమైన ఆరోపణలు కూడా జగన్ పైన లేవు. జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న ప్రధానమైన కేసులు మనీ లాండరింగ్, అవినీతి. అవి కూడా జగన్ కంటే ఆయా కంపెనీల మీదనే ఎక్కువ భారం మోపబడి ఉన్నాయి. అసలు అధికార దుర్వినియోగం చేసిన రాజశేఖరరెడ్డే ఇప్పుడు లేరు.

ఒక విషయం ఒప్పుకుని తీరాలి: జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నంత బలమైన న్యాయవాదుల బృందం దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ ఉండి ఉండదు. సీబీఐ వేసిన ఛార్జ్‌షీట్లను చూసిన వారికి సీబీఐని జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా కట్టడి చేయగలిగారో అర్థమవుతుంది. అందుకే పాత కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతాడు అనగానే జగన్ భయపడతాడని అనుకోలేము.

అయితే విజయసాయిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ముందస్తు సంకేతం ఇచ్చేది మాత్రం, తనకు పావులు కదపగలిగే అవకాశం ఉన్నదనే. ముఖ్యంగా సీబీఐ ఆరోపించిన అవినీతి కేసులో తన సాక్ష్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఊచలు లెక్కపెట్టిస్తుంది అని సాయిరెడ్డి ఆలోచన. దీనికి తోడు సూట్‌కేస్ కంపెనీలను తెరిచి వాటి ద్వారా జగతికి డబ్బులు ఎలా మళ్లించారు అనేది సాయిరెడ్డికి తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు.

ఈ రెండు విషయాలలో సాయిరెడ్డి సాక్ష్యం కీలకం అవుతుంది. ఎక్కడైనా కాగితాల పైన జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారు కానీ సాయిరెడ్డి ఉండరు. రాజశేఖరరెడ్డి మరణించి బతికిపోయారు, లేకుంటే ప్రథమ స్థానంలో ముద్దాయిగా ఆయనే ఉండేవారు.
కానీ తన రాజకీయ జీవితం విజయసాయిరెడ్డి చేతిలో ఉన్నదని తెలిసీ జగన్‌మోహన్‌రెడ్డి సాయిరెడ్డిని అంత దూరం పెట్టారంటే, జగన్ ధైర్యం జగన్‌కు ఉండి ఉంటుంది; అది ఏదైనా అయి ఉండవచ్చు. అన్ని కేసులు పెండింగులో ఉండి కూడా తాను ముఖ్యమంత్రి అయిన తరువాత భూకబ్జాల నుండి ఇసుక వరకు, మట్టి నుండి మద్యం వరకు అన్ని దందాలు యథేచ్ఛగా చేయగలిగారంటే వెనుక ఎంత దన్ను ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

ఒకవైపు మద్యం పాలసీ రూపకల్పన చేసినదే అస్మదీయులకు లబ్ధి చేకూర్చడానికని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ‘క్యాష్ అండ్ క్యారీ’ పాలసీని నడిపింది అంటే ఆయన మద్దతుదారులు ఎంత బలమైనవారో అర్థం చేసుకోవచ్చు.

జగన్ టీమ్‌లో ఉన్నప్పుడు సాయిరెడ్డికి ప్రధానమంత్రిని కలవడం సులువు, ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా దొరకదు; అది జగన్ సత్తాయే కానీ సాయి రెడ్డి సొంతం కాదు. అందుకని సాయిరెడ్డి అప్రూవర్‌గా మారతాను అనగానే జగన్ భయపడతాడు అనుకోవడం పొరపాటు.

మరో ఇరవై సంవత్సరాలకు కూడా జగన్ కేసుల విచారణ పూర్తయ్యేలా లేదు. కానీ లోగుట్టు తెలిసిన వ్యక్తి కావటం వలన జగన్‌ను చిరాకు పెట్టగలరు. కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసేంత ధైర్యం చేయకపోవచ్చు, కానీ కేసులు మాత్రం పెడుతుంది. కేసులు పెరిగే కొద్దీ తలనొప్పి పెరుగుతుంది. ఎల్లకాలం జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుదారులే అధికారంలో ఉండరు. వారు అధికారానికి కొద్ది దూరంలో ఉంటే, ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చినవారే బేరసారాలు సాగించే అవకాశం ఉంటుంది. అది సమీప భవిష్యత్తులో జరిగితే మాత్రం సాయిరెడ్డి కోరిక నెరవేరుతుంది.

కానీ అప్రూవర్‌గా మారడం అంటే సాయిరెడ్డి అనుకునేంత సులభం కాదు. అప్రూవర్‌గా మారడం అంటే సాయిరెడ్డి నిజాయతీకి పరీక్ష లాంటిదే. సాయిరెడ్డికి లేనిదే నిజాయతీ. అప్రూవర్‌గా మారినవారు పూర్తి స్థాయిలో నిజాలు చెప్పాలి. ‘పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్‌రూములో ఉంది’ అనేలాంటి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడితే అప్రూవర్ అయినందుకు ఇచ్చే వెసులుబాటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.

బహుశా ఢిల్లీ మద్యం కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారి లబ్ధి పొందిన విషయం చూసి, తనకు అలాంటి అవకాశం వస్తుందని అనుకుని ఉంటారు. అక్కడ టార్గెట్ కేజ్రీవాల్ అయితే, ఇక్కడ టార్గెట్ జగన్‌మోహన్‌రెడ్డి. కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక పక్షంలో బలమైన నాయకుడు కాబట్టి సీబీఐ, ఈడీల వైఖరి వేరుగా ఉంటుంది.

జగన్‌మోహన్‌రెడ్డి అధికార బీజేపీకి ఆప్తమిత్రుడు; అందుకని సాయిరెడ్డి అప్రూవర్ కావడమే పెద్ద పజిల్. కాకపోతే ఈ మధ్య వివేకా హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేయగానే జగన్ బలగంలో చీలికలు వచ్చి బలం తగ్గిపోయింది అనే ఊహాగానాలు పెరిగిపోయాయి. అది వేరే కథ అని తెలియనివారు లేరు; అయినా ప్రచారం జరగాలి కాబట్టి జరుగుతుంది.

Total Visitors: 2,611,377