September 15, 2026

చట్టసభల గౌరవం – ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యం

( ఇంద్రాణి)

తెలంగాణ శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ఆవేదనతో చేసిన సూచనలను శాసనసభ్యులు పాటిస్తే శాసనసభ గౌరవం ఇనుమడిస్తుందని వేరే చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు.

కమ్యూనిస్ట్ పార్టీలు ఏకైక శాసనసభ్యుడితోనే పోరాడటం కొత్త కాదు. ఒకనాడు ఓంకార్ గారు, నర్రా రాఘవరెడ్డి గారు తదితరులు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా శాసనసభను ప్రభావితం చేయగలిగారు. వారి బాటలోనే నడుస్తూ సాంబశివరావు గారు ప్రజా సమస్యలే ప్రధానంగా మాట్లాడుతూ కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి ఎంత ఉందో తెలుగు వారికి తెలియజేస్తున్నారు. ఈ పర్యాయం ఆయన ప్రజాసమస్యలతో పాటు శాసనసభలో సభ్యులు ఉపయోగిస్తున్న భాషను ఎండగడుతూ చేసిన సూచనలు, ఆయన చెప్పిన కొన్ని అసభ్య పదాలను ఉపయోగించిన వారు సిగ్గుతో తలదించుకోకపోయినా, భవిష్యత్తులో ఆచితూచి మాట్లాడితే చాలు అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.

చట్టసభల్లో జరిగే చర్చలను ప్రసార మాధ్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ప్రభుత్వం ఆమోదించింది చట్టసభల్లో సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు అనే సదుద్దేశంతోనే. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన సమస్యల గురించి మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి, బాధ్యతగా సమస్యల పైన గళం విప్పుతారు అనే ఆశతో ఇది మొదలైంది. 1989 లో లోక్‌సభతో మొదలైన ఈ ప్రసారాలు అంచెలంచెలుగా రాష్ట్రాల చట్టసభల వరకు వచ్చాయి. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు మొదలైన కొత్తలో సంతోషపడిన తెలుగు ప్రజలు, ఈరోజు శాసనసభా సమావేశాలు చూడటానికే ఇష్టపడటం లేదు.

పార్లమెంటు సమావేశాలు జరపటానికి రోజుకి కోటిన్నర నుండి రెండున్నర కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మనం ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుడికి గౌరవ వేతనం పక్కన పెట్టి, పార్లమెంటులో మన సమస్యల గురించి మాట్లాడటానికి రోజుకి రెండు వేల రూపాయల భత్యం ఇస్తారు. అలాగే శాసనసభా సమావేశాలు జరగటానికి రోజుకి ఇరవై లక్షల నుండి సభ్యుల సంఖ్యను బట్టి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది. శాసనసభ్యులకు ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారు. వారి ప్రయాణ ఖర్చులు కూడా ప్రజల సొమ్మే. కానీ శాసనసభకు వెళ్లి వీళ్లు ప్రజాసమస్యల మీద కాకుండా వ్యక్తిగత విషయాల పైన పోట్లాడుకుంటున్నారు.

తాజాగా ముగిసిన తెలంగాణ శాసనసభా సమావేశాలను గమనిస్తే, ప్రతిపక్షం తన కార్యాచరణను మొదలుపెట్టడమే రసాభాసతో మొదలుపెట్టింది. నిజంగా ప్రజాసమస్యల మీద పోరాడాలనుకుంటే శాసనసభలో మాట్లాడాలి. ముందే నిరసనల పేరుతో నినాదాలు చేసుకుంటూ వెళితే అది దేనికి సంకేతమో హరీష్ రావుకు తెలియంది కాదు. సమస్యల మీద చర్చించే ఉద్దేశం ఉంటే అల్లరి చేసే ప్రయత్నం చేయరు. ఏదో ఒకటి మాట్లాడి సవాళ్లు విసిరితేనే ఇటువంటి పరిస్థితి వస్తుంది.

ఈ విషయంలో 2019 నుండి 2024 మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర ప్రశంసనీయం. ఆయన రాజకీయ జీవితంలో అది అత్యంత గడ్డుకాలం. ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కొత్త కాదు. కానీ ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో నడిచింది శాసనసభ అనలేము; అది కౌరవ సభ. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులు వ్యవహరించిన తీరు చరిత్ర మరచిపోయేది కాదు. ఇప్పుడు కేసీఆర్ మాదిరిగా ఆనాడు చంద్రబాబు సభను విడిచిపెట్టి వ్యవహరించలేదు.

ప్రజలు అటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో కానీ, టీడీపీకి ఆరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు అవమానకరమైనదే. కానీ ప్రజా తీర్పును శిరోధార్యంగా భావించి, అవమానాలను ఎదుర్కొంటూ కూడా ఆయన తన పదవికి న్యాయం చేకూర్చారు. ఆరోజు చంద్రబాబు కంటే ఈరోజు కేసీఆర్ కు ప్రజలు మంచి తీర్పే ఇచ్చారు. ప్రతిపక్షంగా వారు బలంగానే ఉన్నారు.

