పాలమూరును బతికించే ప్రయత్నం చేస్తున్నాం

- కొడంగల్–నారాయణపేటకు సాగునీరు, పరిశ్రమలు తెస్తున్నాం
- బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు తీరని అన్యాయం
- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్: వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. జూరాల నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని తరలించి ఉంటే కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందేదని, కానీ కేసీఆర్ ఆ ప్రాంతాల గొంతు కోశారని ఆరోపించారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు.
వర్షపాతం తక్కువగా ఉండటం, సాగునీటి వనరులు లేకపోవడంతో పాలమూరు జిల్లా వెనుకబడిందన్నారు. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లో వలసలు తీవ్రంగా ఉన్నాయని, దాదాపు 25 శాతం కుటుంబాలు ఉపాధి కోసం ముంబై సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. జూరాల నుంచి కొడంగల్ 80 కిలోమీటర్లు, నారాయణపేట 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా కాలువలు నిర్మించి నీరివ్వలేదని ప్రశ్నించారు.
లక్ష ఎకరాలకు సాగునీరు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పనులను వేగవంతం చేసిందని యెన్నం తెలిపారు. ఈ పథకం ద్వారా లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణకు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, తమ ప్రభుత్వం ఉద్దండాపూర్ రిజర్వాయర్ భూసేకరణకు రూ.600 కోట్లు ఇచ్చిందన్నారు.సంగంబండ ప్రాజెక్టు పనులకూ నిధులు కేటాయించి రైతులకు నీరందించే చర్యలు చేపట్టామని తెలిపారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించి కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు.
పరిశ్రమలు, విద్యా సంస్థలతో అభివృద్ధి
కొడంగల్ ప్రాంతంలో 5 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు యెన్నం వెల్లడించారు. ఇందుకోసం భూములిచ్చేందుకు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, ఎకరానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించామని చెప్పారు. గతంలో రెండు పంటలు పండే భూములను ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల పరిహారంతో సేకరించారని విమర్శించారు. శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు ఎనిమిది వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని, కొడంగల్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యా హబ్ ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాల్లో విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు ఏటా రూ.20 వేల కోట్ల నిధులు ఇస్తామని సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. కరువు పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, సీఎం వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం పుట్టినరోజు వేడుకలను అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా నిర్వహించలేదని, కొడంగల్‌లో కుటుంబ సభ్యుల మధ్యే కేక్ కట్ చేశారని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఏడాదిలో 300 రోజులు ఫామ్‌హౌస్‌లోనే గడిపారని విమర్శించారు. ప్రస్తుతం ఏ సంక్షేమ కార్యక్రమమూ ఆగలేదని, సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.4 వేల కోట్లు అందించామని తెలిపారు.
