November 10, 2026

స్థానిక సంస్థలు – ఎన్నికల ఆర్భాటం, అధికారాల శూన్యత

(ఇంద్రాణి)

మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక మున్సిపల్ చైర్మన్ కావడానికి నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని వినికిడి . కౌన్సిలర్‌కు ఇరవై లక్షల నుండి నలభై లక్షలు ఖర్చు అయిందని ఒక వార్డు మెంబర్ చెప్పాడు. ఇంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో అర్థం కాదు. శాసనసభ ఎన్నికల కంటేకూడా ఈగోలు పెరిగిపోతున్నాయి. అందరూ డబ్బులు ఉన్నవాళ్లే పెడుతున్నారా అంటే అది కూడా కాదు, అప్పులపాలవుతున్నారు.

ఒక సన్నకారు రైతు “రెండెకరాలు పోయినా బాధలేదు కానీ వాళ్ళని ఓడించాలి” అంటున్నాడు. దీన్ని ఎన్నికల మానియా అనాలో అనకూడదో కూడా తెలియదు . కనీసం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయా అంటే దాదాపుగా లేవనే చెప్పవచ్చు.

భారత రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, అధికారాలను బదిలీ చేయడానికి 1992 లో 73 వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు. ఈ సవరణల ద్వారా రాజ్యాంగంలోని 243 వ ఆర్టికల్ (జీ) ప్రకారం పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు రాజ్యాంగంలోని 11 వ షెడ్యూల్‌లో అధికారాలను బదిలీ చేయడానికి అవకాశం కల్పించారు. పట్టణ స్థానిక సంస్థల కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డబ్ల్యూ) ప్రకారం కొన్ని విధులను నిర్దేశించారు. కానీ, అధికారాలను బదిలీ చేసే చివరి అధికారం ఆయా రాష్ట్ర శాసనసభల చేతిలోనే పెట్టారు.

అందువల్ల, కేరళ లాంటి రాష్ట్రాలను మినహాయించి అధికారాలు, నిధులు, విధులు మరియు సిబ్బంది పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు బదిలీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉండిపోయాయి. రాజ్యాంగంలో 73 , 74 సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించినప్పటికీ, స్థానిక స్వపరిపాలన అనేది రాష్ట్ర జాబితాలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలే పెత్తనం చేస్తున్నాయి. ముఖ్యంగా, స్థానిక సంస్థలు ఆర్థికంగా దాదాపు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి.

ఇంటిపన్ను స్థానిక సంస్థలే విధిస్తాయి కానీ పన్ను రేట్లను పెంచాలన్నా, కొత్త పన్నులు ఏవైనా విధించాలన్నా రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి. స్థానిక సంస్థలకు గ్రాంట్లు, నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణాధికారాన్ని కలిగి ఉండటం వలన ఈ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసి వస్తుంది. వీటన్నింటిని మించి మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. స్థానిక సంస్థలు ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా వారి సంతకమే ప్రధానం.

ఈ సిబ్బంది బదిలీలు, పదోన్నతులతో పాటు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉన్నది.

ఇక పంచాయతీరాజ్ చట్టాలు, మున్సిపల్ చట్టాలను సవరించడం ద్వారా ప్రజాప్రతినిధుల అధికారాలను తగ్గించడం లేదా మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వాలకు సులభం. ఏదో ఆరోపణతో నిబంధనలు అతిక్రమించారని పంచాయతీలను, మున్సిపల్ కౌన్సిళ్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అవే సాకులతో సర్పంచ్‌లను, చైర్మన్‌లను మరియు మేయర్‌లను పదవుల నుండి తొలగించే అధికారం కూడా ప్రభుత్వ అధికారులకు ఉంటుంది.

అన్నిటికన్నా అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి స్థానిక సంస్థల నిధుల వ్యయాన్ని వాటి ద్వారా చేయిస్తూ ఉంటారు. స్థానిక సంస్థల నిధులను ఎలా తస్కరించాలో తెలియాలంటే, ఆంధ్రప్రదేశ్‌లో వై.సి.పి. హయాంలో జరిగిన ఒక ఉదంతం దేశమంతా చర్చనీయాంశమైంది.

కేంద్ర ప్రభుత్వం 14 మరియు 15 వ ఆర్థిక సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల నిధులను జమ చేసింది.

సర్పంచ్‌లకు, పంచాయతీ సిబ్బందికి కూడా తెలియకుండానే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) మరియు సింగిల్ నోడల్ ఖాతా విధానం పేరుతో అర్ధరాత్రి వేళ గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బకాయిలకు, నవరత్నాల పథకాలకు మళ్లించారు. ఇదీ మన దేశంలో గ్రామ పంచాయతీల స్వయం ప్రతిపత్తి.! న్యాయస్థానం కూడా అసంతృప్తిని వ్యక్తపరచడం మినహా ఏమీ చేయలేకపోయిన ఈ ఉదంతం స్థానిక స్వపరిపాలన చరిత్రలో ఒక బాధాకరమైన మైలురాయిగా మిగిలిపోయింది.

