September 15, 2026

ఇదో ‘సహకార మీడియా’ రంగం!

( మార్తి సుబ్రహ్మణ్యం)

పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లూ వేడిగా ఉంటుందన్నది పాత సామెత. పాతివ్రత్య మీడియా ఎప్పుడు వండితే అప్పుడే వేడిగా ఉంటుందన్నది ఇప్పటి సామెత. మన తెలుగు మీడియా పాతివ్రత్యం గురించి పురాణాలు, ఇతిహాసాలు రాయకుండా బతికిపోయాయి. లేకపోతే చరిత్రకారులు, మన తెలుగు మీడియా మోతుబరుల పాతివ్ర త్యం చూసి హతాశులయ్యేవారే.

తెలుగు మీడియా మోతుబరులు ఏమనుకుంటారంటే.. తమ కోడి కూయకపోతే తెల్లారదని! తమ పలుకు లేకపోతే తెలుగు జనాలకు ముద్దు దిగదని!! తాము చెప్పినవే నిజాలని!!! మన మీడియాలో కొందరు కృష్ణశాస్త్రి అయితే, మరికొందరు శ్రీశ్రీలు. ఒకాయనది తన బాధ ప్రపంచం బాధ. మరొకాయనది ప్రపంచ బాధ తన బాధ.

రాజగురువులుంగారయితే కాసేపు కృష్ణశాస్త్రి, మరికాసేపు శ్రీశ్రీ పాత్ర జమిలిగా పోషిస్తుంటారు.

ఎలాగంటే.. చంద్రబాబు మోదీని నమ్ముకుంటే ఆయనతో పాటు ఈయనా మునిగిపోతారని ఎన్నికల ముందు ఉపదేశిస్తారు. మళ్లీ ఐదారేళ్ల తర్వాత అదే నోరు, మోదీ లేకపోతే ఏపీ అభివృద్ధి అయ్యేది కాదంటారు. అంటే రాజగురువులు నంది అంటే తెలుగు జనం కూడా నంది అనాలి. కాదు అది పంది అంటే మనమూ పంది అని తీరాలి. లేకపోతే గురువుగారు గరమవుతారు.

సహకార రంగం గురించి వినే ఉంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ‘సహకార మీడియా’ రంగం నడుస్తోంది. అంటే ఫలానా వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే ఆ వార్తలు ఇవ్వకూడదు. లేదా ఫలానా కంపెనీ దోపిడీ గురించి రాయకూడదు. ఒకవేళ ఆ కంపెనీలు-ఆ వ్యక్తులపై ఏదైనా కేసులు, దాడులు జరిగినా ఏమీ పట్టనట్లే ఉండాలి. సరే పాత్రికేయ విలువలు, వంకాయ పచ్చడి అని ఫీలయితే.. ఎక్కడో లోపల పేజీల్లో ఎవరికీ కనిపించకుండా, ఒక సింగిల్ కాలమ్ వార్త తద్దినం పెట్టాలి. అది కూడా ఏ జిల్లా పేజీల్లోనే.

మరి ఈ మోతుబరి మీడియా మధ్య వ్యాపార పోటీ ఉండదా అంటే, నిక్షేపంగా ఉంటుంది. కుట్రలు-కుతంత్రాలు- రాజకీయాలు ఉండవా అంటే ఉంటాయి. కాకపోతే తాము కూడబలుక్కుని ఎంపిక చేసుకున్న వ్యక్తులు-సంస్థల గురించి మాత్రం అవి పత్రికల్లో రాయవు. టీవీల్లో చూపించవు. ఇదే ‘ సహకార మీడియా ’ రంగం అంటే!

