రేవంత్ నోట వినిపించని ‘సీఎం’

- మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న రేవంత్
- మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమేనని వ్యాఖ్య
- కానీ గతంలో మాదిరి ‘మళ్లీ నేనే సీఎం’ అనని రేవంత్‌రెడ్డి
- నకిరేకల్ సభ ప్రసంగంలో ఎక్కడా వినిపించని ‘సీఎం మాట’
- రేవంత్ దూకుడుకు ఢిల్లీ కళ్లెం వేసిందా?
- సురేఖ ఎపిసోడ్ తర్వాత మారిన సీఎం మాట తీరు
- కొండా ఫిర్యాదు తర్వాత ఢిల్లీ వైఖరిలో మార్పు వచ్చిందా?
- ఢిల్లీకి వెళ్లిన తర్వాత రేవంత్‌కు తత్వం బోధపడిందా?
- ఉత్తమ్ సమక్షంలో తానే సీఎం అవుతానని చెప్పేందుకు రేవంత్ మొహమాటపడ్డారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలో తాజా ఢిల్లీ పర్యటన తర్వాత అనూహ్య మార్పు వచ్చిందా?.. ఆమేరకు ఆయనలో మునుపటి దూకుడు తగ్గిందా? లేక.. ఢిల్లీనే ఆయన దూకుడుకు కళ్లెం వేసిందా?.. కొండా సురేఖ ఎపిసోడ్-ఆమె ఆరోపణలు- ఢిల్లీ పర్యటన తర్వాత, రేవంత్‌రెడ్డికి తత్వం బోధపడిందా?.. లేక ‘ఢిల్లీ’నే తత్వం బోధించిందా? తాజా నకిరేకల్ సభలో రేవంత్ ప్రసంగం పరిశీలించిన వారికి, ఇలాంటి అనుమానాలు రావడం సహజం.
నకిరేకల్ సభకు ముందు జరిగిన అనేక బహిరంగసభలు, మీడియా చిట్‌చాట్‌లలో.. నేనే మరో ఎనిమిదేళ్లు సీఎంగా ఉంటా. నాకు వయసుంది. ఓపిక ఉంది. ఆ తర్వాత నా స్థానంలో మరొకరిని నియమించి, నేను జాతీయ రాజకీయాల్లోకి వెళతా. వచ్చే ఎన్నికల్లో నేను, మహేష్‌గౌడ్ మళ్లీ కాంగ్రెను అధికారంలోకి తీసుకువస్తాం. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాంల్లో బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ప్రకారంగా సీఎం రేసులో.. ఇప్పటి సీనియర్ మంత్రులు ఎంతమంది ఉన్నప్పటికీ, మరో 8 సంవత్సరాలు నిర్నిరోధంగా తానే సీఎంగా కొనసాగుతానని రేవంత్‌రెడ్డి చెప్పకనే చె ప్పారన్నమాట. పాపం సీనియర్ మంత్రులు కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకుండా.. ‘మళ్లీ మీరే సీఎం. మేం ఆ పదవికి అనర్హులం’ అని మౌనంగా అంగీకరించారు. అది వేరే విషయం.
నిజానికి కాంగ్రెస్ రాజకీయాల్లో ఇలాంటి వన్‌వే ట్రాక్ నడిచిన దాఖలాలు ఇప్పటివరకూ చూసింది లేదు. గతంలో పార్టీని శాసించి-శ్వాసించిన మాస్ లీడర్, అన్నిటికీ మించి క్రైస్తవ కార్డు అదనంగా ఉన్న వైఎస్ లాంటి సోనియా విధేయుడు కూడా, ఇంత సాహసం చేసిన దాఖలాలు లేవు. వైఎస్ జీవించినంత వరకూ తానే మళ్లీ సీఎం అవుతానని ఎప్పుడూ ప్రకటించుకున్న దాఖలాలు లేవు. అంటే అప్పట్లో కాంగ్రెస్ అంత బలంగా ఉండేదన్నమాట.
