November 14, 2026

ఆమె సుశీలమ్మ..మరో కోయిలమ్మ!

ఆమె గొంతు తెలుగు
సినిమా పాట..
తేట తెనుగు ఊట..
ఆ గళం శారద కంటి నీరు
పాటల సెలయేరు..
సావిత్రి పెదవి
విరుపు హొయ
సంగీత సరస్వతి లయ
వాణిశ్రీ ఉరుకు
పచ్చగడ్డి కోసేటి చురుకు
జననీ శివకామినీ
అంటూ జగజ్జననిని మెప్పించిన ఆర్ద్రత..
సీతమ్మ శోక స్వరం..
సాగరసంగమ సిరిసిరిమువ్వ..!

పాడనా తెనుగు పాట
పరవశనై..నే పరవశనై..
ఆమె పాడిన ఈ పాట
తెలుగు జాతికి ఖ్యాతి
తెలుగు సంస్కృతికి ప్రఖ్యాతి
రాయినైనా కాకపోతిని..
ఈ మధురగీతం రామపాదమునే గాక
ప్రతి తెలుగు గుండెను
తాకి కరిగించింది..
ఆమె గొంతున
కురుక్షేత్రంలో
మ్రోగింది కళ్యాణవీణ..
వస్తాడు నా రాజు ఈరోజు..
సీతారామరాజు హిట్టులో
ఈ పాటే రారాజు..!

సావిత్రి నుంచి
సౌందర్య వరకు
ప్రతి నాయికకు
సుశీలమ్మ పాటే అందం..
ఆమె గొంతే మకరందం..
ఆ స్వరం తెలుగు సినిమా
సంగీత చరితకు ముఖద్వారం..
అప్పటికీ..ఇప్పటికీ
ఈ తెలుగింటి కోకిలమ్మకు
పాటే పరమార్థం..
వేల మధురగీతాలు
ఆలపించి అలరించిన
ఆమె బ్రతుకు చరితార్థం..!

ఇచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ.. విద్యలనగరం ఆడపడుచు సుశీలమ్మ జన్మదిన వేళ నమస్సులతో..

  • సురేష్ కుమార్ ఎలిశెట్టి
    9948546286
Total Visitors: 3,425,485