September 15, 2026

రాజ్యాధికారమా? ఆత్మగౌరవమా?

  • వెనుకబాటుతనం వెనుక అసలు నిజాలు!

(ఇంద్రాణి)

కులవివక్ష అనేది భారతదేశంలో రూపుమాసిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా సమాజంలో మార్పు రానంత కాలం అది సాధ్యం కాదు, ముఖ్యంగా దళితుల విషయంలో. గతంలో ఉన్నంత కులం పట్టింపు ఇప్పుడు లేదు కానీ, అన్ని కులాల మధ్య మానవ సంబంధాలు వెల్లివిరియటం లేదు అనేది వాస్తవం.

కులం పట్టింపు లేదు అని అందరం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా మన దగ్గర కూడా వివక్ష ఉంటుంది. అది కులవివక్షా లేక వర్గ వివక్షా అనేది నిర్ణయించటం కష్టం. స్వాతంత్ర్యం వచ్చి ఎనభై సంవత్సరాలు గడచినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయినా వెనుకబడిన వర్గాలు అనే పదం లేని సమాజాన్ని చూడలేకపోతున్నాము. రాజ్యాంగ ముసాయిదా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వెనుకబడిన వర్గాల వెనుకబాటుతనం పోవాలంటే పది సంవత్సరాలు రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో నిర్దేశించారు.

అప్పటినుండి ఇప్పటికీ వెనుకబాటుతనం పోలేదు; రిజర్వేషన్లు అమలు అవుతూనే ఉన్నాయి. అవి అమలయ్యే తీరు ఇలాగే కొనసాగితే మరో ఎనభై సంవత్సరాలు గడచినా వెనుకబాటుతనం పోదు. స్వాతంత్ర్యం వచ్చిన రోజు జనాభాలో ఎంత శాతం ఎస్సీ, బీసీలు ఉన్నారో ఇప్పటికీ అదే శాతం కొనసాగుతుంది . అంతమంది ఉండటం ఆశ్చర్యం కాదు, అదే నిష్పత్తిలో వెనుకబడి ఉండటమే ఆశ్చర్యం. ఇప్పటికీ వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రాజకీయ పదవులు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్లుగానే భావించవలసి వస్తుంది. ఎస్సీ ఓటు బ్యాంకుకు ఒక తరహా రాజకీయం, బీసీ ఓటు బ్యాంకు కోసం మరో రకం రాజకీయం.

ఇక ఒక మహిళను రాష్ట్రపతిని చేస్తే ఈ విశ్వంలో ఉన్న మహిళా లోకాన్ని మొత్తాన్ని ఉద్ధరించినట్లు ఒక పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేస్తే మొత్తం ఎస్సీలను అందలాలు ఎక్కించినంత అట్టహాసంగా చెప్పుకుంటుంది మరో పార్టీ. ఎస్టీని రాష్ట్రపతిని చేస్తే ప్రపంచంలో విస్తుపోయే అంశాలలో అదొకటి. ఇటువంటి పదవులు ఆయా వర్గాలకు వస్తే, అవి వారికిచ్చిన బహుమతిగా ఎందుకు ప్రచార పటాటోపానికి వినియోగించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు?

రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా, స్వాతంత్ర్యానికి ముందే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం తొలి కేబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా చేసిన బి.ఆర్. అంబేడ్కర్ ఒక వర్గానికే నాయకుడిగా చెలామణి అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోకపోతే, రాబోయే తరాలకు ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మరుగున పడే ప్రమాదం ఉన్నది.

రిజర్వేషన్లు ఎంతకాలం అమలు చేస్తే వెనుకబడిన వర్గం అనే పదం మన రాజ్యాంగం నుండి తీసివేయబడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. వెనుకబాటుతనాన్ని కుల ప్రాతిపదికన కాక మత ప్రాతిపదికగా చేయటం పైన ఆక్రోశంతో ఉన్నాయి కొన్ని వర్గాలు. వెనుకబడిన వర్గాల చేతికి రాజ్యాధికారం వస్తేనే వెనుకబాటుతనం పోతుంది అని కొందరంటారు. అందులో వాస్తవం ఎంత ఉన్నదో అర్థం కాదు. కారణం, ఇప్పటివరకు భారత ప్రధాన మంత్రులుగా సుదీర్ఘకాలం పరిపాలించిన బ్రాహ్మణుల వలన ఆ వర్గానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.

గతంలో మంత్రాంగం అంటే వారే చేయగలరు అని అనేవారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల మంత్రివర్గంలో వారికి ప్రాతినిధ్యం కూడా లేదు. దేవేగౌడను పక్కన పెడితే ప్రస్తుత ప్రధాని బీసీ వర్గానికి చెందినవారు. ఎన్నికల ద్వారా ప్రధాని అయి సుదీర్ఘకాలం పరిపాలించి రికార్డు కూడా సృష్టించారు. ప్రస్తుతం దేశంలో తిరుగులేని నాయకుడు అనేది ఒప్పుకుని తీరాలి.
అంటే బీసీ సామాజికవర్గం చేతికి తిరుగులేని అధికారం వచ్చింది అనేది వాస్తవం. విచిత్రంగా బీసీ వర్గాలు తమ వర్గానికి రాజ్యాధికారం వచ్చిందని సంబరాలు కూడా చేసుకోవడం లేదు; ఇంకా పాత నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. అంటే రాజ్యాధికారం అంటే ప్రధానమంత్రి లాంటి పదవులు కాదని అనుకోక తప్పదు.