అలాంటి కొన్ని ఉదాహరణలు కొన్ని చూద్దాం. జగన్ జమానాలో ఆయన నియంతృత్వ వైఖరిపై సమరశంఖం పూరించి, రోజు కోర్టు ఆదేశాలతో సర్వీసు చివరి రోజున డీజీగా రిటైరయిన ఏబీ వెంకటేశ్వరరావు అనే యోధుడి పోరాటంపై, ఇదే మీడియా మోతుబరులు తెగ హడావిడి చేశాయి. జగన్‌పై తొడకొట్టి సవాల్ చేసిన ఆయన పోరాటాన్ని ఆకాశానికెత్తాయి. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు బయట వరకూ, ఆయన మీడియాతో మాట్లాడిన అంశాలను పొల్లుపోకుండా రాశాయి. టీవీల్లో అయితే లైవ్‌లు కూడా ఇచ్చాయి.

మరి అదే ఏబీ వెంకటేశ్వరరావు అనే మాజీ డీజీ.. వైసీపీ జమానాలో లబ్థిపొంది, మళ్లీ కూటమి సర్కారులోనూ వెలిగిపోతున్న అదే కంపెనీల వైనం.. దాని వెనుక దాగి ఉన్న కుంభకోణాల కుట్ర, అందువల్ల ఖజానాకు పడిన కన్నం ఇత్యాది ప్రజాప్రయోజనాల అంశాలతోపాటు.. పేదల భూములను బలవంతంగా హక్కుభుక్తం చేసుకుని, పాలకులు సాగించిన 22ఏ అక్రమాలను ప్రస్తావిస్తూ కాళ్లకు బలపం కట్టుకుని రాష్ర్టమంతా తిరుగుతున్నారు.

రైతులపై ఏఎంఆర్ దాష్టీకాలు, విద్యుత్ కొను‘గోల్‌మాల్’ చేసి వేల కోట్లు ఖజానాకు కన్నం పెట్టిన షిర్డిసాయి, ఇండోసోల్‌కు అక్రమ భూ కేటాయింపుపై ఏబీ గ త కొద్దినెలల నుంచీ సాక్ష్యాధారాలతో విరుచుకుపడుతున్నారు. బాధితుల వద్దకు వెళ్లి మరీ వారికి భరోసా ఇస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు సుఖనిద్రపోతున్న సమయంలో.. ఏబీ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి, వారిని కాకినాడ ఎస్పీ దగ్గరకు తీసుకువెళ్లిన తర్వాత గానీ, మళ్లీ కేసు గాడిన పడలేదు. తాజాగా 22ఏ బాధితులను వెంటేసుకుని కలెక్టర్ల దగ్గరకు వెళ్లి, వాటి వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన వెనక ఎవరూ లేరు. ఆయనే ముగ్గురు, నలుగురితో ఉన్న ఒక సైన్యం.

మరి ఆ ప్రకారంగా.. ఇదే మీడియా మోతుబరులు, అదే ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తావించిన అంశాలను, గతంలో మాదిరిగానే తాటికాయంత అక్షరాలతో మీడియాకెక్కించాలి కదా? ఆయన పోరాటాన్ని అప్పటి మాదిరిగానే ఆకాశానికెత్తాలి కదా? మరి చేస్తున్నాయా? లేదు!

పోనీ ఒక పత్రిక కాకపోతే మరో పత్రిక. అదీ కాకపోతే ఇంకో పత్రిక, దాని అనుబంధ చానెళ్లు. ఏవీ ఇప్పటివరకూ ఏబీ సర్కారు విధానాలను విమర్శించిన వార్తలను ప్రచురిస్తే ఒట్టు. ఈనాడు వంటి పత్రిక ‘దయతలచి’ అప్పుడప్పుడు ఒక సింగిల్‌కాలమ్ ‘తద్దినం’ పెడితే, దమ్మున్న చానెల్ కమ్ పత్రిక ఆంధ్రజ్యోతి దానికీ దిక్కులేదు.

ఇంకా విచిత్రంగా ప్రభుత్వ విధానాలను దునుమాడుతూ, బాధితుల పక్షాన పోరాడుతున్న ఏబీ వార్తలను, వైసీపీ గెజిట్ అయిన సాక్షి కూడా ప్రచురించకపోవడం! బహుశా జగనన్నకు ఇష్టులయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఏఎంఆర్, ఇండోసోల్, మేఘాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున.. ఏబీ వార్తలను సాక్షి బహిష్కరించినట్లుంది.

