ఎందుకిలా?..ఏమిటిలా?

- మంత్రి సత్యకుమార్ ఉండగా ప్రభుత్వ వేదికలపై మాధవుడెందుకు?
- ఇప్పటికే సీపీఐ, వైసీపీ విమర్శలు
- ప్రభుత్వ ప్రకటనలపై పెత్తనం ఎవరిది?
- సమాచారశాఖ నిద్రపోతోందా?
- మంత్రుల ఫొటోలు లేకుండా ప్రకటనలేమిటి?
- విడుదల చేసే ముందు తనిఖీ చేయరా?
- సమాచార శాఖపై కమిషనర్‌కు పట్టేదీ?
- విమర్శలు వస్తే గానీ కళ్లు తెరవరా?
- మార్కాపురం, అనకాపల్లి కార్యక్రమాల్లో మంత్రి రామానాయుడు ఫొటో మాయం
- దానిపై మాజీ డీపీ ఏబీ వ్యంగ్యాస్త్రాలు
- మీ ముగ్గురే పాలించమని సలహా
- సీఎం స్పందించి సమాచారశాఖ పై ఆగ్రహం
- కూటమిలో విబేధాలకు బీజాలు వేస్తున్నారా?
- మోదీ, పవన్ ఫొటోలు లేని ప్రచారంపు ఇప్పటికే ‘సాక్షి’లో వ్యతిరేక కథనాలు
- ఇప్పుడు అసలు సలహాదారులెవరు?
- కన్సల్టెంట్ల సలహాలు ప్రమాదమంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? కూటమిని తప్పుదోవపట్టిస్తున్నది ఎవరు? రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రాలు ఇస్తున్నది ఎవరు? టీడీపీ 3.0కి సలహాదారులెవరు? ఎవరి ఆదేశాలతో పార్టీ-ప్రభుత్వం నడుస్తోంది? కన్సల్టెంట్లా? ఉద్యోగులా? ఇంకెవరు? కూటమిలో లుకలుకలకు బీజం వే స్తున్న ఆ మెదళ్లు ఎవరివి? ప్రభుత్వ ప్రకటనలో మంత్రుల ఫొటో లేకుండా.. సీఎం పర్యటనల్లో స్ధానిక ఎమ్మెల్యేలు లేకుండా స్థానికులతో సీఎం ఒక్కరే మమేకం అయ్యేలా ప్రోగ్రాములు డిజైన్ చేస్తున్నది ఎవరు? నాయకుల ప్రమేయం క్రమేపీ తగ్గిస్తున్న ఆలోచన ఎవరిది?.. ఇప్పుడు కూటమి ప్లస్ టీడీపీలో ఇదో హాట్ టాపిక్.
మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోకూడదు. వేసుకోరు కూడా. కానీ ఇప్పుడు టీడీపీ 3.0లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జీవించినప్పుడు పార్టీని భుజన వేసుకుని నడిపించింది చంద్రబాబునాయుడే. పార్టీ కష్టకాలంలో ఉండి, ఎన్టీఆర్ శాసనసభను బహిష్కరించిన నాటి నుంచి.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, ఎన్టీఆర్‌ను అసెంబ్లీలో ప్రతిష్ఠించిందీ చంద్రబాబు మేధస్సు మాత్రమే.
అలాగని చంద్రబాబు తనను తాను ఎప్పుడూ ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేసుకోలేదు. ‘ఎన్టీఆర్ తర్వాతనే తాను’ అన్న భావన కలిగించేవారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ నిర్వహణలో 80 శాతం పైచేయి చంద్రబాబుదే అయినప్పటికీ, ఆయన ఏనాడూ ఉద్యోగులు, కన్సల్టెంట్లతో పార్టీ నడపలేదు. పూర్తిగా తన సహచరులు, సీనియర్లు, పనిచేసే యువకులకు బాధ్యతలు అప్పగించి వారితో పని చేయించేవారు. వివిధ అంశాలపై చర్చించి, సమిష్ఠి నిర్ణయాలు తీసుకునేవారు. చివరకు ఆ సహచరులు, సీనియర్లే చంద్రబాబు సీఎం అయేందుకు దన్నుగా నిలిచి, ఎన్టీఆర్ అంతటి మహాశక్తినే ఎదిరించారు. అందుకే టీడీపీ ఇప్పుడు వ్యవస్థాగతంగా ఇంత బలంగా ఉంది.
