September 16, 2026

మాతృభాష: మూలాలు మరవని ప్రయాణం!

(ఇంద్రాణి)

మొన్న తెలుగు భాషా దినోత్సవం రోజున ఆ వేడుకల్లో పాల్గొన్న, అమెరికాలో స్థిరపడిన ఒక కుటుంబాన్ని చూస్తే ముచ్చటగా అనిపించింది. వారి పిల్లలు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. ఆ పిల్లలకు పదిహేను సంవత్సరాలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడిన వారి పిల్లలు చాలామంది ఒక వయస్సు వచ్చేవరకు మాతృభాష మాట్లాడతారు; తరువాత వారు ఉపయోగించే భాషలో ఒకలాంటి యాస కలుస్తుంది, పదప్రయోగంలో తడబాటు ఉంటుంది. కానీ, ఆ పిల్లలు మన దగ్గరే పెరిగి మనం మాట్లాడుతున్నంత చక్కగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేకంగా నేర్పిస్తున్నారేమో అనిపించింది.

అదే ప్రశ్న ఎవరో అడిగితే ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. “నేర్పిస్తే అంతవరకే మాట్లాడతారు, కానీ ఇంట్లో మనం మాట్లాడితే వాళ్లకు అలవాటు అవుతుంది” అన్నారు. నిజమే, ‘అభ్యాసం కూసు విద్య’ అన్నట్లు రోజూ మాట్లాడటం అనే అభ్యాసం వారిని నిష్ణాతులను చేసింది. కానీ అది చాలా కష్టం. అక్కడ వారి స్నేహితులందరూ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతారు. ఆఖరుకు అక్కడ స్థిరపడిన మన పిల్లలే తెలుగు మర్చిపోయినట్లు మాట్లాడుతుంటారు. కారణం వారు పనిచేసే చోట స్థానిక భాషే మాట్లాడాలి కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, చదువుల్లో వెనుకబడకుండా ఉండటానికి అక్కడి భాషపై పట్టు సాధించాలి.

ఆ కుటుంబాన్ని వెంకయ్య నాయుడు గారు చూసి ఉంటే చాలా సంతోషపడేవారేమో. ఆయన ఎప్పుడూ “అమ్మ భాషను మరచిపోకూడదు” అంటారు. నిజమే! ఎన్ని భాషలు వచ్చినా మాతృభాష తరువాతే ఏదైనా. తన పొత్తిళ్లలోకి తీసుకునేటప్పుడు అమ్మ స్పర్శతో పాటు అమ్మ ఉపయోగించే పదం కూడా బిడ్డకు అర్థమైపోతుంది. అమ్మ నేర్పిన ఆ భాష జీవితకాలం మనతో ఉండిపోతుంది. ఏదో ఒక దశలో అమ్మను కోల్పోతాం, కానీ అమ్మ భాష మాత్రం మనలను వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లదు. బహుశా అమ్మ తాను వెళ్లినా, తన భాషను మనకు తోడుగా ఉంచుతుంది.

ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను చెప్పుకోవటానికి, ఒకరితో ఒకరు సంభాషించటానికి ఏ భాష అయితే ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పటం కష్టం. దానికి చెప్పగలిగే ఏకైక సమాధానం ఒక్కటే—బంధాలు అంటే తెలియని పసిపిల్లలకు కూడా అమ్మ స్పర్శ తగలగానే భద్రతగా ఎందుకు అనిపిస్తుందో, అమ్మ భాష కూడా అలాంటిదే. మనం ఒక పాట వినాలంటే సుమధుర కంఠం అయితేనే వింటాం. కానీ గొంతుతో సంబంధం లేకుండా మనం ఇష్టంగా వినేది చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట. దానికి సాహిత్యంతో సంబంధం లేదు, సంగీతంతో సంబంధం లేదు. మాతృభాష కూడా అంతే.

