November 14, 2026

కూటమిలో చిచ్చుకు ప్రధాన పార్టీ అభిమానులే కారణం

  • విజయవాడ, అనంతపురంలో బీజేపీ ఓటమికి కారకులెవరు?
  • సీట్లిచ్చి గెలిపించకపోతే అది కూటమి ధర్మం ఎలా అవుతుంది?
  • బలం లేకుండా పోటీ చేసి ఓడిపోయా రునడం తెప్ప తగలేయడమే
  • ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే మాటలు కట్టి పెట్టండి
  • పనికిమాలిన వ్యాఖ్యలు టీవీలలో తగ్గించండి
  • అసలు కూటమి ధర్మం పాటించిందెవరు?
  • ఎమ్మెల్యే, మంత్రుల పర్యటనలో బీజేపీ, జనసేన నాయకులకు ప్రాధాన్యం ఏదీ?
  • బీజేపీ, జనసేన ల్యాండ్ స్కాం, శాండ్ స్కాం, లిక్కర్ స్కాం, గ్రానైట్ స్కాం, మైనింగ్ స్కాం ఉన్న కార్యకర్తల పార్టీ కాదు

స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా వార్డు కౌన్సిలర్, డివిజన్ కార్పొరేటర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లలో బిజెపి, జనసేన బలం లేకుండా అలయన్స్ లో పోటీ చేయడం వల్లనే వైసీపీ విజయం సాధించిందని కొంతమంది విశ్లేషకులు, టిడిపిలో వైసీపీ అనుకూలురు, బిజెపి, జనసేన వ్యతిరేకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

వాస్తవాలలోకి వస్తే.. పార్టీల బలాబలాలనేవి కొంత ఆర్థిక బలం, అంగ బలం, స్థానిక పరిస్థితులు, కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిసి, అభ్యర్థికి సహాయ పడకపోవడం వల్లనే ఓటమి పాలవుతారు. అందులో స్వార్థ చింతన లేకుండా పనిచేయడం అనేది కూటమి ధర్మం. ఆ ధర్మాన్ని వీడినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

జనసేన, బిజెపి అభ్యర్థులు ప్రజలలో అంత బలమైన ప్రాచుర్యం కలిగిన వారు కాదు అని మాట్లాడుతుంటారు. కొంతవరకు వస్తుంది…. పార్టీకి కార్యకర్త నిబద్ధత తో పనిచేస్తారు అని తెలిసినప్పుడు.. కచ్చితంగా పోటీకి దింపుతారు. అభ్యర్థి ప్రధాన పార్టీ కళ్ళల్లో పడకపోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.


ముఖ్యమంత్రి కి కేంద్రంతో ఏదైనా అవసరమైతే ఢిల్లీకి వెళ్లి, వరుస పెట్టి ఏ మంత్రి అవసరమైతే ఆ మంత్రి తో మాట్లాడుతుంటారు. పనులు చక్కబెట్టుకుంటారు. అవసరమైతే హోం మంత్రి , ప్రధానమంత్రిని కూడా కలిసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చించుకుంటారు. కూటమి ధర్మం కాబట్టి చేయాలి కూడా.

మరి స్థానికంగా ఎమ్మెల్యే ఎంతమంది బిజెపి, జనసేన కార్యకర్తలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారు? మంత్రులు జిల్లాలకు పర్యటనకు వచ్చినప్పుడు ఎంత మంది బిజెపి నాయకులను పిలిచి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు? ఆలోచించుకోవాలి. వీరికి ప్రజలలో, అధికారుల దగ్గర భాగస్వామ్యం కల్పించకపోతే, కార్యకర్త ప్రజల కళ్ళల్లో ఎలా పడతారు? ప్రజలు, అధికారులు ఎలా గౌరవిస్తారు? ఈ పార్టీలకు ఉండేది ఎక్కువగా ఇలాంటి కార్యకర్తలే. ల్యాండ్ స్కాం, సాండు స్కాం, లిక్కర్ స్కాము, గ్రానైట్ స్కాం, మైనింగ్ స్కాము ఉన్న కార్యకర్తలు కాదు.

