విద్యార్థిని మందలించే పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేరు

- తప్పు ఎత్తి చూపించాలంటే భయం వేసే పరిస్థితులు
- ఉపాధ్యాయుల పట్ల మనం ‘అమెరికాకు తక్కువ, ఇండియాకు ఎక్కువ’ అన్నట్లు వ్యవహరిస్తున్నాం
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల వైఖరి మారిపోతే సమాజం నష్టపోతుంది - ‘తల్లి, తండ్రి, గురువు, దైవం’ అనే మన భారతీయ తత్వాన్ని కొనసాగించాలి
ఉపాధ్యాయ దినోత్సవం: నాటి విశిష్టత – నేటి వాస్తవికత
( ఇంద్రాణి)
ఉపాధ్యాయ దినోత్సవం… మన దేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన రాష్ట్రపతి అయినప్పుడు ఆయన విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఆయన పుట్టినరోజును పండుగలా చేయాలని కోరగా, తన పుట్టినరోజును టీచర్స్ డేగా జరిపితే బాగుంటుంది అనుకున్నారట. తద్వారా దేశంలోని ఉపాధ్యాయులను గౌరవించినట్లుగా ఉంటుంది అని అనగానే 1962 లో ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. విలువలు కలిగిన సమాజపు తీరు అది.\
రాధాకృష్ణన్ తెలుగు ప్రాంతం వారు కావడం మనం గర్వించదగ్గ విషయం. ఇంకా మనం గర్వించదగ్గ మరో విషయం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య ధర్మాలు, నీతిశాస్త్రం బోధించిన తొలి భారతీయుడు ఈయన. ఆయనలోని విద్వత్తును గమనించి తొలి ప్రధాని నెహ్రూ ఆయనను రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా చేశారు.
తర్వాత రష్యా రాయబారిగా, పది సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా, అనంతరం రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో ఎటువంటి పక్షపాతం చూపని ఆయన నైజం నెహ్రూని ఎంతగానో ఆకర్షించింది అంటారు. ఇద్దరు ప్రధానులతో పనిచేశారు, రెండు యుద్ధాలు చూశారు. రాజకీయాలకు, ఓటు బ్యాంకులకు అతీతంగా దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేశాయి కాబట్టే సర్వేపల్లి రాధాకృష్ణన్ ను 50 ల్లోనే భారతరత్న వరించడమే కాక దేశ అత్యున్నత పదవులు కూడా అలంకరించాయి. అటువంటి వారి పుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనల్ని మనం అభినందించుకోవలసిన విషయం.
ఈ సందర్భంగా ఒక వ్యక్తికి మనం సెల్యూట్ చేయాలి. ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు. దారుణమైన విషాదం అది. అంత విషాదంలోనూ 1600 పైచిలుకు విద్యార్థులను తన సమయస్ఫూర్తితో కాపాడారు ఒక గురువు. త్రిశూలి నది ఒడ్డున ఉన్న త్రిభువన్ త్రిశూలి సెకండరీ పాఠశాల సమీపంలో కొండచరియలు విరిగిపడి భారీ ఎత్తున వరదనీరు, బురద ఉధృతంగా వచ్చాయి. వరద ఉధృతంగా వస్తోందని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దవాడే స్కూల్ బెల్ కొట్టి, పిల్లలను తరగతి గదుల్లో నుండి బయటకు రప్పించి ఎత్తుగా ఉన్న ప్రాంతానికి తీసుకుని వెళ్లారు.
విద్యార్థులు ఎత్తుగా ఉన్న ప్రాంతానికి చేరుకున్న మూడు నిమిషాల్లోనే వరద ముంచెత్తి పాఠశాల ఆనవాళ్లు కూడా మిగలకుండా కొట్టుకుపోయింది. ఆ పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తే, వారి గురువు పునర్జన్మను ప్రసాదించారు. సంక్షోభాన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న రాజేంద్ర దవాడే నిజమైన హీరో అయ్యారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఆయనకు మనమందరం శుభాకాంక్షలు తెలపాలి.
భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తరువాత మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసేది గురువులే. తల్లిదండ్రులు మనకు నడక మాత్రమే నేర్పుతారు. గురువు మనకు విద్యాబోధన చేస్తూ మన నడవడికలో ఉండే పొరపాట్లను సరిదిద్దే గురుతరమైన బాధ్యతను తీసుకుంటారు. అంటే తల్లిదండ్రుల కంటే గురువు మీదే బాధ్యత ఎక్కువ. గురువుల్లో ఉద్యోగం మాత్రమే చేసేవారు కొందరైతే, వృత్తిగా స్వీకరించేవారు మరికొందరు. బడికి వచ్చామా, పాఠం చెప్పామా, ఇంటికి వెళ్ళిపోయామా అనేవారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే పిల్లలు చదువుకుంటారు కానీ విజ్ఞానవంతులు కాలేరు.
