September 16, 2026

సురేఖ సరే.. ఆ ఎమ్మెల్యేలపై చర్యలేవీ?

  • ఆ 18 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు షోకాజ్ నోటీసులివ్వరేం?
  • వారిని కమిటీ వదిలేసినట్లేనా?
  • క్రమశిక్షణ కమిటీ వారిని పిలిపించదా?
  • నచ్చినవారయితే వదిలేస్తారా?
  • వాళ్లు ఎవరి అనుమతితో ప్రెస్‌మీట్ పెట్టారు?
  • వారికి అనుమతి ఇచ్చింది పీసీసీనా? సీఎల్పీనా?
  • అనుమతించిన వారిపై చర్యలేవీ?
  • క్రమశిక్షణ చర్యల్లో పక్షపాతమెందుకు?
  • మల్లు రవి, మహేష్‌కుమార్ గౌడ్, సీతక్క మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమా?
  • కొండాకు ఒకరూలు.. ఆ 18 మందికి మరో రూలా?
  • క్రమశిక్షణ కమిటీ వైఖరిపైసీనియర్ల విసుర్లు
  • కాంగ్రెస్‌లో ఇదో విచిత్ర క్రమ ‘ శిక్ష’ణ

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారు ఎంత పెద్దవాయినా ఉపేక్షించేది లేదు. పార్టీ కంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు. మీకు ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలున్నాయి. అక్కడ చర్చించుకోవచ్చు. తమ అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఏ నాయకుడికయినా ఉంది. అందుకు భిన్నంగా మీడియాలో మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. మీడియాలో మాట్లాడటం ద్వారా సురేఖ క్రమశిక్షణ ఉల్లంఘించారు’

  • క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఉవాచ

‘కాంగ్రెస్‌లో ఎంతపెద్దవారయినా క్రమశిక్షణ పాటించాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఏదైనా సమస్య ఉంటే నాలుగుగోడల మధ్య కూర్చుని మాట్లాడుకోవాలి. అందుకు భిన్నంగా మాట్లాడితే ఎవరిపైనయినా చర్యలు తప్పదు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం’

  • కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్

‘కాంగ్రెస్‌లో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందే. నాకైనా నాయకత్వ ఆదేశాలే శిరోధార్యం. నాయకత్వం కంటే ఎవరూ పెద్దవాళ్లు కాదు. ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలపై మాట్లాడుకోవాలి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే నాతో సహా ఎవరిపైనా చర్యలుంటాయి’

  • ‘కాంగ్రెస్‌లో సీనియర్’ మంత్రి సీతక్క

నిజంగా వీరి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అనేది అంత కఠినంగా అమలవుతుంటుందా? అన్న అనుమానం, ఆశ్చర్యం కలగకతప్పదు. ఎందుకంటే ఈ ప్రకటనలు చేసిన వారు ఆషామాషీ నాయకులు కాదు. ఒకరు పీసీసీ అధ్యక్షులయితే, మరొకరు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి.

ఇంకొకరేమో ‘దశాబ్దాల నుంచి’ కాంగ్రెస్‌లో పనిచేస్తున్న మంత్రి సీతక్క. కాబట్టి వారు ముగ్గురి ప్రకటనలు నిజమే కామోసనుకోవచ్చు.

కానీ పార్టీ సీనియర్లు మాత్రం.. వారి ప్రకటనలు కేవలం కంటితుడుపేనని, క్రమశిక్షణ చర్యలో పక్షపాతం కనిపిస్తుండటమే దానికి కారణమని వాదిస్తున్నారు. దానికి వారు చేస్తున్న వాదన కూడా, ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణా రాహిత్య వ్యవహారం, ఒకవైపు క్రమశిక్షణ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో.. ఆమెతోపాటు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ 18 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీఎల్పీ కార్యాలయంలోనే ప్రెస్‌మీట్ నిర్వహించి తమ డిమాండును నాయకత్వానికి వినిపించారు. ఆ తర్వాత కొండా సురేఖను ఢిల్లీకి పిలిపించడం, ఆమె వివరణ తనకు సంతృప్తి కలిగించలేదని కమిటీ అధ్యక్షుడు మల్లు రవి నాయకత్వానికి నివేదించడం, తర్వాత సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిర్ణయించడం చకచకా జరిగిపోయాయి.