అయితే స్థానికంగా బిజెపి, జనసేన లు కూడా బలపడాలని, కేవలం ప్రధాన పార్టీ మీదనే ఆధారపడి ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తాము అనుకోవడం పొరపాటే. కానీ పొత్తు ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత కూటమి పార్టీల మీద ఉంటుంది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రినే.. శశికళ అనే జనసేన ఎంపీటీసీ అభ్యర్థి, ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఎమ్మెల్యే నాకు సహకరించడం లేదు అని మాట్లాడిన మాటలు, మనం సోషల్ మీడియాలో చూసాం. వారు ఆమె మాటలను ఎంత మాత్రం సీరియస్ గా తీసుకున్నారు? ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.

గ్రామాలలో సహజంగానే పెత్తందారీ వ్యవస్థ అనాదిగా రాజకీయం చేస్తూ, గ్రూపులను కట్టుకొని బలపరుచుకుంటూ రాజకీయం చేస్తున్న పరిస్థితులలో.. మా పార్టీ కాకుండా వీరొచ్చారే ఎలా చేయాలని మదనపడుతూ, ఈ ఎన్నికలో ఓడిస్తే తిరిగి ఈ ప్రాదేశికం వైపు చూడరు అనే అభిప్రాయం ,ఈ పెత్తందారి రాజకీయం చేసే మనుషులకు సహజంగానే ఉంటుంది.చాలాచోట్ల బీజేపీ ఓటమికి.. తెరవెనక అసలు కారణం కూడా ఇదేనని ఫలితాల తర్వాత స్పష్టమయింది.

పోటీ చేసిన పార్టీ అభ్యర్థికి, బలం తక్కువగా ఉన్నప్పటికీ కూటమిగా పోరాడితే కచ్చితంగా గెలుస్తారు. అది అన్ని పార్టీల అభ్యర్థులకు వర్తిస్తుంది. . దానిని మరిచినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. గతాన్ని ప్రతి పార్టీ కార్యకర్త గుర్తుంచుకోవాలి. గతం మరిచిపోతే ఇలాగే ఉంటుంది. మాకు అంతవరకే మీ సహాయం అవసరం అనుకుంటే, పక్క పార్టీలు కూడా రాజకీయం చేసేవే.

కొన్ని పరిస్థితుల దృష్ట్యా స్థానికంగా ఆ పార్టీ అభ్యర్థికి బలం లేకపోయినా, కూటమిలో పోటీ చేస్తున్నప్పుడు కూటమిని గెలిపించాలని పట్టుదల ఉంటే, రాష్ట్రంలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంతమంది వ్యాఖ్యాతలు.. అనంతపురంలో బిజెపి ఓడిపోయింది. అక్కడ బిజెపికి సరైన బలం లేదు 20% నెగటివ్ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. మరి 80% పాజిటివ్ ఓటింగ్ సంగతి ఏంటి? కూటమిలో ఉన్న మిగతా పార్టీల బలం సంగతి ఏంటి?

అనంతపురంలో బీజేపీ మేయర్ అభ్యర్ధి ఓటమికి టీడీపీ, జనసేన ఓట్లు బదిలీ కాకపోవడమే ప్రధాన కారణమని. వచ్చిన ఫలితాలు స్పష్టం చేశాయి. లేకపోతే జనసేన, టీడీపీకి డివిజన్లలో ఎక్కువ ఓట్లు, బీజేపీ మేయర్ అభ్యర్ధికి తక్కువ ఓట్లు ఎందుకు వస్తాయి? బీజేపీ పోటీ చేసిన డివిజన్లలో టీడీపీ రె బెల్‌గా దిగితే, కూటమి ధర్మం ప్రకారం వారిని బరి నుంచి తప్పించాల్సిన బాధ్యత కూటమిలోని ప్రధాన పార్టీకి లేదా?

ఇవన్నీ చేయకుండా.. పేరుకు సీటు ఇచ్చామని చెప్పి, చిత్తశుద్ధితో వారిని గెలిపించే ప్రయత్నాలు చేయకుండా.. చేతులు దులుపేసుకుంటే, ఫలితాలు ఇంతకు భిన్నంగా ఎలా ఉంటాయి?