ఇంగ్లీష్ మాట్లాడే అమ్మలు వచ్చిన తరువాత పిల్లల మాతృభాష ఏదో నిర్ణయించటం కష్టమైపోయింది. గత ఇరవై సంవత్సరాలలో వచ్చిన మార్పు ఏమిటంటే, చాలామంది పిల్లలు తమకు తెలుగు చదవటం రాదు అని చెప్పటం. పట్టణాలలో పెరిగిన వారికి మాతృభాష తెలియకపోవటం నలభై, యాభై సంవత్సరాల క్రితమే మొదలయ్యింది. మాతృభాష రాకపోవటాన్ని తప్పొప్పుల విషయంగా పరిగణించలేము కానీ, ఎంత ఇంగ్లీష్ భాష వచ్చినా మన భాషలో జరిగే సంభాషణ ఆత్మీయతను పెంచుతుంది.

వేరే దేశమే కాదు, మన దేశంలోనే వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మన ఆహారంతో పాటు మన భాష వినిపించక వెలితిగా అనిపిస్తుంది. పరాయి దేశాలకు వెళ్లినప్పుడు పొరపాటున మన చుట్టుపక్కల ఎక్కడైనా మన మాతృభాష వినిపిస్తే, మనకు తెలియకుండానే ఆ మాట్లాడింది ఎవరా అని చుట్టూ చూస్తాం. వాళ్లు కనిపించగానే వారు మనకు ఎప్పటి నుంచో తెలిసినట్లుగా ఓ చిరునవ్వు నవ్వుతాం. ఆ భాషా బంధం మనల్ని ఆత్మీయులను చేస్తుంది.

ఈ మధ్య మన సినిమాలు దేశ విదేశాలలో ప్రదర్శించబడుతున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, గతంలో విదేశాలకు వెళ్లినా, చివరకు ఢిల్లీ వెళ్లినా తెలుగు సినిమా ఉన్న సినిమా హాలుకు వెళ్లి కూర్చునేవాళ్లం. అక్కడ తెలుగు మాట వినగానే బెంగ తీరిపోయినట్లు అనిపించేది. మన ఇంట్లో ముద్దపప్పు, ఆవకాయ కలుపుకుని తిన్నంత ఆనందం కలిగేది.

పరాయి గడ్డ మీద స్థిరపడి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా, ఎన్ని దశాబ్దాలు గడిచినా స్వదేశానికి రాగానే తెలియని ఉద్వేగానికి గురవుతారు; భాష కూడా అంతే.కానీ ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవలసిన పరిస్థితుల వలన మాతృభాష ఇబ్బందులను ఎదుర్కొంటున్నది అనేది వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇళ్లల్లో దైనందిన జీవితంలో మాతృభాషలో కాక ఆంగ్లంలో మాట్లాడుకోవటం ఎక్కువైంది. సంస్కృతీ సంప్రదాయాలను అట్టహాసంగా అనుసరిస్తున్నారు కానీ, అమ్మ భాష మాత్రం ఆదరణ కోల్పోతున్నది.

భాష విషయంలో చైనాను చూసి మనం ఎంతైనా నేర్చుకోవలసి ఉన్నది. చైనాలో ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ చదువు వరకు మాండరిన్ భాషలోనే సాగుతుంది. అయితే చైనాలో కూడా ప్రాంతీయ భాషలు ఉన్నాయి; కానీ విద్య, ఉద్యోగం, పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ ప్రభుత్వం అధికార భాషగా గుర్తించిన మాండరిన్ లోనే సాగుతాయి. అమెరికాలో చదివే చైనా విద్యార్థులు చదువును ఆంగ్లంలోనే సాగించినా, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే గ్రూప్ డిస్కషన్స్ అన్నీ మాండరిన్ భాషలోనే చేసుకుంటారు.