పూర్వకాలంలో ఎవరి అవసరం కోసం వారు వృత్తిపరమైన విద్యను అభ్యసించేవారు. అలాంటి పరిస్థితి మారిపోయి ఇప్పుడు మూస చదువులు వచ్చాయి. గతంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్, సంగీతం టీచర్ కూడా ఉండేవారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో డ్రిల్ మాస్టర్ కూడా ఉండటం లేదు. క్రాఫ్ట్ టీచర్ అంటే ఇప్పటి విద్యార్థులకు తెలిసి కూడా ఉండదు. నైపుణ్యాభివృద్ధి బాధ్యతను ఆనాడు క్రాఫ్ట్ టీచర్లు తీసుకునేవారు. మూస చదువులు వచ్చాక ఉపాధ్యాయ వృత్తి కేవలం ఒక ఉద్యోగం అయిపోయింది.
మన దేశంలో ఒకనాడు ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. అందుకే మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మీద ఉన్న గౌరవంతో ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిని కూడా రాజకీయం చేస్తున్నారు. సాధారణంగా ఆ వృత్తిలో ఉన్న వారిని ఏదైనా మాట అనడానికే సంకోచించేవారు. మన దేశంలో ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా అత్యున్నత సమాజ సేవగా భావించేవారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటాము.
కానీ వారిని మద్యం దుకాణాల వద్ద కూడా కూర్చోబెట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉపాధ్యాయులను వైసిపి ప్రభుత్వం ఉపయోగించుకున్నంతగా ఎవరూ ఉపయోగించలేదు. వారికి బోధన కంటే ఇతర పనుల బాధ్యతలను అప్పగించింది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూ ప్రకారం చేశారో లేదో చూసి ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయవలసి వచ్చేది. తనిఖీ చేయడం వేరు, ప్రతిరోజూ పాఠశాలల మౌలిక వసతుల పర్యవేక్షణ, ఇంకా అనేక పనులతో కలిపి నిత్యం పది యాప్‌లను ఆర్గనైజ్ చేయవలసి వచ్చేది.
పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడటం కూడా ఉపాధ్యాయులదే బాధ్యత అయింది. అన్నిటికంటే మించి కోవిడ్ లాక్‌డౌన్ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద జనాన్ని నియంత్రించే పనులు కూడా చేయవలసి వచ్చింది. ఇది తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. నవరత్నాల లబ్ధిదారుల సమాచారం సేకరించే పనిని కూడా ఉపాధ్యాయులకే అప్పజెప్పారు. ఇలాంటి పనులు ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు అప్పగిస్తాయని ఎవరూ ఊహించను కూడా ఊహించలేదు.
అప్పట్లో బోధన మీద ధ్యాసను కేంద్రీకరించలేకపోతున్నామని వారు వాపోయారు.
రానురాను ఉపాధ్యాయ వృత్తి ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది. గతంలో మాదిరిగా పాఠాలు చెప్పడం ఒక్కటే వారి బాధ్యత కాదు; ఫలితాలను చూపించడం అనేది ప్రధానమైన విధిగా మారింది. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను కూడా వారే చూడాలి. ప్రతిరోజూ సాయంత్రం గంట, రెండు గంటలు కాన్ఫరెన్స్ కాల్‌లో అడ్మిషన్ల గురించి రిపోర్టు ఇవ్వాలి, ఇంకా అడ్మిషన్లు ఎలా పెంచాలనే విషయంలో యాజమాన్యాల ఆదేశాలు వినాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య వృత్తికి న్యాయం చేయడం వారికి కష్టమవుతోంది.
వీటికి మించి నేడు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలు ఉండటం లేదు. ఉపాధ్యాయుల పట్ల మనం ‘అమెరికాకు తక్కువ, ఇండియాకు ఎక్కువ’ అన్నట్లు వ్యవహరిస్తున్నాం. విద్యార్థిని మందలించే పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేరు. తప్పు ఎత్తి చూపించాలంటే భయం వేసే పరిస్థితులు వచ్చేశాయి.
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల వైఖరి మారిపోతే సమాజం చాలా నష్టపోతుంది. ‘తల్లి, తండ్రి, గురువు, దైవం’ అనే మన భారతీయ తత్వాన్ని కొనసాగించాలి. తరగతి గదిలోనే విద్యావసరాలు తీరిపోవు. పుస్తకానికి ఆవల ఉన్న ప్రపంచంలోకి వెళ్లడానికి నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి. అలాంటి జీవిత పాఠాలను నేర్పే గురువును గౌరవించుకుందాం.!
