కర్మ రిపీట్స్…

- కొండా సురేఖకు రోశయ్య శాపం?
కొన్ని సంఘటనలు చూసినప్పుడు కర్మ సిద్ధాంతం నిజమే అని నమ్మాల్సి వస్తుంది. తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో కర్మ రిపీట్ అయింది. ఎలాగంటే.. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నాయుడు కొణిజేటి రోశయ్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. జగన్‌కి దక్కాల్సిన సీఎం సీటులో రోశయ్య కూర్చోవడాన్ని ఒప్పులేనంటూ.. పెద్దాయన అనే గౌరవం లేకుండా రోశయ్య మొహం నేను చూడను అంటూ నానా మాటలు అని.. కొండా సురేఖ అప్పట్లోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 3 2009. పదిహేడేళ్ల తర్వాత అదే సెప్టెంబర్ 3న రేవంత్‌రెడ్డి మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం చూస్తుంటే.. ఇది విధి ఆడిన వింత నాటకం అనిపించక మానదు. ఇంకో విచిత్రం ఏంటంటే.. కొండా సురేఖ భర్త.. కొండా మురళి పీపుల్స్ వార్ నక్సలైట్ గ్రూపులో పని చేసేవాడు. 2002లో వరంగల్‌కి చెందిన తెలుగుదేశం పార్టీ నేత కొల్లి ప్రతాప్‌రెడ్డిని కొండా మురళి హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి.
అప్పటి వరంగల్ ఎస్పీ.. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్న నళిన్ ప్రభాత్.. కొండా మురళిని వరంగల్ రోడ్ల మీద కొట్టుకొంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తనను ఎన్‌కౌంటర్ చేయించాలని ఒత్తిడి చేసినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దని చెప్పడం వల్లే.. తాను ఇప్పటికీ బతికి ఉన్నానని.. కొండా మురళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చంద్రబాబు దయతో బతికి బయటపడ్డామని అప్పట్లో కొండా మురళి చెబితే.. ఇప్పుడు చంద్రబాబు వల్లే తన మంత్రి పదవి పోయిందని కొండా సురేఖ ఆరోపించడం మరో విధి విచిత్రం. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైసీపీలో చేరి.. అక్కడ మనుగడ లేదని అర్ధమయ్యాక.. జగన్ మోసం చేశాడని ఆయన్ని కూడా తిట్టి పోసి.. టీఆర్ఎస్‌లో చేరిన కొండా సురేఖ.. తర్వాత కేసీఆర్, కేటీఆర్‌ల మీద తీవ్రమైన ఆరోపణలు చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు.
ఏ పార్టీలోనూ నాయకత్వాన్ని గౌరవించే అలవాటు లేకపోవడం.. అంతులేని అహంకారం.. నోటి దరుసు వంటి కారణాలతోనే.. కొండా సురేఖకు ప్రస్తుత దుస్థితి దాపురించింది. స్వయం కృతాపరాధాన్ని గుర్తించకుండా.. ఎవరి మీదనో నిందలు వేయడం వల్ల మరింత నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగమూ ఉండదని కొండా సురేఖ ఉదంతం స్పష్టం చేస్తోంది.
-శశి