కానీ కేసీఆర్ ఎందుకు శాసనసభకు వెళ్లడం లేదో అర్థం కాదు. అన్ని వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంతమాత్రం ఎందుకు ఆలోచించరు? ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వెళ్లాలి అనుకుంటే, రాజీనామా చేసి ప్రతిపక్ష నాయకుడి హోదాను ఎవరికైనా అప్పగిస్తే గౌరవంగా ఉంటుంది. శాసనసభకు వస్తే రేవంత్ రెడ్డి అవమానం చేస్తాడనే అనుమానంతో రాకపోవటం ఆయన భయాన్ని సూచిస్తుంది. లేదు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక రాకపోతే అది ఆయన అసూయకు చిహ్నం అవుతుంది.

ఇవన్నీ కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన స్థాయి మనిషి కాదు అనుకుంటే అది ఆయన అహంకారాన్ని సూచిస్తుంది. రేవంత్ రెడ్డి స్థాయి ఎంతో ప్రజలే నిర్ణయించే పరిస్థితి కల్పించిందే కేసీఆర్. ఇప్పుడు వగచి ప్రయోజనం ఏముంది? రాజకీయాన్ని ఇంత వ్యక్తిగతం చేసిందే కేసీఆర్. అదే బాటలో నడిచిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైందో చూస్తూ కూడా కేటీఆర్ అలాగే వ్యవహరిస్తున్నారు.

కూనంనేని అన్నట్లు, శాసనసభలో పిండాలు పెట్టడం, శ్రాద్ధాలు చేయటం లాంటి మాటలు మాట్లాడతారా?
ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత పదవి కాదు; అది ఒక రాజ్యాంగ వ్యవస్థ. దేశవిదేశాల్లో చదువుకున్న వారు మాట్లాడవలసిన మాటలేనా అవి? వైసీపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉన్నవారు చేసే తప్పులను ఎండగడతారా లేక వ్యక్తులనే తూర్పారబడతారా అనేది వారికే అర్థం కావటం లేదు. ప్రతిపక్షంగా శాసనసభలో ఒక విషయం ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం చెప్పే సమాధానం వినాలి.

కానీ సమస్యను లేవనెత్తి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయానికి పోడియం ముందుకు వచ్చి నిరసన తెలపడం, లేదా అందరూ కలిసి మూకుమ్మడిగా అరుస్తూ గోల చేయటం అంటే వారు ప్రస్తావించిన అంశం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వారికే లేకపోవడమే; లేదా ఏదో ఊసుపోక ప్రశ్న అడిగినట్లుగా ఉంటుంది. ఇటువంటి వాటితో సభా సమయాన్ని వృథా చేయటం అంటే ప్రజల ఆశలను భంగపరచడమే అని తెలిసీ అన్ని రాజకీయ పార్టీలూ చేస్తున్నాయి.

సీపీఐ నుండి శాసనసభలో ఒక్కరే ఉన్నారు కాబట్టి వారికి కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. ప్రతిపక్షం ఎలాగూ ప్రజా సమస్యల పైన మాట్లాడటం లేదు కాబట్టి, తనకు మరికొంత సమయం ఇస్తే మరికొన్ని సమస్యల మీద మాట్లాడతానని కూనంనేని చేసిన విజ్ఞప్తికి స్పీకర్ హుందాగా స్పందించటం ప్రశంసనీయం. కొద్దిగా అటూఇటుగా అన్ని పార్టీలూ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలు సరైన పంథాను పాటించనందువలన శాసనసభా కాలం కరిగిపోతూ ఉంటుంది. కాలంతో పాటు ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతూ ఉంటుంది. ఇది పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదు. కానీ ప్రత్యామ్నాయం లేని చోట ప్రజలు కూడా నిస్సహాయులే.

సాధారణంగా ప్రజల ఆశలను తీర్చటంలో ప్రభుత్వాలు విఫలమవుతుంటాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించటంలో ప్రతిపక్షాలే విఫలమవుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా కేసీఆర్ శాసనసభకు రారు. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే భయం లేని జగన్మోహన్ రెడ్డి, తాను రాకపోవడమే కాక, తన పార్టీ శాసనసభ్యులను కూడా రానివ్వటం లేదు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి యలహంక రాజప్రాసాదంలో ఉంటారు. ప్రజా సమస్యలు పట్టని వీరిద్దరికీ అధికారమే కావాలి. ఇది నిజంగా ప్రజల దౌర్భాగ్యం. ప్రజలు తమ తరఫున ప్రజా సమస్యలపై గళమెత్తడానికి మరో నలుగురు కూనంనేని లాంటి నాయకులను ఎన్నుకుంటే బాగుంటుంది.!

Total Visitors: 2,610,023