November 14, 2026

రాహుల్ గాంధీ గారూ.. రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టండి

  • ప్రజలకు కావాల్సింది జిమ్మిక్కులు కాదు, హామీల అమలు
  • ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెడితే సరిపోదు
  • ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవం
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల వైఫల్యాలపై సమీక్ష జరిపి లెక్క అడగాలి
  • మూడు బడ్జెట్లు గడిచినా భూమిలేని వ్యవసాయ కూలీలకు అందని ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ రూ. 12 వేల సాయం
  • రూ. 6,000 కోట్ల ‘రాజీవ్ యువ వికాసం’ కాగితాలకే పరిమితం.. నిరుద్యోగులకు దక్కింది శూన్యం
  • ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీని నిలదీసిన హరీశ్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెట్టి, మూడు బడ్జెట్లు గడిచినా నిరుపేద కూలీలు, నిరుద్యోగ యువతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో ఎండగడుతూ రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఇంకా ఏమన్నారంటే..దివంగత మాజీ ప్రధానులు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పట్ల నిజంగా గౌరవం ఉంటే.. కేవలం పథకాలకు వారి పేర్లు తగిలిస్తే సరిపోదు, వారి పేరు మీద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుంది.

రాహుల్ గాంధీ గారూ.. మీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును, వారు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లను సమీక్షించడానికి ఇదే సరైన సమయం. ఇవి కేవలం బడ్జెట్ ప్రకటనలు మాత్రమే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు. మరి ఇప్పటికీ అవి ఎందుకు అమలు కాలేదో ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోండి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్.. హామీలు ప్రకటించడం.. పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం.. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం..ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి, పాత బడ్జెట్ ప్రకటనలనే మళ్లీ మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని 2024-25 బడ్జెట్‌లో ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత 2025-26 బడ్జెట్‌లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. కానీ వరుసగా మూడు బడ్జెట్లు పూర్తయినా నేటికీ ఆ నిరుపేద కూలీలకు ఇస్తామన్న రూ. 12 వేల సాయం అందలేదు. కాంగ్రెస్ భాషలో హామీల అమలు అంటే ఇదేనా?

మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు 2025-26 బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ. 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ 2026-27 బడ్జెట్‌లోనూ అదే రూ. 6,000 కోట్ల అంకెను వల్లెవేశారు. బడ్జెట్ కాగితాల మీద వేల కోట్ల అంకెలు కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో నిధుల విడుదలేది? అమలు ఎక్కడ? ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ సాయం ఎప్పుడు అందుతుంది?

మూడు బడ్జెట్లు మారినా.. అవే పాత హామీలు, అవే కాగితపు ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి ఇసుమంతైనా జవాబుదారీతనం లేదు. పేదల, యువత పక్షపాతిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. తన సొంత మేనిఫెస్టో హామీలను ఇంత దారుణంగా తుంగలో తొక్కడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఓట్ల కోసం మీరు పదేపదే చెప్పిన మాటలను నమ్మిన భూమిలేని కూలీలు, నిరుద్యోగ యువత ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలి?

రాహుల్ గాంధీ గారూ.. ఇకనైనా రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టండి. ఎన్నికల్లో హామీలు ఇవ్వడంతోనే మీ బాధ్యత తీరిపోదు, అవి ప్రజలకు అందేలా చూడటమూ మీ బాధ్యతే. తక్షణమే మీ ప్రభుత్వ మూడు బడ్జెట్లపై సమీక్ష జరిపి, అమలు కాని ప్రతి మేనిఫెస్టో హామీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసి లెక్క అడగండి.

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు కాదు.. సుపరిపాలన! మోసాలు కాదు.. హామీల అమలు..పాత హామీల తిరగబోత కాదు.. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి.

Total Visitors: 3,425,490