పరీక్షలు పరాయి భాషలో రాసినప్పటికీ, చదువు గురించి చర్చించుకునే సమాచారమంతటికీ మాండరిన్ భాషనే ఉపయోగిస్తారు. అదే రీతిలో వారు అమెరికాలో చదువుకుంటున్నప్పుడు కూడా చైనా యాప్‌లు, చైనా స్టడీ మెటీరియల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. అంటే చైనా విద్యార్థి అమెరికాలో చదువుకున్నా తమ ఆలోచనలను, చదువుకు సంబంధించిన పరస్పర సహకారాన్ని, అంతర్గత అవగాహనను తమ మాతృభాషలోనే కొనసాగిస్తారు. “ఆంగ్లం ఉంటేనే ప్రపంచంలో బతకగలం” అనే ఆలోచనకు దూరంగా ఉంటారు.

అందువలనే చైనా శాస్త్ర, సాంకేతిక రంగాలను, ఉన్నత విద్యను తమ అధికారిక భాష అయిన మాండరిన్ లోనే అభివృద్ధి చేసుకున్నది. ప్రపంచంలో ఏ మూల కొత్త ఆవిష్కరణ జరిగినా దాన్ని వెంటనే చైనీస్ భాషలోకి అనువదించి తమ ప్రజలకు అందజేస్తుంది. కొత్త సాంకేతికతకు తమ భాషలోనే ఒక కొత్త పదాన్ని సృష్టించుకుంటారు. అందుకే చైనాలో ఇంగ్లీష్ రాని విద్యార్థి కూడా అధునాతన సాంకేతికతను సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు.

మన దేశంలో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని నిర్ణయించారు కానీ, విద్యా ప్రైవేటీకరణ వలన మాతృభాషలో విద్యావిధానం అనేది మృగ్యమైపోయింది. పిల్లలు ఇంట్లో మాట్లాడేది ఒక భాష, పాఠశాలలో మరొక భాష కావడంతో వారి మానసిక వికాసం దెబ్బతింటోందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. మాతృభాష గురించే ఇంత వివాదం నడుస్తుంటే, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మరోవైపు జరుగుతున్నది.

కానీ మన భాషకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన కొల్లు రంజిత్ కుమార్ పిల్లలకు తెలుగు భాషను నెత్తిమీద రుద్దినట్లుగా కాకుండా, వారికి సరదాగా అనిపించే రీతిలో తెలుగు అక్షరాలను నేర్చుకునేలా ఒక యాప్‌ను రూపొందించారు. తన పిల్లలు తెలుగు భాష నేర్చుకోవటానికి ప్రత్యేకంగా క్లాసులకు వెళ్లటానికి విముఖత చూపినందుకు, పది సంవత్సరాలు కష్టపడి ఆ యాప్‌ను రూపొందించారు. వారి పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కాబట్టి యాప్ అవసరం లేదని అనుకోకుండా, ఎలాగైనా తెలుగు అక్షరమాలను పిల్లలు ఇష్టంగా నేర్చుకోవటానికి వారు, వారి బృందం పట్టుదలగా కృషి చేయటం నిజంగా అభినందనీయం.

మన భాష మంచి సాహిత్య విలువలు కలిగిన భాష. మనకు ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సాహిత్యాన్ని గ్రాంథికం నుండి వ్యావహారికంలోకి తీసుకురావడంలో కూడా మనవారు ఎంతో ముందుగా సాహసం చేశారు. వీటన్నిటికీ మించి మాతృభాష అనేది అమ్మ ఇచ్చిన తీపి జ్ఞాపకం. మనం ఒంటరిగా ఉండకూడదు అన్నట్లుగా తోబుట్టువులను ఇచ్చినట్లే, అమ్మ భాషను కూడా ఇస్తుంది. అమ్మ జ్ఞాపకాలను ఎంత పదిలంగా దాచుకుంటామో, అమ్మ భాషను కూడా అంతకంటే పదిలంగా కాపాడుకుందాం.!

Total Visitors: 2,656,169