అలాంటి సాక్షి.. ఈమధ్య తన చర్యతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అమరావతికి సంబంధించి.. ‘జగన్ పాలనే బాగుంది’ అని ఏబీ అనని మాటని, అన్నట్లుగా సాక్షిలో ఒక వార్త వెలువడింది. దానిపై స్పందించిన ఏబీ ‘చాలా గౌరవప్రదంగా’ సాక్షికి వాతలు పెట్టారు. దానితో ఆశ్చర్యంగా- ‘ఏబీ వెంకటేశ్వరరావు అలా అనలేదు. తప్పుగా ప్రచురించినందుకు క్షమాపణ చెబుతున్నామ’ంటూ అచ్చేసిన వైచిత్రి.. సాక్షి కళ్లు తెరిచిన తర్వాత బహుశా ఏనాడూ జరగనిది. ఎవరూ చూడనది. మరి ఈ విచిత్రం ఏమిటో?

ఇక రెండో ఉదాహరణ కూడా చూద్దాం. గత రెండు రోజుల క్రితం ఏఎంఆర్ కంపెనీపై ఈడీ దేశవ్యాప్తంగా దాడి చేసింది. ఖరీదైన కార్లతోపాటు, పన్నులు ఎగేసిన కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ వార్త కొన్ని చానెళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మోత మోగించాయి.

ఈడీ అధికారులు ఏఎంఆర్ ఆఫీసులోకి వెళ్లడం టీవీల్లో నిరంతరం చూపించాయి. వెబ్‌సైట్స్ అయితే ఏఎంఆర్ గత ఘన చరిత్రను పుంఖానుపుంఖాలుగా రాశాయి. ఇంగ్లీష్-హిందీ చానెళ్లు కూడా ఏఎంఆర్‌పై ఈడీ దాడుల గురించి ప్రముఖంగా చూపించాయి.

సీన్ కట్ చేస్తే.. తెల్లారి.. మన తెలుగు మీడియా ద్వారా దివ్యజ్ఞాన జ్యోతులు వెలిగించి, ప్రజలకు మార్గదర్శిగా నిలిచి, జనం అజ్ఞానం పారద్రోలి, ‘వారు అనుకునే’ విజ్ఞానం, ‘వారు నిర్దేశించిన నిజాల’ను జనం మీదకు వదిలే మోతుబరి పత్రికల్లో.. మొదటి పేజీలో ఏఎంఆర్‌పై ఈడీ దాడి వార్త భూతద్దం పెట్టి వెతికినా కనిపిస్తే ఒట్టు.

జార్ఖండ్ నుంచి బెంగాల్‌కు కోలరీ బొగ్గును అక్రమంగా తరలించడంతోపాటు, రకరకాల టాక్సుల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడటం ద్వారా ఐదేళ్లలో 650 కోట్లు సంపాదించినట్లు ఈడీ గుర్తించి, ఏఎంఆర్ ఆఫీసులపై దాడులు చేసింది. శ్రీరామ్ ఇన్‌ఫ్రా రుణాల నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి ఈడీ బృందం కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు వచ్చి, ఏఎంఆర్ ఆఫీసులపై దాడులు చేసింది. ఇదీ ఆ వార్త సారాంశం.

