September 16, 2026

విశాఖ, విజయవాడ, తిరుపతిపై జనసేన కన్ను

  • విశాఖ, విజయవాడపైనే పట్టు
  • విజయవాడను విడిచిపెట్టేదిలేదు
  • విజయవాడ మాకు అత్యంత ప్రతిష్టాత్మకం
  • కావాలంటే తిరుపతి బదులు రాజంపేట తీసుకుంటాం
  • కాకినాడ, బందరు సహా మరికొన్ని స్థానాలపై గురి
  • జనసైనికుల అసంతృప్తి పోగొట్టేందుకే ఇదే వేదిక
  • కాపుల అసంతృప్తికీ తెరదించుదాం
  • స్థానిక సమరంలో 40 శాతం కోరదాం
  • మీరు బలం ఉన్న చోట పోటీ చేయండి
  • పొత్తు సంగతి నేను చూసుకుంటానని పవన్ భరోసా
  • బలమైన స్థానాలు గుర్తించాలని ఆదేశం
  • గత ఎన్నికల్లో పోటీ దానికే పరిమితం
  • స్థానిక సమరం లెక్క వేరు

( మార్తి సుబ్రహ్మణ్యం)

గత ఎన్నికల్లో పార్టీని గద్దెనెక్కించిన వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తెరదించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా వినియోగించుకోవాలని జనసేన నిర్ణయించింది. అందులో భాగంగా రానున్న మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో 40 శాతా వాటా కావాలని కూటమిని కోరేందుకు జనసేన నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ప్రధానంగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో.. కోస్తాలో తమపై గుర్రుగా ఉన్న కాపుల్లో నెలకొన్న అసంతృప్తికి పూర్తి స్థాయిలో తెరదించేందుకు, కాపులు బలంగా ఉన్న ప్రతి మున్సిపాలిటీని అడగాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో తమ వాటాగా 40 శాతం సీట్లు కోరాలని జనసేన నాయకత్వం సిద్ధమవుతోంది. ఆ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల ప్రకారం.. తమ పార్టీ ఎక్కడ బలంగా ఉంది? కాపులు బలంగా ఉన్న మున్సిపాలిటీలు ఏవి? భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఏయే కీలక కార్పొరేషన్లలో పాగా వేయాలి? అన్న అంశాలపై జనసేన వ్యూహబృందం, గత కొద్దిరోజుల నుంచి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఆ మేరకు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా పార్టీ విస్తరణ, ఇప్పటివరకూ పార్టీ కోసం పనిచేసిన వారికి ఈ స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వడం ద్వారా.. సంస్థాగతంగా బలపడటంతోపాటు, వారిలో పార్టీపై ఉన్న అసంతృప్తిని కూడా దూరం చేసే ద్విముఖ వ్యూహంతో జనసేన అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జనసేన అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

‘మనం బలంగా ఉన్నామని అనుకున్న చోట పోటీ చేయండి. పొత్తుల విషయం నేను చూసుకుంటా. అసెంబ్లీ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థలు వేరు. పార్టీ జెండా మోసిన జనసైనికులను ప్రోత్సహిద్దా’మని ఆయన చేసిన వ్యాఖ్య పరిశీలిలిస్తే.. స్థానిక సంస్థల ద్వారా, పార్టీని విస్తరించాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పటికి రెండుచోట్ల జనసేన పోటీ చేస్తుందని స్థానిక నాయకులు ప్రకటించడం గమనార్హం.

అందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకోవాలని జనసేన భావిస్తోంది. ప్రధానంగా సీట్ల పంపిణీలో విజయవాడ, విశాఖలపై గట్టిగా పట్టుపట్టాలని జనసేన వ్యూహబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటిలో సామాజికవర్గ కోణంలో విజయవాడను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదని, తొలిసారి వచ్చిన అవకాశాన్ని వదలుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