దేశంలో ఉన్న భూమి అంతా పంచాయతీల ఆధీనంలోనో, మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఆధీనంలోనే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడి భూమినైనా ఎవరికైనా, ఏ సంస్థకైనా ధారాధత్తం చేయవచ్చు. ఇందులో ఆయా స్థానిక సంస్థల ప్రమేయం నామమాత్రమే. దేశంలో 65 శాతం ఉపాధి కల్పన జరిగేది గ్రామసీమల్లోనే. మరికొంత ఉపాధి కల్పించే మహానగరాలలో కూడా మౌలిక వసతులు కల్పించే సంస్థలకు స్వయం ప్రతిపత్తి లేదు.

పాశ్చాత్య దేశాలలో – అది అమెరికా, యూరప్, బ్రెజిల్ లాంటి దేశాలలో – స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తితో తులతూగుతున్నాయి. భూమి వాటిదే, భూమిపైన పెత్తనం కూడా వాటిదే. ఆ భూభాగాన్ని అమ్ముకోవడమా, ఎవరికైనా కేటాయించడమా అనేది ఆయా సంస్థల ఇష్టం. వాటికి అవసరమైన సిబ్బంది నియామకాలను ఆయా సంస్థలే చూసుకుంటాయి. పోలీసు యంత్రాగాన్ని కూడా అవే ఏర్పాటు చేసుకుంటాయి. ఆయా సంస్థల పరిధిలో ఉండే ప్రజల విద్యా, వైద్యం అన్నీ స్థానిక సంస్థలే చూసుకుంటాయి.

ఏకపార్టీ పాలనలో ఉండే చైనాలో కూడా స్థానిక సంస్థల సభ్యులను కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతీయ కమిటీల నుండి వారే ఎన్నుకుంటారు. కానీ స్థానిక సంస్థల అధికారాలు మాత్రం అపరిమితం. చైనాలో రాజకీయ కేంద్రీకరణ ఉన్నప్పటికీ ఆర్థికంగా అత్యధిక వికేంద్రీకరణ ఉంటుంది. మొత్తం ప్రభుత్వ వ్యయంలో చైనా స్థానిక ప్రభుత్వాలు 50 శాతం కంటే ఎక్కువ నిధులను నేరుగా ఖర్చు చేయగలవు. స్థానిక సంస్థలకు ఆర్థికాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే ప్రాథమిక లక్ష్యం. భూసేకరణ, అనుమతులు ఇచ్చే అధికారాలు స్థానిక సంస్థలవే.

అమెరికాలో స్థానిక సంస్థలు మన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలతో పోటీపడతాయి. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో వంటి నగరాల్లో స్ట్రాంగ్ మేయర్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ మేయర్ నగరానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. నగర పోలీస్ శాఖ, ఫైర్‌బ్రిగేడ్, ఆరోగ్యం, పబ్లిక్ వర్క్స్ విభాగాల అధికారులను నియమించే మరియు తొలగించే అధికారం వారికే ఉంటుంది. ప్రతి నగరానికి సొంత సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉండటం అమెరికా స్థానిక సంస్థల ప్రత్యేకత. ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు వారే తీసుకుంటారు.

బ్రెజిల్‌లో స్థానిక సంస్థలకు రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి. యూరోపియన్ దేశాలలో శతాబ్దాలుగా స్థానిక సంస్థల పరిపాలన స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. యూరోపియన్ చార్టర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ప్రకారం అక్కడ స్థానిక సంస్థలకు రాజ్యాంగపరమైన స్వయం ప్రతిపత్తి మరియు విస్తృత అధికారాలు ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాధికారం ఎంతగా ఉంటుందంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేనంతగా ఉంటాయి.

కానీ మన దేశంలో స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు అని చెప్పే ఏ వ్యవస్థకూ లేనిదే స్వయం ప్రతిపత్తి ! కానీ స్థానిక సంస్థల ఎన్నికల ఆర్భాటం చూస్తే ప్రధానమంత్రిని ఎన్నుకునేంత హడావిడి. గాంధీగారు కలలు కన్న ‘గ్రామ స్వరాజ్యం’ అంటే అర్థం కూడా తెలియకుండానే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. మహాత్ముడు కలలు కన్న అటువంటి మరో ప్రపంచం ఎప్పటికీ సాక్షాత్కరిస్తుందో.!

Total Visitors: 3,329,235