September 15, 2026

‘చిరు’కానుక సకుటుంబ సపరివాత సమేతంగా..

  • కొణిదెల కుటుంబానికి పదవుల పట్టం
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో రాచమర్యాదలు
  • ఇప్పటికే చిరంజీవి భార్య సురేఖకు యాదగిరిగుట్టలో పదవి
  • కోడలు ఉపాసనకు బ్రాండ్ అంబాసిడర్ హోదా
  • జాతీయ స్థాయిలోనూ మరో పదవి
  • దానిపై తెలంగాణవాదుల విమర్శల వర్షం
  • ఏపీలో పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ
  • మళ్లీ అదనంగా నాలుగున్నర లక్షల జీతంతో మరో చైర్మన్ పదవి
  • కొత్తగా చిరంజీవి కుమార్తె సుస్మితకు బెజవాడ కన కదుర్గ గుడి ప్రత్యేక ఆహ్వానితురాలి పదవి
  • ఆమె ఈఓ, ట్రస్టు బోర్డుకూ సలహా ఇవ్వవచ్చట
  • ప్రధాన ఉత్సవాల్లో అధికారులకు పరిపాలనలో సాయం చేయవచ్చట
  • ‘ఫ్యామిలీ ప్యాకేజీ’పై సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

మెగాస్టార్, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన హవా విజయవంతంగా నడుస్తోంది. కొణిదెల కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలూ పదవుల పీట వేస్తున్నాయి. ఈ రకంగా కొణిదెల కుటుంబ ప్రభ, సకుటుంబ సపరివార సమేతంగా దివ్యంగా వెలిగిపోతోంది.

కొత్తగా కొణిదెల కుటుంబానికి బె జవాడ కనకదుర్గ ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలి పదవి దక్కడంతో.. ఇక ఆ కుటుంబానికి చెందిన చిరంజీవి తనయుడు, రాంచరణ్ తేజ ఒక్కరే మిగిలినట్టయింది. ఎందుకంటే చిరంజీవి కోడలు-రాంచరణ్ భార్య ఉపాసన, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అదృష్టలక్ష్మి నీడలా ఉన్నట్లుంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ, మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఆయన సోదరుడయిన జనసేన దళ పతి పవన్ కల్యాణ్ ఇమేజ్-సినీ గ్లామర్, కాపు కులం కలసి వెరసి కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కారణమయింది. పవన్ కలసి రావడంతో, ఏపీలో కూటమి సూపర్ డూపర్ హిట్టయింది. కాబట్టి పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడంలో న్యాయం ఉంది. ఆయన పడ్డ కష్టానికి ఆ పదవి ఇవ్వడం సముచితం, సబబే. అందులో పవన్ విషయంలో ఎవరికీ ఆక్షేపణ ఉండటానికి వీల్లేదు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు, ఏడాదిన్నర తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జనసేనలో ఆయన కూడా తనదైన పాత్ర పోషించినందుకే ఆ పదవి దక్కిందనుకోవచ్చు. అయితే ఒకవైపు ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు, మళ్లీ అదనంగా గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి కూడా జమిలిగా ఇవ్వడమే ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ అసలు ఆ పదవి అంటూ ఒకటి ఉన్నట్లు చాలామందికి తెలియదు.

దానితోపాటు ఆయనకు క్యామినెట్ హోదాతోపాటు నెలకు నాలుగున్నర లక్షల జీతం ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. నిజానికి కూటమిలోని టీడీపీ, బీజేపీకి చెందిన నామినేటెడ్ చైర్మన్లకు ఇప్పటివరకూ క్యాబినెట్ హోదా లేదు. వారంతా పార్టీకి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నవారే. అయినా వారిని కాదని కొత్తగా చైర్మన్ పదవి ఇచ్చిన నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను.. విజయవాడ కనకదుర్గ గుడి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ జారీ అయిన మెమో చర్చ, దానితో పాటు విమర్శలకూ దారితీసింది. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ సోషల్‌మీడియా జీవులు చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే చర్చనీయాంశంగా మారాయి.