అలాంటి బాహుబలి లాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మరో పదేళ్లు నేనే సీఎం’ అని ఒక నాయకుడు నిర్భయంగా ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే, కాంగ్రెస్ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతూనే ఉంది. బహుశా కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితి చూసి.. కాసు, వైఎస్, కోట్ల, జలగం, మర్రి చెన్నారెడ్డి ఆత్మలు కచ్చితంగా ఘోషిస్తుంటాయి. ఎందుకంటే..తమకు లేని-ఇవ్వని స్వేచ్ఛ, పార్టీలో కొత్తగా వచ్చిన రేవంత్ అనే కుర్రాడికి నాయకత్వం ఇచ్చినందుకు!
సరే దాన్నలా పక్కనపెడితే.. ఇప్పటికి డజను సార్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్‌రెడ్డి, తాజా నకిరేకల్ సభలో మాత్రం ఆ ప్రస్తావన తీసుకురాకుండా.. మరో పదేళ్లు కాంగ్రెస్ ఉంటుంది. ఇందిరమ్మరాజ్యమే ఉంటుందని చెప్పడంపై కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేచింది. మహేష్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చానని, చామల కిరణ్‌ను ఎంపీని చేశానని, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, సత్యంను ఎమ్మెల్సీని చేశానని చెప్పుకున్న సీఎం రేవంత్.. గతంలో మాదిరిగా ‘మళ్లీ నేనే సీఎంగా ఉంటా’నని మాత్రం చెప్పకపోవడం ప్రస్తావనార్హం.
దీనిపైనే కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, తన జిల్లాకే చెందిన చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నుంచి ఊడబెరికించిన రేవంత్‌రెడ్డి.. ‘మరో పదేళ్లు మళ్లీ నేనే సీఎం’ అని గతంలో ప్రదర్శించిన ధీమా, నకిరేకల్ సభలో ఎందుకు ప్రదర్శించలేదన్న చర్చ జరుగుతోంది.
బహుశా.. ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి కొండా సురేఖ, అధిష్ఠానం అనుమతి లేకుండా తానే మరో ఎనిమిదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఏవిధంగా ప్రకటించుకుంటారు? వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్‌రెడ్డిని గెలిపించాలని ఏ అధికారంతో కోరతారు? ఆయన కూడా నా లెక్క ఎమ్మెల్యేనే కదా? ఆయన కేవలం నామినేటెడ్ సీఎం కదా? పైగా నేను ఆరుసార్లు ఎమ్మెల్యే. మరి నాయకత్వ అధికారాలను తగ్గిస్తూ, సీఎం పదవిపై మాట్లాడుతున్న రేవంత్‌పై ఏం చర్యలు తీసుకుంటారని సురేఖక్క పంచాయితీ పెట్టిన విషయం తెలిసిందే. ఆమె అదే మాట.. ఖర్గేను కలసిన తర్వాత మీడియాకూ చెప్పారు.
ఈ నేపథ్యంలో బహుశా రేవంత్‌రెడ్డికి నాయకత్వం క్లాసు ఇచ్చినందుకే, ఆయన ‘మళ్లీ నేనే సీఎం’ అని నకిరేకల్ సభలో ప్రకటించే సాహసం చేసి ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘‘సీఎం గారికి ఢిల్లీ పర్యటన తర్వాత తత్వం బోధపడి ఉంటుంది. అది కొండా సురేఖ ఫిర్యాదు ప్రభావం కూడా కావచ్చు. అందుకే ఆయన నకిరేకల్ సభలో మళ్లీ నేనే సీఎంగా ఉంటానని ప్రకటించి ఉండకపోవచ్చు. పైగా తనకంటే సీనియర్ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అదే వేదిక మీద ఉన్నందున సీఎం గారు ఆచితూచి మాట్లాడి ఉండచవచ్చు. ఏదేమైనా సీఎం గారి దూకుడుకు ఢిల్లీ కళ్లెం వేసినట్లే కనిపిస్తోంద’’ని నల్గొండకు చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