మరి అలాంటి టీడీపీకి ఇప్పుడు ఏమైంది? నిర్ణయాల్లో తప్పులు ఎందుకు దొర్లుతున్నాయి? నియామకాల్లో విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? సలహాలు-సంప్రదింపులు-చర్చల వాతావరణం ఎటు పోయింది? మంత్రులను నిమిత్తమాత్రులను చేసే వ్యవస్థకు ఊపిరిపోసేందుకు కారణమవుతున్నది ఎవరు? -గత రెండేళ్ల నుంచి పార్టీ-ప్రభుత్వంలో అలవాటుగా మారిన పొరపాట్ల పర్వంపై సీనియర్ల ఆవేదన ఇది.
గత కొద్దిరోజుల క్రితం మార్కాపురం, అనకాపల్లిలో పోలవలం ఎడమ కాల్వకు నీళ్లు వదిలి ఆ ప్రాంత ప్రజల పెదవులపై చిరునవ్వులు పూయించిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు కొట్టారు. రాక రాక వచ్చిన నీళ్లను చూసి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుని, కాల్వ నీళ్లు నెత్తిన చల్లుకోవడమే కాదు. వాటిని బాటిళ్లలో పట్టుకుని ఇళ్లకు తీసుకువెళ్లారు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా అక్కడ చూసిన వాస్తవ దృశ్యాలు.
అంతవరకూ బాగానే ఉంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా భారీ ప్రచారం చేసింది. ఒక విజయాన్ని తన సొంతం చేసుకునే సందర్భంలో ఆ ఘనత తమదేనని చాటుకునేందుకు, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఏమాత్రం తప్పులేదు. అందులోనూ లక్షలాది ఎకరాలు, లక్షలాది ప్రజల గొంతు తడిపే జలకళాయె! కానీ ఆ ఈవెంట్ కోసం లెక్కలేనన్ని సార్లు తిరిగి, అర్ధరాత్రి కూడా పనులు చేయించిన నీటిపారులదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును తెరపైకి తీసుకురాకపోవడమే విమర్శలకు కారణమయింది.
సహజంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే దానికి సంబంధించిన పత్రికా ప్రకటనల్లో.. సీఎంతో పాటు, సంబంధిత శాఖ మంత్రి ఫొటో కూడా ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ సంప్రదాయం నిర్విఘ్నంగా జరిగింది. సీఎం, సంబంధిత శాఖ మంత్రి తప్ప, మిగిలిన ఏ ఒక్క ఫొటో కనిపించేది కాదు. అలా మంత్రులకు గౌరవం ఇచ్చేవారు.
కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. నాటి సీఎం జగన్ ఫొటో తప్ప ఎవరి ఫొటోలు భూతద్దం పెట్టి వేసినా కనిపించేది కాదు. దీనిపై అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ, మీడియా సంస్థలు విమర్శలు సంధించాయి. దానితో కొద్దిగా దిద్దుబాటకు దిగి, మంత్రుల పేర్లు కింద పెట్టారు. దానితో మంత్రులు కూడా ఆ పాటి దానికే తమ జన్మ ధన్మమయిందని మురిసి ముక్కలయ్యేవారు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను తమ పార్టీ పత్రిక అయిన ‘సాక్షి’లో డబ్బులిచ్చి వేయించుకునేవారు.