‘‘ ఏపీకి ఏమాత్రం సంబంధం లేని సుస్మితకు దుర్గ గుడి ప్రత్యేక ఆహ్వానితురాలిగా పదవి ఇవ్వడం ఏమిటి? అందుకు ఆమెకు ఉన్న అర్హతేమిటి? చిరంజీవి కూతురు, పవన్ బాబాయ్ కావడమే ఆమెకు ఉన్న అర్హతనా? అయినా పెద్ద పండగల్లో ఈఓ, ట్రస్టు కమిటీ ఆమె సలహా తీసుకోవడం ఏమిటి? పాలనలో ఆమె సాయం తీసుకోవడం ఎక్కడి చోద్యం? అసలు సుస్మితకు-బెజవాడ కనకదుర్గ గుడికీ సంబంధం ఏమిటి? ఈఓ, ట్రస్టు బోర్డుకు సలహా ఇచ్చేంత స్థాయి-అనుభవం-వయసు ఆమెకు ఉందా? పోనీ ఆవిధంగా ఆమె గతంలో ఏదైనా పెద్ద దేవాలయాలకు సలహాదారుగా పనిచేశారా? అయినా కేవలం ఆమె ఒక్కరికోసమే మెమో ఇవ్వడమేమిటి? గతంలో ఈవిధంగా అలా ఎవరికయినా ఇచ్చారా? కేవలం పవన్ కల్యాణ్‌ను చూసే కదా ఆమెకు ఆ పదవి ఇచ్చింది? ఆయన డిప్యూటీ సీఎంగా లేకపోతే ఆమెకు ఆ పదవి ఇచ్చేవారా? అసలు అలాంటి పదవులు వయసు మళ్లిన ఆధ్మాత్మకవేత్తలకు కదా ఇవ్వాల్సింది? ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీకి ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వాలు పదవులిచ్చి పెద్దపీట వేశాయి. పాపం చిరంజీవి ఫ్యామిలీలో రాంచరణ్ ఒక్కరే మిగిలారు. ఆయనేం పాపం చేశారని ఖాళీగా ఉంచారు? చరణ్‌బాబును కూడా ఏ టీటీడీకో, ఏ ద్వారకాతిరుమలకో, ఏ అన్నవరం దేవాలయానికో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తే సరిపోతుంది కదా? అవి కుదరకపోతే ఎలాగూ పర్యావరణ శాఖ పవన్ అధీనంలోనే ఉంది కాబట్టి, ఆ శాఖలోనే బాబాయ్ మాదిరిగా అబ్బాయికీ ఒక చైర్మన్ పదవి సృష్టించి ఇస్తే సరిపోతుంది’’ అంటూ సోషల్‌మీడియా సైనికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇప్పటివరకూ ఒక పెద్ద ఆలయానికి మధ్యలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరినీ నియమించకపోవడమే ఈ విమర్శలకు కారణంగా కనిపిస్తోంది.

నిజానికి చిరంజీవి కుమార్తె సుస్మిత, తన తండ్రికి కాస్ట్యూమర్‌గా వ్యవహరిస్తారని మాత్రమే అందరికీ తెలుసు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, సైసైరా నరసింహారెడ్డి, ఆచార్య, రంగస్థలం, ఖైదీనంబర్ 150 సినిమాలకు కస్ట్యూమర్‌గా.. మనశంకర వరప్రసాద్‌గారు, సేనాపతి, షూట్ ఎట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించారు.

అందుకే ఆమెకు దుర్గ గుడి ప్రత్యేక ఆహ్వానితురాలి పదవి దక్కడంతో, చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పైగా సుస్మిత ఎప్పుడూ బయటకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. చిరంజీవి పిల్లలు చెన్నైలో పుట్టిన విషయం తెలిసిందే. దానితో ఏపీకి ఏమాత్రం సంబంధం లేని ఆమెను, దుర్గ గుడి వంటి ప్రతిష్టాత్మక దేవాలయానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించడం సహజంగానే చర్చకు- విమర్శలకు దారితీసింది.

ఇప్పటికే చిరంజీవి భార్య సురేఖను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ సభ్యురాలిగా నియమించింది. ఆ సందర్భంలో.. మాకు తెలియకుండానే కమిటీని ఏర్పాటుచేయడం ఏమిటి? నల్లగొండ జిల్లాకు చె ందిన వారెవరికీ పదవులివ్వకుండా, ఆంధ్రా వారికి ఎలా స్థానం కల్పిస్తారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.

దానితో రంగంలోకి దిగిన తెలంగాణవాదులు యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆంధ్రా వారికి, ఫార్మా కంపెనీ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి తెలంగాణవారిని అవమానిస్తున్నారంటూ చేసిన విమర్శలు, కొద్దిరోజులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

అంతకుముందే.. తెలంగాణ ప్రభుత్వం, చిరంజీవి కోడలు-రాంచరణ్ భార్య అయిన ఉపాసనను తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డ్ ఆఫ్ గవర్నరెన్సుకు ఉపాసనను కో చైర్మన్‌గా నియమించింది. ఇక జాతీయ స్ధాయిలో ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల రక్షణ కోసం పాటుపడే, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

సహజంగా నామినేటెడ్ పదవులనేవి రాజకీయ పార్టీల కోసం నిర్విరామంగా పనిచేసి, ఆస్తులు పోగొట్టుకుని, రాజకీయ ప్రత్యర్థుల చేతులో కేసులు, హత్యలకు గురయి కుటుంబాలను కోల్పోయి.. నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రత్యర్ధులతో పోరాటం చేసిన వారికి దక్కుతుంటాయి.

పార్టీలో తెరవెనక కష్టపడి పనిచేసిన వివిధ వర్గాలకూ నామినేటెడ్ పదవులు దక్కుతుంటాయి. కానీ ఎలాంటి పోరాటాలు చేయకుండా.. కేవలం ‘మెగా బ్రాండ్’తోనే కొణిదెల కుటుంబానికి ఇన్నేసి పదవులు దక్కడం గొప్పేనని, సోషల్‌మీడియా సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Total Visitors: 2,611,375