గుంటూరు, విశాఖ, తిరుపతి, రాజమండ్రిపై కమలం గురి

- రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యంపై పట్టు
- ఇప్పటివరకూ గుంటూరు జిల్లాలో పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవ డమే దానికి కారణం
- గుంటూరు మేయర్ అడగాలని ఢిల్లీ సూచన?
- విశాఖ మేయర్‌ను ప్రతిష్ఠగా భావిస్తున్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్
- నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు కోరేందుకు సిద్ధమవుతున్న మల దళం
- ఎమ్మెల్యేలున్న పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్లు కూడా..
- కమలం కోరిక నెరవేరుతుందా?
- ఇచ్చింది తీసుకోవడమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా రాజధాని జిల్లా అయిన అమరావతి నుంచి ప్రాతినిధ్యం కోరాలని ఢిల్లీ నుంచి కూడా గట్టి సంకేతాలు వచ్చినట్లు సమాచారం.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు తొలి దశలో జరిగే ఎన్నికల్లో తమ వాటా కోరేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
ప్రధానంగా.. రాజధాని జిల్లా అయిన అమరావతి నుంచి ఇప్పటివరకూ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. విజయవాడ నుంచి పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ రాజధాని నగరమైన గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న పట్టుదలతో ఉంది.
అమృత్ పథకం ద్వారా అమరావతికి వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నామని, రాజధాని పనుల్లో 80 శాతం వాటా కేంద్రం ఇస్తున్నదే కాబట్టి, గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
పైగా గుంటూరు నగరంలో బ్రాహ్మణ-వైశ్య వంటి బీజేపీ సానుకూల వర్గాల జనాభా ఎక్కువగా ఉన్నందున, అక్కడ కార్పొరేషన్ గెలవడం సులభమవుతుందన్నది బీజేపీ అంచనాగా కనిపిస్తోంది. సీట్ల పంపకాల సమయంలో రాష్ట్ర నాయకత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని, గుంటూరు స్థానం కోరాలని ఢిల్లీ నాయకత్వం సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ ప్రకారంగా చూస్తే గుంటూరు కార్పొరేషన్, గుంటూరు జడ్పీ స్థానాల్లో బీజేపీ ఒకదాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సంస్థాగతంగా అయితే తమకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇప్పటికే కార్పొరేటర్లు ఉన్న టీడీపీ గుంటూరు కార్పొరేషన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా ఉండదు. ఇక జడ్పీ చైర్మన్ ఒక్కటే మిగిలింది. మరి అది కూడా బీజేపీకి ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.
రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ బీజేపీకి కేటాయించాలని అడుగుతున్నట్లు సమాచారం. విశాఖలో ఈపాటికే బీజేపీకి ఒక ఎమ్మెల్యే, కొంతభాగం ఒక ఎంపి ఉన్నందున విశాఖ మేయర్ తమ పార్టీకి కేటాయించాలని, మాధవ్ కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక విశాఖ అనాది నుంచి బీజేపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతమని, దశాబ్దాల క్రితమే బీజేపీ నాయకుడు కార్పొరేషన్ మేయర్‌గా, చలపతిరావు, ఆయన తనయుడు మాధవ్ ఎమ్మెల్సీలుగా పనిచేశారని గుర్తు చేస్తున్నారు. సంఘ్ పరివార్ కూడా విశాఖలో బలంగా ఉందంటున్నారు.
ఎంపి పురంధీశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రిని, తమకు కేటాయించాలని కోరేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఎంపి పురంధీశ్వరి అంత పట్టుదలగా లేకపోయినా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమండ్రి మేయర్ తీసుకోవడాన్ని ప్రతిష్ఠగా భావిస్తున్నట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్నందున, రాజమండ్రి మేయర్ అడగాలని భావిస్తోంది. ‘టెంపుల్ టౌన్’గా ఉన్న తిరుపతి కార్పొరేషన్‌పై కూడా బీజేపీ కన్నేసింది. ఆధ్మాత్మిక నగరంగా పేరున్న తిరుపతిని అడగాలని కూడా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బలంగా ఉన్న మున్సిపాలిటీలు అడగాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలి, తెనాలి, కర్నూలు, ధర్మవరంతోపాటు… ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాల్లో మున్సిపాలిటీలు తప్పనిసరిగా తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి కసరత్తు మొదలయిందంటున్నారు.
అయితే బీజేపీ నాయకత్వం, నాయకుల కోరిక ఎలా ఉన్నా.. అవి ఎంతవరకూ నెరవేరతాయో చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీని డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి లేదని, ఎన్ని సీట్లు ఇస్తే అన్ని పోటీ చేయడం తప్ప, మరో మార్గం లేదని రాష్ట్ర స్థాయి నాయకులు విశ్లేషిస్తున్నారు.
ఈ విషయంలో తమ పార్టీ.. జనసేనతో పోల్చుకునే అవకాశం లేదని, ఆ పార్టీకి-తమకు బలం విషయంలో తేడా ఉందని అంగీకరిస్తున్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే మున్సిపాలిటీల్లో మాకు 10 శాతం ఇస్తే అదే పదివేలు. అంతకుమించి ఇస్తారని మేం అనుకోం. అంతకంటే తక్కువ ఇచ్చినా చేసేదేమీ లేదు. ప్రస్తుతం టీడీపీపై ఒత్తిడి చేసే రాజకీయ పరిస్థితి లేదు. మా నాయకత్వం కూడా అంత ధైర్యం చేసే అవకాశం లేద’’ని పార్టీ వర్గాలు అసలు విషయం వెల్లడించాయి.
అయితే గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ఏ ఎన్నికలొచ్చినా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు వెను ంజ వేస్తే, తాము-జనసేన మాత్రమే జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో పోటీ చేసిన విషయం మర్చిపోవద్దంటున్నారు. ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా పనిచేసే కార్యకర్తలకు అవకాశం కల్పించాలంటున్నారు.
‘ఇవి పార్టీ జెండా మోసే కార్యకర్తలు మాత్రమే పోటీ చేసే ఎన్నికలు. మరి ఇప్పుడు కూడా వారికి అవకాశం కల్పించకపోతే, రేపు వారితో మా నాయకత్వం ఎలా పనిచేయించుకుంటుంది? కనీసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో అయినా అవకాశం ఇవ్వాలి కదా? ఆ మేరకు కూటమిని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడే తీసుకోవాల’ని ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.