అయితే వైసీపీ ఓడిపోయి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఏలుబడిలోనూ, జగన్ సర్కారు విధాన పోకడలు కనిపిస్తుండటమే ఆశ్చర్యం. సంబంధిత శాఖల మంత్రులు ఫొటోలు లేకుండా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఫొటోలు మాత్రమే దర్శనమిస్తున్న వైనం, అనవసర విమర్శలకు దారితీస్తోంది. విశాఖ సహా ఇతర జిల్లాల్లో భారీ కంపెనీల ప్రారంభోత్సవాల సమయంలో అయితే, ఆయా ప్రైవేటు కంపెనీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫొటోలు కూడా వేస్తున్న కొత్త సంస్కృతికి తెరలేపింది. నిజానికి ప్రైవేటు కంపెనీలు తమ డబ్బులతో ఇచ్చే ప్రకటనలకు ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా, బీజేపీ అధ్యక్షుడి ఫొటో చోటు చేసుకుందంటే, ఆ సిఫార్సు ఎవరిదన్నది పెద్దగా ఊహించాల్సిన పనిలేదు.
సరే..మార్కాపురం, అనకాపల్లికి సంబంధించిన నీటిపారుదల శాఖ కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వ ప్రకటనల్లో, సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో కనిపించకపోవడం విమర్శలకు దారితీసింది. దానిపై మాజీ డీపీ ఏబీ వెంకటేశ్వరరావు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఎత్తిచూపుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మినహా మిగిలిన మంత్రులంతా నామమాత్రులేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. జలవనరుల శాఖ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి ఫొటో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘గతంలో తెలంగాణలో కేసీఆర్ 68 రోజులు.. ఆయన, మహమూద్ అలీ మాత్రమే ఉండి క్యాబినెట్ నడిపారు. మరి మీరు కూడా త్రిసభ్య కేబినెట్‌తో పారిపాలన చేయొచ్చుగా? ఎందుకు ఖర్చు దండగ’ అంటూ ఏబీ విసిరిన వ్యంగ్యాస్త్రం సోషల్‌మీడియాలో తెగ ప్రచారమయింది.
దానితో క్యాబినెట్‌లోనే స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు ‘‘ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ ప్రత్యర్ధులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి విషయంలో సమాచార శాఖ అప్రమత్తంగా లేకపోతే ఎలా? ప్రకటన విడుదల చేసే ముందు అన్నీ చూసుకోవాలి కదా? ఇకపై ప్రొటోకాల్ పాటించండి. మీరు చేసే పొరపాటు వల్ల ఇప్పటికే వైసీపీ మనపై విష ప్రచారం చేస్తోంది. ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతమయ్యేందుకు వీల్లేదు’’ అని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా మారిందో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఒక ప్రభుత్వ ప్రకటన విడుదల చేసే ముందు చాలా పెద్ద కసరత్తు జరుగుతుంది. సమాచార శాఖ జెడి స్థాయి అధికారులు కమిషనర్‌తో చర్చించి, డిజైన్ రూపొందిస్తారు. దానిని కమిషనర్ సీఎంకు చూపించి, ఆయన అనుమతి తీసుకుని పత్రికలకు విడుదల చేస్తారు. అందులో ఏమైనా సవరణలు ఉంటే తిరిగి దానిని మార్చి పంపిస్తారు. ఇదంతా ముగిసేవరకూ డిజైనర్, జెడినో, యాడ్స్ చూసే ఏడీనో ఆఫీసులోనే ఉండి తీరాల్సిందే. ఇది సమాచార శాఖలో జరిగే నిరంతర ప్రక్రియనే.
ఒకవేళ డిజైన్‌లో ఏమైనా సందేహం ఉంటే కమిషనర్ దానిని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి. ఉదాహరణకు తాజాగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఫొటో లేకుండా చేసిన డిజైన్‌ను కమిషనర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి, సదరు మంత్రి ఫొటో కూడా పెట్టాలా? వద్దా? అని అడగాలి. అడిగిఉంటే సీఎం తన సూచన చెప్పేవారు. ఇప్పుడు జరిగిన వ్యవహారం చూస్తే.. మంత్రి ఫొటో పెట్టాలా అని కమిషనర్ కోరడం గానీ, పెట్టమని సీఎం చెప్పడం గానీ జరిగినట్లు కనిపించడం లేదు. మరి ఇది సీఎం చెప్పినట్లు, అవగాహనాలోపం-కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలేమో?! అందువల్లే మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించేవరకూ మేల్కొనలేదు.