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కొండా సురేఖపై ఆరోపణలు చేయడమే కాదు.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరులు కూడా సమానంగా కష్టపడ్డారని ప్రశంసించిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటివరకూ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

అంటే ఇక కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో పార్టీ క్రమశిక్షణ పాత్ర- ప్రక్రియ ముగిసిపోయిందా? అంటే కేవలం ఒక బీసీని వెలి వేయడానికే క్రమశిక్షణ కమిటీని వాడుకున్నారా? క్రమశిక్షణ ఉల్లంఘనలో కొండా సురేఖ ఎంత తప్పు చేశారో, పార్టీ అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టిన ఆ 18 మంది కూడా అంతే తప్పు చేసినప్పుడు వారిని వదిలేసి, కేవలం సురేఖ పైనే చర్యలు తీసుకున్నారంటే, క్రమశిక్షణ కమిటీ ఎవరికోసమో పనిచేస్తుందన్న భావన కలిగించడం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారంటే అర్ధం ఉంది. అది నిజం కూడా. కాంగ్రెస్ అధికారం వచ్చిందంటే అందులో ఆయన పాత్ర 80 శాతం ఉంది. అది ఎవరు కాదన్నా అంగీకరించాల్సిన నిజం. కానీ అప్పటికి పార్టీతో ఎలాంటి సంబంధం లేని ఆయన సోదరులు కూడా.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ పాటు సమానంగా కష్టపడ్డారని చెబితే, ఆ మాటల వెనక ఎవరున్నారన్నది తెలిసిపోతోంది. అయినా క్రమశిక్షణ ఉల్లంఘించి మీడియాకెక్కిన ఆ 18 మందికి ఇప్పటిదాకా షోకాజ్ నోటీసు ఇవ్వలేదంటే, ఇక క్రమశిక్షణ కమిటీకి విశ్వసనీయత ఏం ఉంటుంద’న్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి- మందుల సామేల్ మధ్య మీడియా కేంద్రంగా జరిగిన రచ్చను క్రమశిక్షణ కమిటీ పట్టించుకోకపోవడం మరో విచిత్రం. ‘నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో కోమటిరెడ్డి ఎలా పర్యటిస్తారు? దళితులంటే అంత చిన్నచూపా? అదే రెడ్ల నియోజకవర్గంలోకి వాళ్లకు చెప్పకుండా పర్యటిస్తారా?’అంటూ సామేల్ రచ్చ చేశారు. దానికి స్పందించిన కోమటిరెడ్డి గత ఎన్నికల్లో సామేల్‌కు టికెట్ ఇప్పించింది నేనేనంటూ గుర్తు చేశారు. క్రమశిక్షణ విషయంలో ‘చాలా కఠినంగా’ వ్యవహరించే చైర్మన్ మల్లు రవి.. మరి వారిద్దరికీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడమే ఆశ్చర్యం.

‘తమ్ముడు తనవాడయినాధర్మం చెప్పాలన్న ధర్మరాజు పక్షపాతంగా తీర్పు చెబితే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంద’న్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలను పరిశీలిస్తే.. క్రమశిక్షణ కమిటీ తనంతట తానుగా పనిచేయడం లేదని, ఎవరి ఆదేశాల ప్రకారమో పనిచేస్తుందన్న విషయం తేలిపోయిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కాగా కొండా సురేఖకు వ్యతిరేకంగా- సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులకు మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, బల్మూరి వెంకట్; ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్‌రెడ్డి, మందుల సామేల్, జయవీర్‌రెడ్డి, బీఎల్‌ఆర్, బాలూనాయక్, ఎడ్మా బొజా, చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, జి.మధుసూదన్‌రెడ్డి, కుంభం అనిల్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రాజేష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి; ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ప్రెస్‌మీట్ పెట్టారు.

