నిర్మల్ గడ్డపై కనివినీ ఎరుగని రీతిలో కేటీఆర్ రైతు గర్జన సభ

- మాటల గారడీలు కట్టిపెట్టి ఇచ్చిన హామీలు అమలు చెయ్ రేవంత్ రెడ్డి
- అసలైన కేడీ ఎవరో, లంచం ఇస్తూ జైలుకు వెళ్ళింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు
- అదిలాబాద్‌ను మించి నిర్మల్ సభ…వాహనాలు సరిపోనంతగా వెల్లువెత్తుతున్న ప్రజాస్పందన..
- రికార్డు స్థాయిలో తరలివచ్చి సభను చారిత్రాత్మక విజయం చేయాలని రైతాంగానికి వేముల పిలుపు
- మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిర్మల్ : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, ప్రజా వ్యతిరేక విధానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి కొండంత అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ గడ్డపైకి వస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న కేటీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభ కంటే అత్యంత భారీ స్థాయిలో నిర్మల్ రైతు సభ చరిత్ర సృష్టించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతాంగం సగౌరవంగా బతికిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, సకాలంలో యూరియా-ఎరువుల పంపిణీ, పంట వేయగానే ఖాతాల్లో పడే రైతుబంధు, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి మరో వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా పకడ్బందీ వ్యవస్థ ఉండేదని గుర్తుచేశారు.
ప్రగల్భాలు కట్టిపెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయండి
రూ. 50 లక్షల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లింది ఎవరో, అసలైన కేడీ ఎవరో తెలంగాణ సమాజానికి పూసగుచ్చినట్లు తెలుసని విమర్శించారు. నిర్మల్ లో రేపు జరిగే కేటీఆర్ రైతు గర్జన భారీ బహిరంగ సభకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోందని తెలిపారు. తొలుత అంచనా వేసిన వాహనాల కంటే మూడింతల వాహనాలు కావాలని గ్రామాల నుంచి రైతులు, యువత, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా కోరుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. సభా ప్రాంగణం విస్తీర్ణం దృష్ట్యా రద్దీ, తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు మహిళలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశామని, రాబోయే రోజుల్లో మహిళా వర్గాల కోసం ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సభ సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమై రాత్రి 7:30 గంటల వరకు కొనసాగుతుందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయంత్రం 4:00 నుంచి 4:30 గంటల మధ్య సభా వేదికకు చేరుకుంటారని వెల్లడించారు. రైతాంగం, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో సాయంత్రం 4:00 గంటలకల్లా సభా స్థలికి చేరుకుని, సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న,ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్షన్ నాయక్,తదితరులు మరియు నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