నిజానికి ప్రస్తుతం సమాచారశాఖ గ తంలో ఎన్నడూ లేనంత గందరగోళంగా మారింది. కమిషనర్ నిజాయతీపరుడు, ముక్కుసూటి అధికారి అయినప్పటికీ, టీమ్ లీడర్‌గా వ్యవహరించడంలో విఫలమవుతున్నారన్నది ఓ విమర్శ. కింది స్థాయి అధికారుల మాటల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, ఏ అధికారి టీమ్ లీడర్ కాలేరు.
ప్రధానంగా ఇప్పుడు సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో, అనుభవజ్ఞులైన అధికారులెవరూ లేరు. జిల్లాల నుంచి హెడ్డాఫీసుకు తీసుకువచ్చి, హెడ్డాఫీసులో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులను జిల్లాలకు బదిలీ చేసిన ఫలితమే, ఇలాంటి గందరగోళానికి కారణంగా కనిపిస్తోంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. పైగా ఆ శాఖలో పోస్టింగుల్లో కమిషనర్ పెత్తనం బదలు మంత్రి, ఆయన పేషీ పెత్తనమే కనిపిస్తోందన్నది ప్రధాన విమర్శ. మంత్రి గారి పేషీ ‘కులం కోణం’లో పనిచేస్తోందన్నది మరో విమర్శ.
మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరావు ప్రస్తావించినఈ వ్యవహారం చూడ్డానికి చాలా చిన్నదిగా అనుకోవచ్చు. కానీ ఇది మంత్రుల పరువు-ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం. ముఖ్యంగా మంత్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అయితే వారు దానిని ఆత్మగౌరవ సమస్యగా తీసుకోకపోవచ్చు. కానీ ప్రజల దృష్టిలో అది ఆత్మగౌరవ అంశమే. ప్రభుత్వమే మంత్రులను గౌరవించకపోతే, ఇక ఆ శాఖ అధికారులు వారిని ఎందుకు లెక్క చేస్తారు? అంతేనా?.. మంత్రులకు ప్రభుత్వంలో పలుకుబడి, గుర్తింపు లేదు. ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లు.. మంత్రులు నిమిత్తమాత్రులన్న భావన ప్రజల్లో బలపడే ప్రమాదం కూడా లేకపోలేదు. గత జగన్ ప్రభుత్వంలో జరిగింది కూడా అదే కదా? మరిప్పుడు కూటమి కూడా అదే దారిలో నడిస్తే, అభాసుపాలయ్యేది ఎవరరన్నదే ప్రశ్న.
సహజంగా తెలివైన ఏ అధికారి ఇలాంటి కీలక అంశాల్లో సొంత నిర్ణయాలు, సొంత మెదడు వాడరు. పైవారు చెప్పిందే పాటిస్తారు. దానికి సంబంధించిన పాలిసీనే ఫాలో అవుతారు. పైకి అధికారుల వైఫల్యం అంటూ పాలకులు నెట్టేసినా, తెరవెనక జరిగే వ్యవహారాలు-నిర్ణయాలు వేరే ఉంటాయి. కానీ బలయ్యేది మాత్రం అధికారులే.
తాజాగా తెలంగాణలో 22ఏ వ్యవహారంలో పీకల్లోతు ఆరోపణల్లో కూరుకున్న రేవంత్‌సర్కారు, జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పుకుంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇదంతా అధికారుల పనేనని చెప్పి, రెవిన్యూ మంత్రి పొంగులేటి గుడ్డకాల్చి అధికారుల నెత్తినేశారు. మంత్రి చెప్పకుండా-ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకుండా.. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటారా? వెటకారం కమ్ అమాయకత్వం కాకపోతే!