ఇంకా ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీల నుండి ప్రధానమంత్రిగా ఎవరూ రాలేదు కానీ, రాష్ట్రపతి పదవిని మాత్రం అధిరోహించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవి అత్యున్నతమైనది. కేంద్రం అడుగు ముందుకు వేయాలంటే రాష్ట్రపతి ఆమోదముద్ర పడాలి. అంతటి శక్తివంతమైన పదవిని ఎస్సీ, ఎస్టీ వర్గం వారు పొందినందువలన వారికి ఒరిగినదీ ఏమీ లేదు. మన భారతీయ సమాజంలో వర్ణపోరు పోయి కులపోరులోకి వచ్చాము. కమ్యూనిస్టులు చెప్పే వర్గపోరును ఒప్పుకోరు కానీ, సమాజంలో వర్గపోరు బలంగా నాటుకుపోయింది.

కమ్యూనిస్టులు చెప్పే ధనవంతులు-బీదవారు, పెట్టుబడిదారులు-శ్రామికవర్గం, పాలకులు-పీడితులు లాంటి వర్గాల కంటే బలమైన వర్గ విభజన జరిగిపోయింది: రాజకీయంగా పలుకుబడి కలిగినవారు, అటువంటి పలుకుబడి లేనివారు. ఇక్కడ పీడన ఉండదు; కనిపించని దోపిడీ ఉంటుంది. కులాలను అడ్డుపెట్టుకుని ఎదుగుతారు; ఎదిగిన తరువాత మరొకరు ఎదగకుండా చూసుకుంటారు. వారి మనుగడకు కష్టం రాకుండా చూసుకోవాలని ఎవరికైనా ఉంటుంది.

రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఒక తరం చదువుకుని ఉద్యోగం చేసుకునేవారు వెనుకబడిన వర్గం కాదు అంటే—ఆర్థికంగా వెనుకబాటుతనం పోయినా, సాంస్కృతిక పరంగా వెనుకబడి ఉండటం వలన వెనుకబడిన తరగతి క్రింద ఉన్నట్లుగానే పరిగణించాలి. ఇక రాజకీయంగా వెనుకబడిన తరగతి నుండి ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచినా, ఎంత పెద్ద పదవులు చేపట్టినా కుల ఆధారిత రిజర్వేషన్ అలాగే ఉంటుంది.

వేరే వారికి అవకాశం రావడానికి ఎంత కాలం పడుతుంది అనేది ఊహించటం కూడా కష్టం. విద్యా, ఉపాధి రంగాలలో రిజర్వేషన్ అందరికీ ఒకే రకంగా వర్తించినా, ముందే వాటిని సాధించిన వారితో అప్పటివరకు పూర్తిగా వెనుకబడి ఉన్నవారు పోటీ పడటం కష్టం. మరో బాధాకరమైన అంశం ఏమిటంటే, ఆయా వర్గాల నుండి పైకి వచ్చిన వారిలో చాలామంది పూర్తిగా వెనుకబడిన వారితో నెరిపే సంబంధాలలో కూడా అంతరం కనిపిస్తున్నది.

అంతర్గత వ్యవహారాలు ఇలా ఉంటే సమాజ దృక్పథం వేరే విధంగా ఉంటున్నది. వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీలకు వేరే వర్గాలకు మధ్య అంతరాలు పెరిగిపోయాయి. వారి ఆత్మగౌరవం కోసం చేసిన చట్టాలు దుర్వినియోగం అవటం వలన కూడా వివిధ వర్గాలతో వారి సంబంధాలు దెబ్బతిన్నాయి. రిజర్వేషన్లతో చదువుకున్నా ఉద్యోగం దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీలు వివక్షను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు సక్రమంగానే అమలు అవుతున్నాయి కానీ, ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్లను అనుసరించడానికి ఆమోదించడం లేదు. వారిని ప్రభుత్వాలు ఒత్తిడి చేయటం కష్టం; ఒత్తిడి చేస్తే అసలు పెట్టుబడి కూడా పెట్టరు అని ప్రభుత్వాల భయం. అందుకని చదువుకుని కూడా కాయకష్టం చేయవలసిన పరిస్థితిలో ఉంటున్నారు దళిత వర్గాలు. రోజురోజుకూ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవటం కూడా వారి అభివృద్ధికి అవరోధంగా మారుతున్నది.

ఇటువంటి పరిస్థితుల్లో అణగారిన వర్గాలు అనే పదం తొలగించే అవకాశం ఎప్పుడు వస్తుందో మరి! ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా, ఎన్ని ఉచితాలు ఇచ్చినా అవి తాత్కాలిక ఉపశమనం అవుతాయి కానీ, ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించినట్లు కాదు. రిజర్వేషన్లు ఇచ్చినా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే వెనుకబడిన వర్గాల వారి పిల్లలు కూడా అందరితోనూ పోటీ పడే అవకాశం ఉంటుంది.

అయితే పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఒక్కటే సరిపోదు; మెరుగుపడిన ప్రమాణాల స్థాయిని అందుకునే పరిస్థితులను వారికి కల్పించాలి. అంటే ఇంటి వాతావరణం కూడా వారు చదువుకోవడానికి అనువుగా ఉండాలి. గతంలో ఉన్నంత పేదరికం ఇప్పుడు వెనుకబడిన వర్గాల వారికి కూడా లేదు. ఇక్కడే సాంస్కృతిక పరమైన వెనుకబాటుతనం తన ప్రభావాన్ని చూపిస్తుంది.

అటువంటి పరిస్థితులు వారి పిల్లల చదువును ప్రభావితం చేయకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటే తప్ప, ఒక్క రిజర్వేషన్లతోనే వెనుకబాటుతనాన్ని జయించలేరు. సమాజంలో సగభాగం కంటే ఎక్కువ ఉన్న ఎస్సీ, బీసీల వెనుకబాటుతనాన్ని పారద్రోలి, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయనంత కాలం సమాజంలో ఉన్న అంతరాలు సమసిపోవు.!

Total Visitors: 2,611,365