విజయవాడ వెస్ట్‌లో ఐదు సీట్లు కమ్యూనిస్టులు, దళితులున్న వార్డులు బీజేపీకి కేటాయించారు. ఫలితంగా నాలుగు చోట్ల బీజేపీ ఓటమి పాలయింది. నగరంలో కమ్యూనిస్టు పార్టీకి వచ్చిన ఏకైక స్థానం కూడా ఈ నియోజకవర్గం నుంచే. కమ్యూనిస్టుల మద్దతుతో మేయర్‌గా పోటీ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు, కమ్యూనిస్టు కార్పొరేటర్‌గా గెలిచిన డివిజన్‌లోనే అత్యధికంగా 5 వేల ఓట్లు రావటం విస్మరించకూడదు.

అంటే కమ్యూనిస్టులు, దళితులు ఎక్కువగా డివిజన్లు బీజేపీకి కేటాయించి, ఎన్నికల్లో ఆ అభ్యర్ధుల విజయం కోసం పనిచేయకుండా.. బీజేపీకి సీట్లు ఇచ్చినా బలం లేక ఓడిందన్న వాదన అర్ధరహితమే కాదు. అమాయకత్వం కూడా.
పోనీ అసలు సీట్ల ఎంపిక అంశంపై స్థానిక ఎమ్మెల్యేతో ఎవరైనా చర్చించారా? పైగా అక్కడ జనసేన అభ్యర్ధులు రెబెల్‌గా పోటీ చేశారు. మరి కూటమి ధర్మం ప్రకారం వారిని బరి నుంచి తప్పించాల్సిన బాధ్యత ఎవరిది? బీజేపీ అభ్యర్ధులకు పనిచేయని వారిపై వేటు వేస్తే కదా కూటమి ధర్మం నిలబడేది? వేటు వేయలేదంటే.. వారిని ఆయా పార్టీలే ప్రోత్సహించారన్న తప్పుడు సంకేతాలు వెళ్లడం లేదా? ఆలోచించాలి. అనంతపురం, విజయవాడ వెస్ట్‌లో పనిచేయని నాయకులపై టీడీపీ, జనసేన నాయకత్వాలు వేటు వేస్తేనే భవిష్యత్తులో కూటమిపై విశ్వసనీయత ఏర్పడుతుంది. ఇది ఆ రెండు పార్టీల తక్షణ ధర్మం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్ర హ్మండమైన మెజారిటీ వచ్చిన విజయవాడ వెస్ట్‌లో.. జనసేన మేయర్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధులకు అతి తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి? అంటే టీడీపీ, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ కాలేదని అర్ధమవుతోంది కదా? ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ బీజేపీ విజయానికి పనిచేయలేదనే కదా అర్ధం?!

పోనీ అక్కడ కొందరి వాదన ప్రకారం, బీజేపీకి బలం లేదనుకుందాం. మరి టీడీపీ-జనసేన బలం ఏమైంది? ఆ రెండు పార్టీలకూ బలం లేనట్లేనా? నిజం అది కాదు కదా?! ఇలాంటి లాజిక్కులు చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తాయి.


ఈ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే మాటలు కట్టి పెట్టండి. ఈ విధమైన పోకడ ఇలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈ విషయం కూటమి పార్టీలన్నీ కూడా గుర్తుంచుకుంటేనే, రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తుంది.
రాష్ట్రం మాదే.

మాకే ఎక్కువ బలం ఉంది అనుకుంటే.. వంద రూపాయలు టికెట్ అయితే, మీ దగ్గర ఉండేది 70 రూపాయలే. ఆ 70 రూపాయలు 30 రూపాయలు కాకుండా.. ఈ 30 రూపాయలు 70 రూపాయలు కాకుండా చూసుకోండి. సరైన అభ్యర్థికి సీటు ఇవ్వలేదు అనే అసంతృప్తి పక్క పార్టీ కార్యకర్తలకు కూడా ఉంటుంది. కూటమికి అర్థం తెలుసుకోండి. ఈ విధంగా ఆలోచిస్తే రాష్ట్రం గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. జరిగింది.. జరగబోయే దానిని జాగ్రత్తగా ఆలోచించుకుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు. ఈ పనికిమాలిన వ్యాఖ్యలు టీవీలలో తగ్గించండి. మాటలు అందరికీ వచ్చు. ప్రతి ఒక్కరూ ఎవరి వ్యాఖ్యానం వారు చేయగలరు.


– కరణం భాస్కర్
(రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు)
7386128877.

Total Visitors: 3,425,477