ఇక పార్టీ-ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాల వెనక ఎవరు ఉన్నారన్నది, కూటమి కమ్ టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ, ఇప్పటికీ జాతీయ రాజకీయాలను శాసిస్తున్న చంద్రబాబునాయుడు లాంటి మేధావి-రాజనీతిజ్ఞుడిని కూడా, కన్సల్టెంట్లు గైడ్ చేస్తున్నారన్న ప్రచారం కింది స్థాయి వరకూ వినిపించడం ప్రమాదకరం. ఈ మధ్య కాలంలో ఈ చర్చ క్షేత్రస్థాయికి చేరడం పార్టీ భవిష్యత్తు-చంద్రబాబు ఇమేజీకి మంచిది కాదన్నది సీనియర్ల ఉవాచ.
ఉదాహరణకు చంద్రబాబునాయుడు గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడ ఎంతమంది ఉండాలి? ఆయనతో ఎవరెవరు ఉండాలి? కూర్చోవడానికి నులకమంచాలు ఎన్ని తెప్పించాలి? వేదికపై ఎంతమంది ఉండాలి? చంద్రబాబుకు అటు-ఇటు ఎవరుండాలి? ఇంట్లో స్టవ్ వెలిగించి, టీ పెట్టినప్పుడు అక్కడ ఎంతమంది ఉండాలి? పెద్దాయనతో కండువా ఎలా తిప్పించాలి? వంటి వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కన్సల్టెంట్లు.. చంద్రబాబునాయుడు ఆ గ్రామప్రజలతో కలసి నడుస్తున్నప్పుడు, వారితో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేకుండా చేస్తున్న వైనం ఎమ్మెల్యేలతోపాటు, స్ధానిక నాయకులకూ మనస్తాపం కలిగిస్తోందన్న విషయం ఇప్పటివరకూ ఎవరూ నాయకత్వ దృష్టికి తీసుకువెళ్లకపొవడమే ఆశ్చర్యం.
దీనివల్ల నాయకత్వమే ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకపోతే ఇక ఆయనకు ఆ నియోజకవర్గంలో ఏం గౌరవం ఉంటుందన్న రాజకీయ కోణం కన్సల్టెంట్లకు తెలియకపోవడమే వింత. అంటే మానవబంధాల ప్రాతిపదిక కాకుండా, కన్సల్టెంట్ల సలహా మేరకు తీసుకునే నిర్ణయాలు ఎలా వికటిస్తాయో అర్ధమవుతుంది. గత జగన్ ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో ఎమ్మెల్యేలు- నాయకుల ప్రమేయం కట్ చేసి, నేరుగా ‘ఓటర్ టు జగన్’ అనే సూత్రం ప్రవేశపెడితే ఏం జరిగిందో సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘‘ఆత్మగౌరవం పేరిట ఎన్టీఆర్ పురుడుపోసిన తెలుగుదేశం పార్టీ మానవ సంబంధాలు-నాయకులతో నిరంతర చర్చల ప్రక్రియతో కొనసాగాలి తప్ప, కన్సల్టెంట్లు చెప్పే కృత్రిమ చిట్కాలతో కాదు. అది ఆప్ వంటి పార్టీలకే చెల్లుతాయి.