ఉమ్మడి విశాఖలో ముగ్గురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉండటంతోపాటు, కాపు-తూర్పు కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, విశాఖ మేయర్ సీటు అడుగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. విజయవాడలో కాపు, వైశ్యులు, యాదవులు తమ వైపే ఉన్నందున వారికి సముచిత స్థానం కల్పించడం ద్వారా, రాజధాని నగరంలో పాగా వేయాలన్నది జనసేన వ్యూహబృంద లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక తిరుపతిలో తమ ఎమ్మెల్యే ఉండటంతోపాటు, బలిజ సామాజికవర్గ సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘జనసేనకు సామాజికంగా బెజవాడ పెట్టని కోట. ప్రతిష్టాత్మకం. కల్యాణ్ గారిని తొలుత ఆదరించింది బెజవాడ కాపు బిడ్డలే. గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. ఈసారి వచ్చిన అవకాశం వదులుకోం. ఇప్పటివరకూ మేయర్ సీటు కాపులకు దక్కలేదు. బెజవాడ అంటే కేవలం ఒక కులమే అన్న భావన ఉంది. రేపటి ఎన్నికల్లో బెజవాడ మేయర్ సీటు సాధించడం ద్వారా, రాజధాని నగరంలో మా సత్తా చాటతాం. ఎట్టి పరిస్థితిలోనూ బెజవాడను వదులుకోం. తిరుపతి విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించినా విజయవాడ, విశాఖను మాత్రం వదులుకోం’ అని జనసేన కీలక నేత ఒకరు స్పష్టం చేశారు.

‘ఒకవేళ తిరుపతిని వదులుకోవాల్సి వస్తే, దానికి బదులు బలిజలు ఎక్కువగా ఉన్న రాజంపేట అడుగుతాం. కానీ విజయవాడను మాత్రం ససేమిరా ఒదులుకోబోం. ఆ విషయంలో మాపై కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లున్నాయ’ని జనసేన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఒకరకంగా బెజవాడ మేయర్‌గా పోటీ చేయడం తమకు ప్రతిష్టాత్మకం అని స్పష్టం చేశారు.

కాగా ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న మున్సిపాలిటీలను గుర్తించామని, ఇంకా మరికొన్ని వివరాలు జిల్లాల నుంచి అందాల్సి ఉందని చెబుతున్నారు. ఆ ప్రకారంగా.. కాకినాడ, రాజంపేట, భీమవరం, మండపేట, రామచంద్రాపురం, అమలాపురం, పిఠాపురం, తుని, సామర్లకోట మున్సిపాలిటీలను గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాలపైనే దృష్టి సారించామంటున్నారు. సీమలో అన్నమయ్య, తిరుపతి, ఒంగోలు జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలపై దృష్టి పెడుతున్నట్లు పార్టీ నాయకుడొకరు వెల్లడించారు.

కాపులను మెప్పించడమే లక్ష్యం?

కాగా గత రెండేళ్ల నుంచి వివిధ కారణాలతో, నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని.. తిరిగి దరి చేర్చుకునేందుకు, స్థానిక సంస్థల ఎన్నికలను వినియోగించుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పొత్తు కారణంగా ఉన్న మొహమాటాలు, ఒత్తిళ్ల దృష్ట్యా కాపులకు సరైన న్యాయం చేయలేకపోయినందున.. దానిని స్థానిక సంస్ధల ఎన్నికల ద్వారా భర్తీ చేయడం ద్వారా, కాపుల్లో నెలకొన్న అసంతృప్తికి పూర్తి స్థాయిలో తెరదించాలన్న లక్ష్యంతో వ్యూహబృందం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘కల్యాణ్ గారి ఆదేశాల మేరకు మేమయితే మా పార్టీ బలంగా ఉన్న మున్సిపాలిటీల జాబితా, నాయకుల పేర్లు తయారుచేస్తున్నాం. ఇంకా జడ్పీల జోలికిపోలేదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మాకు బలంగా ఉన్న చోట్ల కచ్చితంగా పోటీ చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ కార్యకర్తలను నిరాశపరచం. ఇక పొత్తు విషయాలు కల్యాణ్ గారు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం చేయాలో కల్యాణ్ గారే నిర్ణయిస్తార’’ని జనసేన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.

Total Visitors: 2,656,157