‘ఆముగ్గురిపై చర్య తీసుకోవాల్సిందే. లేకపోతే పార్టీకి చాలా నష్టం. రేవంత్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చే వరకూ కొండా సురేఖకు దిక్కులేదు. కూతురు వ్యాఖ్యల వెనక ఆమె ఉంది. పార్టీని అధికారంలోకి తీసువచ్చేందుకు రేవంత్‌రెడ్డితో సమానంగా ఆయన సోదరులు కూడా కష్టపడ్డారు. ఇన్ని పార్టీలు మార్చిన సురేఖను రేవంత్‌రెడ్డి గౌరవించి మంత్రి పదవి ఇస్తే, దానిని ఆమె నిలుపుకోవడంలో విఫలమయ్యారు. వరంగల్ జిల్లాలో కేవలం కొండా కుటుంబమే ఉందా?’ అని మీడియా సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపించడం ద్వారా, వారు సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు కొండాపై వ్యక్తిగతంగా విరుచుకుపడి, రేవంత్‌పై తమ అభిమానం చాటుకున్నారు.

అసలు సీఎల్పీలో ఆ 18 మంది ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు ఎవరు అనుమతించారన్నది ప్రశ్న. ఒక మంత్రి, పైగా ఏఐసిసి సభ్యురాలు కూడా అయిన సురేఖ వంటి స్ధాయి ఉన్న నాయకురాలికి వ్యతిరేకంగా.. సీఎల్పీ వంటి వేదికపై ప్రెస్‌మీట్ పెట్టాలంటే మామూలు విషయం కాదు. పైగా ఇది క్రమశిక్షణకు సంబంధించిన అంశం కాబట్టి అందుకు సీఎల్పీ నాయకుడి అనుమతి తప్పనిసరి. సీఎల్పీ నాయకుడ ంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మరి ఆ ప్రకారంగా సీఎల్పీ నాయకుడయిన సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఆ 18 మంది తీసుకున్నారా? అన్న మరో ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు లేదు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖకు వ్యతిరేకంగా గళం విప్పిన మరో మహిళా నేత కూడా, పీసీసీ చీఫ్ అనుమతి తీసుకుని మీడియాతో మాట్లాడారా?

నిజంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి సీతక్క చెప్పిన ప్రకారమయితే.. ఆ 18 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ వేదికలపైనే కొండా సురేఖ గురించి మాట్లాడాలి. ఇన్చార్జి, పీసీసీ చీఫ్, సీఎంకు మాత్రమే ఫిర్యాదు చేయాలి. బయట మీడియాతో మాట్లాడకూడదు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ ఆరోపణలు చేయకూడదు.
ముందు పార్టీ ఇన్చార్జి, పీసీసీ చీఫ్, సీఎంకు ఫిర్యాదు చేయాలి. అలాంటి పద్ధతులేమీ పాటించకుండా, నేరుగా సీఎల్పీలో ప్రెస్‌మీట్ పెట్టి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. క్రమశిక్షణ కమిటీ ఇప్పటివరకూ వారికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడమే, ఇన్ని విమర్శలకు ప్రధాన కారణం.

దీనిపై స్పందించిన కొండా సురేఖ.. తనకు వ్యతిరేకంగా పార్టీ వేదికపై మాట్లాడిన ఆ 18 మందిపై చర్యలు తీసుకోవాలి బహిరంగంగా డిమాండ్ చేయడమే కాదు. ఢిల్లీ నాయకత్వానికీ ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ ఆ 18 మందికి కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకపోవడంతో.. క్రమశిక్షణ కమిటీ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని- ఎవరి ఆదేశాల ప్రకారమో నడుస్తోందన్న వాస్తవం స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Total Visitors: 2,654,979