నిజానికి ఇది వార్తపరంగా మొదటి పేజీలో పతాక శీర్షిక లేదా ఆ పక్కన సెకండ్ బ్యానర్ ప్రాధాన్యం ఉన్న వార్త. కానీ విచిత్రంగా అంత ప్రాధాన్యం ఉన్న వార్తను, ‘ఈనాడు’ అనే అగ్ర దినపత్రిక జస్ట్ 24వ పేజీలో, 14 లైన్లతో ఒక సింగిల్ పేజీ వార్త ఇచ్చింది. ఇక ‘ఆంధ్రజ్యోతి’లో అయితే రెండు భూతద్దాలు పెట్టుకుని వెతికినా, ఏఎంఆర్‌పై ఈడీ దాడి వార్త కనిపించలేదు. ‘సాక్షి’దీ సేమ్ టు ‘షేమ్’. విచిత్రంగా ఈ మూడిటి మధ్య పోటీనే కాదు. సైద్ధాంతిక విబేధాలున్నాయి. కానీ ఏఎంఆర్ విషయంలో మాత్రం ఇష్టం లేని మొగుడితో కాపురం చేసినట్లు, అలా ‘తద్దినం’ పెట్టేశాయి.

సహజంగా ఏదైనా నేరం, లేదా అరెస్టు, పోనీ ప్రముఖులపై కేసులు నమోదయిన సందర్భాల్లో.. మన తెలుగుమీడియా విశ్వరూపం, అతి మామూలుగా ఉండదు. నిందితుడు ఏ స్కూల్లో చదివాడు దగ్గరనుంచి, ఎలాంటి చొక్కాలు వేసుకున్నాడనేవరకూ ఊదర గొడతాయి. దానితోపాటు.. వారి అక్రమాలు,ధనార్జన, దోపిడీ, అడ్డదారి వ్యాపారాల గురించి కూడా వివణాత్మక కథనాలు ఇస్తుంటాయి.

అందాకా ఎందుకు? కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్టయితే, ఇదే తెలుగు మీడియా మోతుబరులు ‘తమకు నచ్చిన కోణంలో’ ఎన్ని కథనాలు వండి వార్చారు? ఫార్మా వ్యాపారితోపాటు, మాగుంట కుటుంబ ప్రమేయం గురించి ఎన్ని కథలు అల్లారు? జత్వాని అనే తారను ముంబయి నుంచి బెజవాడకు తెచ్చి ఆమెను ఎలా హింసించారని దగ్గరుండి చూసినట్లు ఎంత వేగంగా స్పందించారు? లిక్కర్ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి కారమూరి అండ్ సన్ వరకూ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు కదా? తాజాగా సాదిఖ్ అనే యువకుడు ఒక మహిళను సైనేడ్ ఇచ్చి ఎలా చంపాడని రాస్తున్నారు కదా?

మరి ఏఎంఆర్ అనే కంపెనీ గురించి.. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని జిల్లాల్లో మైనింగ్ సీనరేజీ రాయల్టీ ఏవిధంగా సంపాదించుకుంది? ఆ కంపెనీకి జగన్ ఎలా దన్నుగా నిలిచారు? మళ్లీ కూటమి హయాంలో అదే ఏఎంఆర్ కంపెనీకి ఎన్ని జిల్లాల టెండర్లు కట్టబెట్టారు? దానికి ఎవరు రాయబారం నడిపారు? వచ్చిన ఆదాయంలో ఎవరికెంత? అందులో ఏ స్థాయి వాళ్లున్నారు అన్న తెరచాటు కథనాలు కూడా ఇదే మీడియా మోతుబరులు రాయాలి కదా?

మరి అందుకు భిన్నంగా.. నవరంధ్రాలు మూసుకుని, మేం అనుకున్నదే వార్త. మేం చెప్పిందే నిజం. మేం రాసినప్పుడే చదవండి. మేం చూపించినప్పుడే చూడండి అన్నట్లు వ్యవహరించడం.. పైగా మీడియా మోతుబరులు తమ మధ్య ఎంత పోటీ ఉన్నా, ఏఎంఆర్‌పై ఈడీ దాడి వార్త దాచిపెట్టడం!

మరి వాటిని ఇనిన దశాబ్దాలు నెత్తినెక్కించుకుని, ‘వారిదే నిజమైన జర్నలిజం’ అని భ్రమిస్తున్న తెలుగు ప్రజలు క్షమిస్తారా? వాళ్లు క్షమించకపోయినా, మీడియా మోతుబరుల అంతరాత్మలు క్షమిస్తాయా?

Total Visitors: 2,610,006