మనలాంటి మాస్ పార్టీకి కుదరదు. నాయకుల ప్రాధాన్యం తగ్గించి ఇలాంటి కన్సల్టెంట్ల సలహాలతో నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్, జగన్ ఏమయ్యారో మనం చూశాం కదా? అయినా మనకు పార్టీలో మేధావులు, విద్యావంతులకు కొదవ ఏముంది? దాదాపు అంతా క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేస్తున్నవాళ్లే కదా? ఆ కన్సల్టెంట్ల కంటే మా గ్రామ కార్యకర్తలను పిలిచి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో చెప్పమంటే పూసగుచ్చినట్లు నిజాలు చెబుతారు కదా? మళ్లీ మధ్యలో ఈ తడిక రాయబారులెందుకు? మనం ముందు పార్టీ-ప్రభుత్వంలో మానవ సంబంధాలు కొనసాగించే దానిపై దృష్టి సారించాలి’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రకటనల్లో ఫొటోలకు సంబంధించి రాజకీయాల్లో తలపండిన సీఎం చంద్రబాబునాయుడు చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే ఇటీవలికాలంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు, డిజైన్లలో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేకుండా పంపిణీ అవుతున్న వైనంపై, వైసీపీ పత్రిక ‘సాక్షి’లో కథనాలు వెలువడుతుండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు, ఉత్తరాంధ్ర ప్రగతి పేరుతో ముద్రించిన కరపత్రాల్లో మోదీ-పవన్ లేదంటూ ఆ ఫోటోలను ముద్రించిన ‘సాక్షి’, కూటమిలో కుంపటి రాజేసే ప్రయత్నం చేసింది.
పైగా ఎన్నికల ముందు మోదీ-పవన్‌ను ఆకాశానికెత్తిన టీడీపీ, ఇప్పుడు అసలు వారిని ఎక్కడా పట్టించుకోవడం లేదంటూ పొగరాజేసే కథనాలు వెలువరించింది. ఇదంతా పైస్థాయి నాయకులకు అబద్ధమని తెలుసు. కూటమిలో సఖ్యత ఉన్న విషయమూ తెలుసు. కానీ ఇలాంటి వాటికి ప్రభావితమయ్యేది కింది స్థాయి నాయకులు, కార్యకర్తలే. వారితోనే అసలు సమస్య. వారిలో అలాంటి విష బీజం నాటాలన్నదే వైసీపీ వ్యూహం. మరి ఈ విషయం, పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న కన్సల్టెంట్లు నాయకత్వానికి చెప్పకపోవడమే ఆశ్చర్యం.
కూటమికి సంబంధించిన కార్యక్రమాల్లో మూడు పార్టీల అధ్యక్షులు వేదికపై ఉంటే ఎవరికీ ఆక్షేపణ, అభ్యంతం ఉండదు. ఎందుకంటే అది పార్టీల కార్యక్రమం కాబట్టి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వేదికపై.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు స్థానం కల్పించడంపై, ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్న విషయాన్ని కూటమి పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం.
మాధవ్‌ను ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమ వేదికలపైకి ఆహ్వానిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు, వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయినా తాజా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమ వేదికపైనా, మాధవ్‌కు స్థానం కల్పించడం బట్టి.. క్షేత్రస్థాయి అభిప్రాయాలు అధిష్ఠానానికి తెలియడం లేదు.. తెలియకుండా దాచేస్తున్నారన్నది స్పష్టమయింది.
అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఇన్ని విమర్శలకు గురికావలసిన పనిలేదు. పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు. ఉప ముఖ్యమంత్రి కూడా. కాబట్టి పవన్ విషయంలో ఎవరికీ ఆక్షేపణ ఉండదు. కానీ కనీసం ఎమ్మెల్యే కూడా కాని మాధవ్‌ను ప్రభుత్వ వేదికలపైకి పిలిచి, విమర్శలు కొని తెచ్చుకునే బదులు.. ప్రభుత్వంలోనే బీజేపీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్‌ను వేదికపై పిలిస్తే, అసలు ఎలాంటి విమర్శలు ఉండవన్న చిన్న పొలిటికల్ లాజిక్‌ను ఎందుకు మిస్సవుతున్నారన్నదే ఆశ్చర్యం.
నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబులాంటి మేధావికే, కొత్తగా జనాకర్షక పాఠాలు చెబుతున్న కన్సల్టెంట్లు.. మరి ఇంత చిన్న లాజిక్కును ఎలా మిస్సయ్యారు చెప్మా?!
